Abn logo
Sep 22 2021 @ 23:30PM

కుల సంఘాలను గౌరవించే పార్టీ టీఆర్‌ఎస్‌

హుజూరాబాద్‌లో గౌడ ఆశీర్వాద సభలో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

- సర్వాయి పాపన్న వర్థంతి, జయంతి ఉత్సవాలను అధికారికంగా జరిగేలా చూస్తాం

- గౌడ కులస్థులకు త్వరలో మోపెడ్‌లు అందజేస్తాం

- రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హుజూరాబాద్‌, సెప్టెంబరు 22: కుల సంఘాలను గౌరవించే పార్టీ టీఆర్‌ఎస్‌ అని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. బుధవారం హుజూరాబాద్‌  వ్యవసాయ మార్కెట్‌లో గౌడ కులస్థుల ఆశీర్వాద సభ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సభకు భారీ ఎత్తున గౌడ కులస్థులు తరలివచ్చారు. మొదట సైదాపూర్‌ రోడ్‌లోని సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. గౌడ కమ్యూనిటీ హాల్‌కు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, హరీష్‌రావు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ గౌడ కులస్థులు మాట ఇచ్చారంటే తప్పరన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత గౌడ కులస్థుల పరిస్థితుల గురించి ఆలోచించింది సీఎం కేసీఆర్‌ మాత్రమే అన్నారు.  16 జబ్బులకు కల్లు ఔషధంగా మారిందన్నారు. గత  ప్రభుత్వాలు కల్లు అమ్మే, తాగే వారిని అవమానపరిచేవారని, కుల వృత్తిని వేధించిన వారి నుంచి కేసీఆర్‌ రక్షించి పన్నులు రద్దు చేశారన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఒక్క బీసీకి కూడా మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. బీసీలకు బీజేపీ ఏం చేయలేదని, ఆ పార్టీకి ఓటేస్తే వృథా అవుతుందన్నారు. దళితబంధు వచ్చిందని ఇతర కులాలను పార్టీలు ఎగేయడం సరికాదన్నారు. దళితబంధు ఇవ్వడమే కాకుండా ప్రతి రంగంలో దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు. వైన్స్‌లలో గౌడ కులస్థులకు, దళితులకు రిజర్వేషన్లు కల్పించిన చరిత్ర టీఆర్‌ఎస్‌దన్నారు. తెలంగాణను తెచ్చుకున్నదే అన్ని కులాలను బాగు చేసుకోవడానికన్నారు. సర్వాయి పాపన్న వర్థంతి, జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా చూస్తామన్నారు. గౌడ కులస్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి త్వరలో మోపెడ్‌లను అందజేస్తామన్నారు. హైద్రాబాద్‌లో గౌడ కులస్థుల కోసం సీఎం కేసీఆర్‌ స్థలం కేటాయించారన్నారు. అనంతరం మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, హరీష్‌రావును గౌడ కులస్థులు గజమాలతో సన్మానించారు. సమావేశంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌లు, గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యేలు ప్రకాష్‌గౌడ్‌, వివేక్‌గౌడ్‌, సతీష్‌కుమార్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, కొడూరి సత్యనారాయణగౌడ్‌, గంగాధర్‌గౌడ్‌, రాజేశంగౌడ్‌, ఇనుగాల పెద్దిరెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక, వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల పాల్గొన్నారు.


జనంతో కిక్కిరిసిన గౌడ ఆశీర్వాద సభ


హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించిన గౌడ ఆశీర్వాద సభ జనంతో కిక్కిరిసిపోయింది. పదివేల మంది కోసం సభ ఏర్పాటు చేయగా ఎక్కువగా రావడంతో కుర్చీలు లేక నిలబడిపోయారు. గౌడ కులస్థులు వచ్చేందుకు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్‌ వాహనాలను సమకూర్చారు. మంత్రి హరీష్‌రావు ఆధ్వర్యంలో సభ సక్సెస్‌ కావడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.