టీఆర్‌ఎస్‌ సర్కారు వైఫల్యాలను ఎండగట్టండి

ABN , First Publish Date - 2021-08-02T07:54:02+05:30 IST

అధికార టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై ఒకవైపు పోరాటాలు ఉధృతం చేస్తూనే మరోవైపు సంస్థాగత బలోపేతంపై కమలనాథులు దృష్టి సారించారు.

టీఆర్‌ఎస్‌ సర్కారు వైఫల్యాలను ఎండగట్టండి

కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయండి 

రాష్ట్ర నాయకత్వానికి బీజేపీ జాతీయ నాయకత్వం దిశానిర్దేశం


హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): అధికార టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై ఒకవైపు పోరాటాలు ఉధృతం చేస్తూనే మరోవైపు సంస్థాగత బలోపేతంపై కమలనాథులు దృష్టి సారించారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కమలం పార్టీ రూపొందించుకున్న ద్విముఖ వ్యూహంలో భాగంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని జాతీయ నాయకత్వం ఆదేశించింది. జాతీయ పార్టీలో నంబర్‌-2గా వ్యవహరిస్తున్న సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌.. తొలిసారిగా రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు మూడు దశల్లో పార్టీ నాయకులు, శ్రేణులతో సమావేశమయ్యారు. దక్షిణాదిన కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో సంతోష్‌ కీలక పాత్ర పోషించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉన్న నేపథ్యంలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలోనూ అధికారం సాధించే దిశగా ఆయన రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.


తెలంగాణాలో సంస్థాగత బలహీనతను ఇప్పటికే గుర్తించిన పార్టీ జాతీయ నాయకత్వం.. ఆ లోపాన్ని సరిదిద్దేందుకు చర్యలు చేపట్టిందని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు వెల్లడించారు. ప్రతి నెలా ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమాన్ని ప్రతి నాయకుడు కూడా విన్న అనంతరం ఆ కార్యక్రమంపై స్థానికులతో చర్చ నిర్వహించాల్సి ఉంటుంది. ఎవరెవరు, ఎక్కడెక్కడ పాల్గొన్నారో నివేదికను జాతీయ నాయకత్వం తెప్పించుకుంటుంది. తొలుత ఐదువేల పోలింగ్‌ బూత్‌ల నుంచి ప్రారంభించి ఆరేడు నెలల్లో 30 వేల బూత్‌లలో కచ్చితంగా ఈ కార్యక్రమం కొనసాగించాలని నిర్ణయించారు. మరోవైపు, టీఆర్‌ఎస్‌ సర్కారు ఇచ్చిన హామీల అమలు కోసం ఒత్తిడి పెంచడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలను ఉధృతం చేయనున్నారు. 

Updated Date - 2021-08-02T07:54:02+05:30 IST