Abn logo
Dec 5 2020 @ 11:04AM

నా ఓటమికి ఎమ్మెల్యే కుట్ర.. : టీఆర్ఎస్ అభ్యర్థి కంటతడి

  • ఐదు బూత్‌లను మార్చారు 
  • టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వి. శ్రీనివా‌స్‌రెడ్డి

హైదరాబాద్ : తనను ఓడించేందుకు ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ కుట్ర చేశారని, అందుకే తాను స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యానని రాంనగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వి. శ్రీనివా్‌సరెడ్డి ఆరోపించారు. నిబంధనల మేరకు ఈసారి డివిజన్ల డీ లిమిటేషన్‌ లేదని, అయినా రాంనగర్‌ డివిజన్‌లోని మేదరబస్తీ, శాస్త్రీనగర్‌, జెమినీకాలనీ ప్రాంతాల్లోని ఐదు బూత్‌లకు చెందిన 5,500 ఓట్లను ముషీరాబాద్‌ డివిజన్‌లో అక్రమంగా కలిపారని ఆయన ఆరోపించారు. శుక్రవారం కౌంటింగ్‌ కేంద్రం వద్ద శ్రీనివా‌స్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ డివిజన్లలోని ఓట్లన్నీ తన ఓటు బ్యాంకు అని, తనను రాజకీయంగా దెబ్బ తీయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, జీహెచ్‌ఎంసీ అధికారులు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బస్తీలను తొలగించారన్నారు.

ఈసారి డీ లిమిటేషన్‌ ఉండదని చెప్పిన అధికారులు ఈ ఐదు బూత్‌లను రాంనగర్‌ డివిజన్‌ నుంచి ఎందుకు తొలగించారని శ్రీనివా‌స్‌రెడ్డి ప్రశ్నించారు. దీనిపై తాను కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. రాంనగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఐదేళ్లు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, నిస్వార్థంగా సేవ చేయడానికి వచ్చిన తనను ఓడించడం బాధ కలిగిస్తోందని కంటతడి పెట్టారు. ఏది ఏమైనా ప్రజల తీర్పును శిరసావహిస్తానని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement