ఎమ్మెల్యేకు షాక్‌ ఇచ్చిన టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు

ABN , First Publish Date - 2020-08-08T06:23:50+05:30 IST

కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీ కో ఆప్షన్‌ ఎన్నికలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు స్వంత పార్టీ నాయకులు షాక్‌ ఇచ్చారు

ఎమ్మెల్యేకు షాక్‌ ఇచ్చిన టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు

ఎమ్మెల్యే ప్యానల్‌ను ఓడించిన స్వంత పార్టీ నాయకులు

స్వతంత్య్ర ప్యానెల్‌ గెలుపు

చర్చనీయాంశంగా చొప్పదండి మున్సిపల్‌ కో-ఆప్షన్‌ ఎన్నిక 


చొప్పదండి, ఆగస్టు 7: కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీ కో ఆప్షన్‌ ఎన్నికలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు స్వంత పార్టీ నాయకులు షాక్‌ ఇచ్చారు. ఎమ్మెల్యే రవిశంకర్‌ ప్యానెల్‌ను ఓడించి స్వతంత్ర ప్యానెల్‌ను బరిలోకి దింపి గెలిపించుకున్నారు. స్వంత పార్టీ కౌన్సిలర్లు నలుగురు, బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన మరో నలుగురు కౌన్సిలర్ల మద్ధతుతో ఎమ్మెల్యే ప్యానెల్‌ను ఓడించి సంచలనం సృష్టించారు. చొప్పదండి మున్సిపాలిటీలో 14 మంది కౌన్సిలర్లు ఉండగా టీఆర్‌ఎస్‌ పార్టీకి తొమ్మిది మంది, కాంగ్రెస్‌ 2, బీజేపీ రెండు గెలుపొందారు. ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచిన వెంటనే టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాడు. టీఆర్‌ఎస్‌ 10కి చేరగా అప్పట్లో ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ పదవులను గెలిచి చైర్మన్‌ పీఠం కైవసం చేసుకుంది. నాలుగు కో-ఆప్షన్‌ సభ్యుల కోసం గతంలో ఎన్నికకు షెడ్యుల్‌ విడుదల చేయగా, ఎనిమిది మంది నామినేషన్లు దాఖలు చేశారు. చివరి వరకు ఏకగ్రీవం కోసం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎండి జహీరోద్దీన్‌, గుర్రం ఇంద్రసేనారెడ్డి, గొల్లపల్లి ప్రభావతి, షబానాలతో ప్యానెల్‌ను ఎమ్మెల్యే బరిలోకి దింపగా అమరగొండ తిరుపతి, ఎండి అజ్జు, గండి లలిత, సమీనాల ప్యానెల్‌ను స్వతంత్రంగా బరిలోకి దింపారు.


స్వతంత్ర ప్యానెల్‌కు టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు నలుమాచు జ్యోతి, అనిత, కొత్తూరి మహేష్‌, మాడూరి శ్రీనివాస్‌లు, కాంగ్రెస్‌ కౌన్సిలర్లు కొట్టె అశోక్‌, పెరుమాండ్ల మానస, బీజేపీ కౌన్సిలర్లు చేవురి హిమ, రాజన్నల ప్రణీతలు మద్ధతు పలికారు. మరో టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ దండె జమున ఎవరికి ఓటు వేయకుండా తటస్థంగా ఉంది. దీంతో స్వతంత్ర ప్యానల్‌ కో-ఆప్షన్‌ సభ్యులు గెలుపొందారు. స్వతంత్ర ప్యానల్‌ అభ్యర్థులుకు ఎనిమిది మంది ఓట్లతో కో-అప్షన్‌ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ఎన్నికలో పాల్గొనగా ఎమ్మెల్యే ముందే స్వంత పార్టీ కౌన్సిలర్లు స్వతంత్ర ప్యానల్‌ను గెలిపించడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఎన్నిక అనంతరం గెలుపొందిన కో-అప్షన్‌ సభ్యులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ వాలువాలతో సన్మానించారు. 

Updated Date - 2020-08-08T06:23:50+05:30 IST