క్రెడిట్‌ నాదే.. కాదు నాదే.. టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ!

ABN , First Publish Date - 2021-06-14T18:25:23+05:30 IST

‘క్రెడిట్‌’ వార్‌కు దారి తీసింది....

క్రెడిట్‌ నాదే.. కాదు నాదే.. టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ!

  • మీర్‌పేట్‌ నందిహిల్స్‌లో టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ
  • ఒకరు ప్రారంభిస్తే.. ఇంకొకరు పరిశీలన
  • ఇద్దరినీ ‘నారాజ్‌’ చేయని కాలనీ ప్రతినిధులు

హైదరాబాద్ సిటీ/సరూర్‌నగర్‌ : మీర్‌పేట్‌ కార్పొరేషన్‌లోని 9వ డివిజన్‌ నందిహిల్స్‌లో రోడ్డు నంబర్‌-3ని బీటీగా అభివృద్ధి చేసే అంశం రెండు పార్టీల మధ్య ‘క్రెడిట్‌’ వార్‌కు దారి తీసింది. రోడ్డుకు నిధులు మంజూరు చేయించడం, మంజూరైన నిధులతో రోడ్డు పనులు ప్రారంభించడం తమ కృషి వల్లనే సాధ్యమైందని ఓ వైపు టీఆర్‌ఎస్‌, మరోవైపు బీజేపీ నేతలు ప్రకటించుకోవడం చర్చనీయాంశంగా మారింది. 2019లో మంత్రి సబితారెడ్డి రూ.17లక్షల అంచనాతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, కాలనీలోని అంతర్గత విభేదాల కారణంగా ఇప్పటిదాకా పనులు మొదలు కాలేదు. 


ఆదివారం ప్రారంభం.. ఇరు పార్టీల ప్రకటనలు

రెండేళ్ల క్రితం శంకుస్థాపన జరిగిన ఈ రోడ్డు పనులను గత డిసెంబర్‌లో ప్రారంభించినప్పటికీ.. మళ్లీ అర్ధాంతరంగా పనులు ఆగిపోయాయి. కేవలం కంకర మాత్రమే పరిచి వదిలేశారు. ఎట్టకేలకు ఆదివారం బీటీ రోడ్డు పనులకు మళ్లీ మోక్షం కలిగింది. దాంతో స్థానిక కార్పొరేటర్‌ పెండ్యాల శివపార్వతీనర్సింహ కాలనీ ప్రతినిధులతో కలిసి అక్కడకు చేరుకుని పనులు ప్రారంభించారు. తాను రోడ్డు పనులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని కౌన్సిల్‌ సమావేశంలో లేవనెత్తానని, పలుమార్లు అధికారులతోనూ చర్చించి పనులు ప్రారంభమయ్యేలా చూశానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అనంతరం టీఆర్‌ఎస్‌ డివిజన్‌ ఇన్‌చార్జి రామిడి నర్సిరెడ్డి సైతం అక్కడకు చేరుకుని కాలనీ ప్రతినిధులతో కలిసి పనులు పరిశీలించారు.


ఈ రోడ్డు అంశాన్ని తాను అనేక సార్లు మంత్రి సబితారెడ్డి దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎట్టకేలకు పనులు ప్రారంభమయ్యేలా చూశానని ఈ సందర్భంగా నర్సిరెడ్డి చెప్పారు. ‘ఏదైతేనేం రోడ్డు బాగవుతుంది అది చాలు’.. అని కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాలనీ ప్రతినిధులు మాత్రం అటు బీజేపీ కార్పొరేటర్‌, ఇటు టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జీలలో ఎవరినీ ‘నారాజ్‌’ చేయకుండా ఇద్దరూ అక్కడకు వచ్చినప్పుడు వెళ్లి వారితో ఫొటోలు దిగి ‘ఈ రోడ్డు మీ చలవే’ అంటూ ఇద్దరికీ కృతజ్ఞతలు తెలియజేయడం ఇక్కడ కొసమెరుపు!

Updated Date - 2021-06-14T18:25:23+05:30 IST