సోషల్ మీడియాలో విజ్ఞప్తికి స్పందించిన త్రిపుర సీఎం

ABN , First Publish Date - 2021-11-03T20:51:58+05:30 IST

ఎనిమిదేళ్ళ వయసున్న రహమాన్ హసన్ కన్నీటితో చేసిన

సోషల్ మీడియాలో విజ్ఞప్తికి స్పందించిన త్రిపుర సీఎం

అగర్తల : ఎనిమిదేళ్ళ వయసున్న రహమాన్ హసన్ కన్నీటితో చేసిన విజ్ఞప్తికి త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ సానుకూలంగా స్పందించారు. ఆ బాలుని తల్లి నిహరుంగ్ బేగమ్ కేన్సర్ చికిత్సకు సహాయపడేందుకు ముందుకొచ్చారు. ఆమె పరిస్థితిని తెలుసుకోవాలని ఆదేశిస్తూ త్రిపుర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ రాజీబ్ భట్టాఛార్జీని పంపించారు. 


బేగమ్‌ను మంగళవారం అగర్తలలోని ప్రాంతీయ కేన్సర్ ఆసుపత్రికి తరలించారు. ఆమెను ఆ ఆసుపత్రిలోనే భట్టాఛార్జీ పరామర్శించారు. ఆమె పరిస్థితిని ముఖ్యమంత్రి బిప్లబ్ తెలుసుకున్నారని, అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారని, ఆమెకు తెలిపారు. అనంతరం వివేకానంద విచార్ మంచ్ తరపున ప్రాథమిక సహాయంగా రూ.10,000 ఆమెకు అందజేశారు. అనంతరం ఈ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ గౌతమ్ మజుందార్‌తో మాట్లాడారు. నిహరుంగ్ బేగమ్ కుటుంబం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నందువల్ల ఉచితంగా మందులు, ఇతర ప్రయోజనాలను పొందడానికి అర్హత ఉందని తెలుసుకున్నారు. 


భట్టాఛార్జీ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, గండచెరకు చెందిన నిహరుంగ్ బేగమ్, ఆమె కుమారుడు రహమాన్ చేసిన విజ్ఞప్తిని సామాజిక మాధ్యమాల ద్వారా ముఖ్యమంత్రి బిప్లబ్ తెలుసుకున్నారని చెప్పారు. కేన్సర్ చికిత్సకు ఆర్థిక సాయం చేయాలని వారు ముఖ్యమంత్రిని కోరారని చెప్పారు. దీంతో బిప్లబ్ తమను పంపించారని చెప్పారు. ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకునే బాధ్యతను తమకు అప్పగించారన్నారు. ఆమెను గండచెర నుంచి అగర్తలలోని ప్రాంతీయ కేన్సర్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. 


Updated Date - 2021-11-03T20:51:58+05:30 IST