UAE లో త్రిషకు అరుదైన గౌరవం.. తొలి తమిళ నటిగా రికార్డ్!

ABN , First Publish Date - 2021-11-04T14:04:35+05:30 IST

నటి త్రిష కృష్ణన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆమెకు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసింది.

UAE లో త్రిషకు అరుదైన గౌరవం.. తొలి తమిళ నటిగా రికార్డ్!

దుబాయ్: నటి త్రిష కృష్ణన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆమెకు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసింది. పదేళ్ల కాలపరిమితితో త్రిషకు యూఏఈ ఈ లాంగ్‌టర్మ్ రెసిడెన్సీ వీసాను జారీ చేసింది. కాగా, గోల్డెన్ వీసా అందుకున్న తొలి తమిళ నటి త్రిషనే కావడం విశేషం. ఈ సందర్భంగా త్రిష సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. "గోల్డెన్ వీసా పొందిన తొలి తమిళ యాక్టర్ కావడం ఆనందంగా ఉంది. యూఏఈ ప్రభుత్వానికి, అధికారులకు ధన్యవాదాలు" అని ఆమె ట్వీట్ చేశారు. వీసా అందుకుంటున్న ఫొటోను ఈ ట్వీట్‌కు జత చేశారు.  


ఇదిలాఉంటే.. భారత్ నుంచి ఇప్పటివరకు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు యూఏఈ ఇచ్చే ఈ గోల్డెన్ వీసాను అందుకున్న సంగతి తెలిసిందే. వీరిలో బాలీవుడ్‌కు చెందిన షారూక్ ఖాన్, సంజయ్‌దత్, సునీల్ షెట్టి, బోనీ కపూర్ ఫ్యామిలీ, సంజయ్ కపూర్, ఊర్వశి రౌతేలా, ఫరా ఖాన్ కుందన్ ఉన్నారు. అలాగే మలయాళం నుంచి మోహన్‌లాల్, మమ్ముటీ, పృథ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ ఉన్నారు.




వీరితో పాటు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ప్రముఖ గాయని కేఎస్ చిత్ర కూడా ఇటీవల గోల్డెన్ వీసా అందుకున్నారు. ఇక సినిమా రంగాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో అంతర్జాతీయ ప్రతిభావంతులను ప్రొత్సహించాలని యూఏఈ సర్కార్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల గాయని చిత్ర, బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్, మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్‌లకు గోల్డెన్ వీసాలు మంజూరు చేసింది. తాజాగా ఈ జాబితాలో త్రిష చేరింది.  

Updated Date - 2021-11-04T14:04:35+05:30 IST