టీఆర్‌ఎస్‌ బీజేపీ అనుబంధమే

ABN , First Publish Date - 2021-08-04T09:27:57+05:30 IST

‘‘కేసీఆర్‌, మోదీ వేర్వేరు కాదని మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ చెబుతూనే ఉంది. ఈ ఇద్దరు కవల పిల్లల్లాంటివారు.

టీఆర్‌ఎస్‌ బీజేపీ అనుబంధమే

  • మోదీ, కేసీఆర్‌ కవల పిల్లల్లాంటివారు.. 
  • రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రధానికి కేసీఆర్‌ అండ 
  • కేసీఆర్‌ ఒత్తిడితోనే సంజయ్‌ పాదయాత్ర రద్దు
  • ఇంద్రవెల్లి నుంచి దళిత, గిరిజన దండోరా
  • 9 నుంచి సెప్టెంబరు 17 దాకా: రేవంత్‌ 


న్యూఢిల్లీ, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): ‘‘కేసీఆర్‌, మోదీ వేర్వేరు కాదని మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ చెబుతూనే ఉంది. ఈ ఇద్దరు కవల పిల్లల్లాంటివారు. నాణేనికి బొమ్మాబొరుసు లాంటి వాళ్లు. బీజేపీ అనుబంధ విభాగమే టీఆర్‌ఎస్‌’’ అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. పార్లమెంటు సమావేశాల తొలిరోజు టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌ కుమార్‌ ఐదుగురు రాజ్యసభ ఎంపీలను తీసుకెళ్లి ప్రధాని మోదీని కలిసిన సంగతి వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. మిగతా ఎంపీలను బయటికి పంపించి సంతోష్‌ ఒక్కరే రహస్యంగా మోదీతో మాట్లాడారని ఆరోపించారు. ప్రజా సమస్యలే చర్చిస్తే మోదీని కలిసిన విషయాన్ని మీడియాకు ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు.మోదీతో సంతోష్‌ ఏం మాట్లాడారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ భేటీని రహస్యంగా ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌, మాజీ ఎంపీ యధు యాష్కి గౌడ్‌తో కలిసి మంగళవారం రేవంత్‌ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 9వ తేదీ నుంచి జరగాల్సిన పాదయాత్రను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎందుకు రద్దు చేసుకున్నారో చెప్పాలన్నారు. టీఆర్‌ఎ్‌సలో బీజేపీకి సంబంధించిన నిర్ణయాలు జరుగుతున్నాయా? లేదా అన్నది కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ప్రజలకు చెప్పాలన్నారు. కేసీఆర్‌ ఒత్తిడి మేరకే బండి సంజయ్‌ పాదయాత్రను రద్దు చేసుకున్నారని ఆరోపించారు. దీంతో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య  జరిగిన రాజకీయ ఒప్పందం బహిర్గతమైందని విమర్శించారు.


పార్లమెంటులో ఎందుకు మాట్లాడ లేదు?

కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ పరిధులను ఖరారు చేస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌, రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఏపీ తరలించనున్న 8 టీఎంసీల నీటితో పాటు ఏపీ నిర్మిస్తున్న ఇతర ప్రాజెక్టుల వల్ల తెలంగాణ ఏడారిగా మారుతుందని రేవంత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్‌ ఎన్నో విజ్ఞప్తులు చేసిందన్నారు. రాయలసీమ ప్రాజెక్టులపై ఏపీ సీఎం జగన్‌ స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత ఆయన్ని సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌కు ఆహ్వానించి ఈ ప్రాజెక్టుకు అవసరమైన జీవో 203ను తయారు చేసి నజరానాగా ఇచ్చారని ఆరోపించారు. కేంద్రం సమావేశాల్లో ఈ ప్రాజెక్టును అడ్డుకోవాల్సి వచ్చిన అన్ని సందర్భాల్లో కేసీఆర్‌ గైర్హాజరయ్యారని విమర్శించారు. ‘‘కృష్ణా జలాల విషయంలో కేంద్రం దాదాగిరి చేస్తోందని హాలియా సభలో సీఎం మాట్లాడారు. పార్లమెంటు సమావేశాలు మొదలై 15 రోజులు గడిచినా ఈ అంశాన్ని టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఎందుకు లేవనెత్తడం లేదు?’’ అని  ప్రశ్నించారు. మోదీకి వ్యతిరేకంగా పనిచేస్తామన్న టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతిపక్షాల ఆందోళనలకు అనుకూలంగా స్పందించలేదని, రాహుల్‌ నేతృత్వంలో జరిగిన ప్రతిపక్షాల సమావేశానికి కూడా హాజరుకాలేని తెలిపారు. ఆర్థిక నేరాల నుంచి తప్పించుకునేందుకు మోదీకి కేసీఆర్‌ గులాంగిరి చేస్తున్నారని, ప్రధానికి పూర్తిగా లొంగిపోయారని, దీని వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని వివరించారు. కాగా, ఈ నెల 9 నుంచి సెప్టెంబరు 17 వరకు కేసీఆర్‌ కు వ్యతిరేకంగా దళిత, గిరిజన దండోరా కార్యక్రమాన్ని ఇంద్రవెల్లి నుంచి ప్రారంభిస్తామని ప్రకటించారు. 


గొర్లు, బర్ల కోసం ఉద్యమం జరగలేదు: మధుయాష్కి

మధుయాష్కి గౌడ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రాల అధికారాలను కేంద్రం తన చెప్పుచేతుల్లోకి తీసుకున్నా టీఆర్‌ఎస్‌ ఇప్పటి వరకు మాట్లాడలేదని విమర్శించారు. బండి సంజయ్‌ బండి బోల్తా పడిందన్నారు. సీఎం కేసీఆర్‌, మోదీ అవగాహనలో భాగంగానే బండి సంజయ్‌ పాదయాత్ర రద్దయిందని ఆరోపించారు. నల్లా నీళ్లు, సన్నబియ్యం, గొర్లు, బర్ల కోసం తెలంగాణ ఉద్యమం జరగలేదని, తెలంగాణ వస్తే పిల్లల భవిష్యత్తు బాగుటుందని భావించామన్నారు. 


‘హుజూరాబాద్‌’పై నేడు కాంగ్రెస్‌ సమీక్ష

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్‌ సన్నద్ధతపై బుధవారం ఇందిరాభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఉపఎన్నిక కోసం టీపీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహను పీసీసీ ఇన్‌చార్జిగాను, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లను సమన్వయ కర్తలుగానూ నియమించిన సంగతి తెలిసిందే. పార్టీ ముఖ్య నేతలకు మండలాల వారీగానూ బాధ్యతలు అప్పగించారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి నియోజక వర్గ ఎన్నికల సమన్వయ కర్తలు, పీసీసీ, మండల ఇన్‌చార్జులకు ఆహ్వానం పంపారు. అయితే జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు స్థానికంగా ఎన్నికల సన్నద్దత కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల అయ్యాక అభ్యర్థిత్వంపై తుది నిర్ణయానికి రావచ్చన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

Updated Date - 2021-08-04T09:27:57+05:30 IST