నీటిగోస తీర్చిందే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం !

ABN , First Publish Date - 2020-09-25T06:12:36+05:30 IST

‘ఎనకటికి దుబ్బాక అంటే పిల్లలను ఇచ్చేవారు కాదంట.. ఇక్కడ నీళ్లు తాగితే మోదగాళ్లు వచ్చేవట... బావుల కాడికి,

నీటిగోస తీర్చిందే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం !

బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఏం చేశారు ?

ఎక్కడైనా రెండు వేల పింఛన్లు ఇస్తున్నారా ?

ఒక్క ఆడబిడ్డ పెళ్లికి సహాయం చేశారా ?

మాదీ ప్రజా సంక్షేమ ప్రభుత్వం

త్వరలో దుబ్బాకకు సీఎం కేసీఆర్‌


దుబ్బాక/మిరుదొడ్డి, సెప్టెంబరు 24 : ‘ఎనకటికి దుబ్బాక అంటే పిల్లలను ఇచ్చేవారు కాదంట.. ఇక్కడ నీళ్లు తాగితే మోదగాళ్లు వచ్చేవట... బావుల కాడికి, మోటర్ల కాడికి పోయి నీళ్లు మోసీ భుజాలు కాయలు కాసేవీ. ఇప్పుడు ఆ గోసలు లేకుండా ఇంటి ముందుకే తాగు నీరు తెచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిది’ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. దుబ్బాక, మిరుదొడ్డి మండల కేంద్రాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి రైతులకు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ సిద్దిపేటలో ఉండగా దుబ్బాక మండలానికి చెందిన 12 గ్రామాలకు తాగునీళ్లు ఇచ్చినట్టుగానే ఇప్పుడు నియోజకవర్గం మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాలను అందించిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనన్నారు.


పార్టీలకతీతంగా, కులాలు, మతాలకుఅతీతంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ద్వారా రూ.లక్షా 116 వేలను అందిస్తున్నామన్నారు. పక్కనే కర్ణాటక రాష్ట్రం ఉందని, అక్కడ బీజేపీ టీఆర్‌ఎస్‌ చేసిన సంక్షేమాలను అందిస్తుందో నిలదీయాలన్నారు. దుబ్బాకలో రూ.15 కోట్లతో వంద పడకల ఆసుపత్రిని  నిర్మిస్తున్నామని, త్వరలో సీఎం కేసీఆర్‌తో ప్రారంభించనున్నామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుపేదలను పట్టించుకోని పార్టీ దుబ్బాకలో మాత్రం ఎగిరెగిరి పడుతుందన్నారు. దుబ్బాకలో 20 వేల మంది బీడీ కార్మికులకు జీవనభృతిని అందించే బృహత్‌ కార్యాన్ని ఎందుకు పక్క రాష్ర్టాల్లో బీజేపీ చేయడం లేదన్నారు. వీటన్నింటినీ నిలదీసి ఓట్లేలా అడుగుతారని ప్రశ్నించారన్నారు. దుబ్బాకలో త్వరలో రూ.15 కోట్లతో నిర్మించిన కేసీఆర్‌ బడిని, పేదల కోసం నిర్మించిన డబుల్‌ ఇళ్లను ప్రారంభించుకుంటామని సూత్రపాయంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీచైర్‌పర్సన్‌ రోజాశర్మ, అదనపు కలెక్టర్‌ పద్మాకర్‌, ఆర్డీవో అనంతరెడ్డి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, ఎంపీపీ సాయిలు, జడ్పీటీసీ లక్ష్మి, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకటయ్య, తహసీల్దార్‌ సుజాత, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-25T06:12:36+05:30 IST