రెండో డోసుకు తంటాలు

ABN , First Publish Date - 2021-05-03T04:20:21+05:30 IST

జిల్లాలో కొవాగ్జిన్‌ వేసుకున్న చాలామందికి ప్రస్తుతం రెండో డోసు సకాలంలో అందుబాటులో ఉండడం లేదు.

రెండో డోసుకు తంటాలు

చిత్తూరు, మే 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవాగ్జిన్‌ వేసుకున్న చాలామందికి ప్రస్తుతం రెండో డోసు సకాలంలో అందుబాటులో ఉండడం లేదు. దీంతో తొలి డోసు వేసుకున్న లబ్ధిదారులు నిర్ణీతకాలం గడిచిపోతోందని వాపోతున్నారు. తొలి డోసుగా కొవాగ్జిన్‌ వేసుకుంటే 4-6 వారాల వ్యవధిలో, కొవిషీల్డ్‌ వేసుకుంటే 6-8 వారాల్లో రెండో డోసు కూడా అదే వ్యాక్సిన్‌ వేసుకోవాల్సి ఉంది. మార్చి నెలతోపాటు ఏప్రిల్‌ మొదటివారంలో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కొవాగ్జిన్‌ వేశారు. మార్చిలో వేసుకున్నవారికి నిర్ణీత కాల గడువు ముగిసింది. జిల్లాలో కొవాగ్జిన్‌ టీకాలు అందుబాటులో లేవు. ప్రస్తుతం కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ జిల్లాకు ఎక్కువగా వస్తుండడంతో అందరూ అదే వేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. వ్యాక్సిన్‌ పట్ల ప్రజలకు ఇంకా కొన్ని అపోహలున్నాయి. చాలా మందిలో ఒక వ్యాక్సిన్‌ మంచిదని, మరోటి మంచిదికాదనే అభిప్రాయం ఉంది. అవగాహన కల్పించాల్సిన వైద్య సిబ్బంది కూడా ఓ వ్యాక్సిన్‌ మంచిదని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంగా అధికారులు దృష్టి సారించి వ్యాక్సిన్‌ ఉపయోగాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం జిల్లాలో కొవాగ్జిన్‌ను సుమారు లక్ష మందికి, కొవిషీల్డ్‌ 5 లక్షల మందికిపైగా వేశారు.


జిల్లాలో తొలి, రెండు డోసు వ్యాక్సిన్‌లు వేసుకున్నవారి సమాచారం:


               తొలి డోసు రెండో డోసు మొత్తం

- వేయించుకున్నవారి సంఖ్య 490302 134213 624545

- 60 ఏళ్లు దాటినవారు         188622 47155 235777

- 45-59 మధ్య          195294 32252 227546

- ఆరోగ్య సిబ్బంది           40654 24966 65620

- ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌            67568 31419 98987


గమనిక: ఏప్రిల్‌ 30వ తేదీ నాటి వరకు ఉన్న వివరాలు ఇవి.

Updated Date - 2021-05-03T04:20:21+05:30 IST