ప్రజల సొమ్మంతా ‘టీఆర్ఎస్’ పాలవుతోంది: విజయశాంతి

ABN , First Publish Date - 2021-09-15T01:25:28+05:30 IST

హైదరాబాద్: రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నట్టు... తెలంగాణలో ప్రజల సొమ్ము టీఆర్ఎస్ నాసిరకం ప్రాజెక్టుల పాలవుతోందని బీజేపీ నేత విజయశాంతి విమర్శించారు. మంగళవారం ఆమె సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్‌పై

ప్రజల సొమ్మంతా ‘టీఆర్ఎస్’ పాలవుతోంది: విజయశాంతి

హైదరాబాద్:  రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నట్టు... తెలంగాణలో ప్రజల సొమ్ము టీఆర్ఎస్ నాసిరకం ప్రాజెక్టుల పాలవుతోందని బీజేపీ నేత విజయశాంతి విమర్శించారు. అలాగే వరిసాగుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఆమె తప్పుపట్టారు. మంగళవారం ఆమె సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్‌పై పలు విమర్శలు చేశారు. అవి ఆమె మాటల్లోనే..


‘‘రాష్ట్రంలో నిర్మించిన నాణ్యత లేని చెక్ డ్యాంల పరిస్థితిపై ప్రధాన మీడియాలో ఆధారాలతో వచ్చిన సమాచారంతోనే మాట్లాడుతున్నా. వేల కోట్ల ప్రజాధనం వెచ్చించి గోదావరి, కృష్ణ పరీవాహకాల్లో నిర్మించిన పలు చెక్ డ్యాంలు ఏళ్లు గడుస్తున్నా పూర్తవడం లేదు. వీటి దుస్థితిపై గణాంకాలు, లోపాలపై సమగ్ర విశ్లేషణతో వచ్చిన కథనాలు చదివితే సగటు తెలంగాణ వాసి కడుపు తరుక్కుపోతుంది. నీటి ప్రవాహవేగం, నిల్వ, వరదల పరిస్థితిని అంచనా వేయకుండా లోపాలతో కూడిన డిజైన్‌తో ఈ చెక్ డ్యాంలు కట్టినట్టు కాస్త పరిజ్ఞానం ఉన్నవారెవరికైనా అర్థమవుతుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు కుమ్మక్కై.. వారి బంధువులనే కాంట్రాక్టర్లుగా నియమించి, కాసులు దండుకుంటున్నారు. చాలా జిల్లాల్లో.. సుమారు 30 చెక్ డ్యాంలు దుస్థితిలో ఉన్నాయి. కారకులపై ఏం చర్యలు తీసుకుంటారో టీఆర్ఎస్ సర్కారు సమాధానం చెప్పాలి.


రైతుల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ ప్రగల్బాలు పలికారు. యాసంగిలో వరి సాగు చేయొద్దని, వరి సాగు చేస్తే కొనుగోలు చేయబోమని మళ్లీ రైతులను భయబ్రాంతులకు గురి చేస్తుండు. ఇప్పటికే తెలంగాణ రైతులు నాట్లు వేశారు. కొన్ని చోట్ల వరి పంట వర్షానికి కొట్టుకుపోయింది. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వకుండా ఆందోళనలో పడేయడం సిగ్గుచేటు.


ఈ వర్షాకాలంలో 60 లక్షల టన్నుల వడ్లను కొంటామని కేంద్రం ప్రకటిస్తే.. మిగతా వడ్లను సేకరించే బాధ్యత నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకొంటోంది. తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకు..  కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తోంది. హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలను ఎంత మభ్యపెట్టాలని చూసినా హుజురాబాద్‌లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం’’.. అని విజయశాంతి పేర్కొన్నారు.





Updated Date - 2021-09-15T01:25:28+05:30 IST