రేషన్‌ కార్డుల కోసం పరేషాన్‌

ABN , First Publish Date - 2021-07-30T05:49:51+05:30 IST

కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ ప్రక్రియ ఓ ప్రహసనంగా మారింది. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఏళ్ల తరబడి నిరీక్షించినా, కార్డులు మంజూరుకాకపోవడంతో లబోదిబోమంటున్నారు.

రేషన్‌ కార్డుల కోసం పరేషాన్‌
తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న కాంగ్రెస్‌ నేతలు

ఆహారభద్రత కార్డుల పంపిణీలో నిర్లక్ష్యం

జిల్లాలో 1,282 తిరస్కరణ


కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ ప్రక్రియ ఓ ప్రహసనంగా మారింది. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఏళ్ల తరబడి నిరీక్షించినా, కార్డులు మంజూరుకాకపోవడంతో లబోదిబోమంటున్నారు. జిల్లావ్యాప్తంగా 1,282 దరఖాస్తులను తిరస్కరించగా, భూదాన్‌పోచంపల్లి మండలంలో కేవలం 33 కార్డులను మాత్రమే మంజూరు చేశారు. ఇదిలా ఉంటే రెండేళ్ల క్రితం వరకు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే.. అంటే 2019 వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారి దరఖాస్తులను పరిగణలోకి తీసుకొని మిగతా వాటిని పక్కన పడేయడంతో అర్హులకు రేషన్‌కార్డు అందకుండాపోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి. రేషన్‌కార్డుల మంజూరీలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గురువారం భూదాన్‌పోచంపల్లి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. 


భూదాన్‌పోచంపల్లి, జూలై 29: ఆహార భద్రత కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారికి నిరాశే మిగిలింది. కొత్త రేషన్‌కార్డుల కోసం తహసీల్దార్‌ కార్యాలయాల్లో నేరుగా దరఖాస్తున్న చేసుకున్న వారిలో చాలామందిని యూనిట్‌ యాడ్‌ (అంతకు ముందున్న కార్డుకు జతచేయడం) చేయడంతో వారికి కొత్తకార్డులు రాకుండాపోయాయి. కేవలం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికే కార్డులు జారీ చేస్తుండగా, నేరుగా దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. 2019 వరకు వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిశీలించారు. కొత్త వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. వచ్చిన వాటికి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు విచారణ పూర్తి చేయగా తహసీల్దార్‌ సిఫారసుతో డీఎ్‌సవో ఆమోదించారు. జిల్లాలో 7,216 మంది కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు వీటిని క్షేత్రస్థాయిలో అన్ని కోణాల్లో పరిశీలించి 1,282 దరఖాస్తులను తిరస్కరించారు. 5,934 మందిని అర్హులుగా గుర్తించారు.  జిల్లాలో ఇప్పటికే 2,13,805 రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటితో కలిపి మొత్తం కార్డులు 2,19,739కు పెరగనున్నాయి. నూతనంగా మంజూరైన కార్డుల్లో 14,414 యూనిట్లు సభ్యులుగా ఉండగా ఒక్కొక్కరికి నెలకు 15కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం నెలకు అదనంగా రూ.64,86,300 ఖర్చు చేయనుంది. ఈనెల 31 వరకు కార్డులు పంపిణీ చేసి ఆగస్టు నుంచి రేషన్‌ కోటా అందజేయనుంది. 


వారికి నిరాశే మిగిలింది

ప్రభుత్వం తుది మార్గదర్శకాల మేరకు కార్డుల పంపిణీకి పౌరసరఫరాల అధికారులు సిద్ధం చేశారు. ప్రజాప్రతినిధులతో లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డుల పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం విధితమే. 2018 నుంచి దరఖాస్తుదారులు కొత్త రేషన్‌ కార్డుల మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు. 2020-21 నుంచి వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోకపోవడంతో వారు నిరాశలో ఉన్నారు. మ్యుటేషన్లు, కొత్త యూనిట్‌లు చేర్చడం కూడా ప్రభుత్వం చేపట్టకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. 



415 దరఖాస్తులకు 33 ఆమోదం 

జిల్లాలోని 17 మండలాల్లో మొత్తం 7,216 మంది కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో 1,282 తిరస్కరించారు. భూదాన్‌పోచంపల్లి మండలంలో కేవలం 68 దరఖాస్తులు రావడం గమనార్హం. వాటిలో తిరస్కరించినవి 35 కాగా, మిగిలిన 33కు ఆమోదం లభించింది. భూదాన్‌పోచంపల్లి మండలవ్యాప్తంగా ఆఫ్‌లైన్‌లో 415 దరఖాస్తులు అందాయి. ఆన్‌లైన్‌లో 68 దరఖాస్తులకు 33 ఆమోదం పొందాయి. మొత్తం యూనిట్లు 613గా అధికారులు గుర్తించారు. జిల్లాలో అతి తక్కువ రేషన్‌ కార్డులు పంపిణీ భూదాన్‌పోచంపల్లిలో కావడం ఇందుకు అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమని కాంగ్రెస్‌ నేతలు ఆందోళనకు సిద్ధమయ్యారు. కాగా, ఈనెల 29న గురువారం భూదాన్‌పోచంపల్లిలో ఎమ్మెల్యై పైళ్ల శేఖర్‌రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల చౌటుప్పల్‌లో మంత్రి జగదీ్‌షరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య జరిగిన వాగ్వాదంతో భూదాన్‌పోచంపల్లిలోనూ గురువారం నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేశారు. అయితే గురువారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నాకు పిలిపునివ్వడంతో అధికారులు రేషన్‌ కార్డుల పంపిణీ వాయిదా వేసినట్లు సమాచారం.  


కాంగ్రెస్‌ పార్టీ నాయకుల ధర్నా 

రేషన్‌కార్డులు మంజూరు చేయడంలో భూదాన్‌పోచంపల్లి అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యవైఖరితో పేదలకు రేషన్‌కార్డులు అందకుండా పోతున్నాయని కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు పాక మల్లే్‌షయాదవ్‌, పట్టణ అధ్యక్షుడు గునిగంటి ర మే్‌షగౌడ్‌ ఆరోపించారు. భూదాన్‌పోచంపల్లి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట గురువారం కాంగ్రెస్‌ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. వీరి ఆందోళనలకు సీపీఎం పట్టణ కమిటీ కార్యదర్శి గడ్డం వెంకటేష్‌ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ భూదాన్‌పోచంపల్లి మండలంలో కేవలం 33 రేషన్‌ కార్డులు మాత్రమే కొత్తవి మంజూరు చేయడం విచాకరమన్నారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు. 



నిబంధనల మేరకు పంపిణీ : దశరథ నాయక్‌, తహసీల్దారు, పోచంపల్లి  

భూదాన్‌పోచంపల్లి మండలవ్యాప్తంగా రేషన్‌ కార్డులకోసం మొత్తం 648 దరఖాస్తులు వచ్చాయి. అందులో 613 యూనిట్లు అంగీకరించాం. అయితే యూనిట్‌ యాడ్‌ రేషన్‌ కార్డులు 580 కాగా, కొత్తగా 33 మంజూరయ్యాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు త్వరలో పంపిణీ చేస్తాం. 


Updated Date - 2021-07-30T05:49:51+05:30 IST