టీఆర్‌ఎస్‌ ఎంపీల పార్లమెంటు బహిష్కరణ

ABN , First Publish Date - 2021-12-08T07:24:11+05:30 IST

ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటు సమావేశాలను బహిష్కరించారు.....

టీఆర్‌ఎస్‌ ఎంపీల పార్లమెంటు బహిష్కరణ

  • ఈ సమావేశాల్లో మిగతా రోజులు హాజరు కాబోము
  • కేంద్రం తీరుపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం
  • మోదీది ఫాసిస్టు ప్రభుత్వం.. ప్రధాని ప్రజా వ్యతిరేకి
  • ఈ ప్రభుత్వం ఉండడం ప్రజాస్వామ్యానికే ప్రమాదం
  • ప్రజలతో తిరుగుబాటు చేయించడమే పరిష్కారం
  • ప్రధాని మోదీ దిగిపోవాలన్నదే ఇకపై మా నినాదం
  • బీజేపీకి మేం పూర్తి స్థాయిలో వ్యతిరేకం
  • రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ వ్యతిరేకిస్తాం
  • దేశానికి మంచి చేసే అంశమున్నప్పుడు మద్దతిస్తాం
  • టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు వెల్లడి
  • రైతుల కోసం బహిష్కరిస్తున్నాం: నామా 
  • టీఆర్‌ఎస్‌ ఎంపీల బస్సు యాత్ర?
  • ‘ధాన్యం’పై కేంద్రం వైఖరిని ఎండగట్టడమే లక్ష్యం


న్యూఢిల్లీ, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటు సమావేశాలను బహిష్కరించారు. ఈ శీతాకాల సమావేశాల్లో మిగతా రోజులు సభకు హాజరు కాబోమని ప్రకటించారు. నవంబరు 29న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ధాన్యం కొనుగోలు అంశంపై రాజ్యసభ, లోక్‌సభల్లో ఆ పార్టీ ఎంపీలు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. మంగళవారం వారంతా నల్ల దుస్తులు ధరించి వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. అనంతరం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. అంతకుముందు రాజ్యసభలో కె.కేశవరావు, లోక్‌సభలో నామా నాగేశ్వరరావు ఇచ్చిన వాయిదా తీర్మానాలను చైర్మన్‌ వెంకయ్యనాయుడు, స్పీకర్‌ ఓం బిర్లా తిరస్కరించారు.



పార్లమెంటులో ఆందోళనలు ముగిసిన అనంతరం ఎంపీలు ఏపీ, తెలంగాణ ఉమ్మడి భవన్‌కు చేరుకొని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు మాట్లాడుతూ.. బీజేపీకి తాము పూర్తి వ్యతిరేకమని, రానున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఆ పార్టీని వ్యతిరేకిస్తామని చెప్పారు. అయితే, దేశానికి మంచి చేసే అంశమేదైనా ఉన్నప్పుడు ప్రభుత్వానికి మద్దతిస్తామని తెలిపారు. కానీ, ప్రధాని మోదీది నిరంకుశ, ఫాసిస్టు ప్రభుత్వమని, ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు. మోదీ ప్రజా వ్యతిరేకి, రైతు వ్యతిరేకి అని ధ్వజమెత్తారు. పార్లమెంటులో ఎన్డీఏ కూటమికి మెజారిటీ ఉందని అప్రజాస్వామికంగా, నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం వల్ల ప్రజాస్వామ్యానికే ప్రమాదమన్నారు. దీనికి ప్రత్యామ్నాయం ప్రజలతో తిరుగుబాటు చేయించడమేనని, తాము అదే చేయబోతున్నామని తెలిపారు. ప్రధాని మోదీ దిగిపోవాలన్నదే ఇప్పటినుంచి తమ నినాదమని స్పష్టం చేశారు. 


గోడతో మాట్లాడినట్లే ఉంది..

మోదీ ప్రభుత్వమంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇంకొకటి ఉండదని కేశవరావు ఆరోపించారు. చర్చకు అవకాశం ఇవ్వకుండా కొత్త రైతు చట్టాలను రద్దు చేసిన తీరును ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు. ‘‘మేము ఏది మాట్లాడినా గోడతో మాట్లాడినట్లు, గోడకు తల పగలగొట్టుకున్నట్లే అనిపిస్తుంది. ఈ పరిస్థితులు చూసి ఇక రైతు అంశాలపై మాట్లాడనివ్వరన్న భయం వేస్తోంది. ప్రభుత్వం ప్రకటన చేయలేదు. నిరసనగా వెల్‌లోకి వెళ్లాం. ప్లకార్డులు ప్రదర్శించాం. ఎంత ప్రయత్నం చేసినా కేంద్రం వినేటట్టు లేదు. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో పార్లమెంటును బహిష్కరించాలని నిర్ణయించాం’’ అని కేకే వెల్లడించారు. ఇది కఠినమైన, బాధాకరమైన నిర్ణయమే అయినా.. రైతుల కోసం తప్పదన్నారు. తాము పోరాట పటిమతో ముందుకెళ్తున్నామని, రైతు చట్టాల రద్దుపై రాకేశ్‌ టికాయత్‌ నేతృత్వంలో జరుగుతున్న రైతాంగ పోరాటంలా ఇది మారుతుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్లమెంటును దిగ్బంధిస్తామని చెప్పి.. ఇప్పుడు అర్ధాంతరంగా ఆందోళనలు ముగించడమేంటని విలేకరులు ప్రశ్నించగా.. చరిత్ర ఇంకా ముగియలేదని, తర్వాత ఏం జరుగుతుందో చరిత్ర పూర్తయిన తర్వాతే తెలుస్తుందని అన్నారు. 


రేవంత్‌రెడ్డివి పిచ్చి ఆలోచనలు..

ప్రధాని మోదీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే పార్లమెంటును బహిష్కరించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా.. ఆయన పిచ్చి ఆలోచనతో ఈ ఆరోపణ చేశారని కేశవరావు అన్నారు. కేంద్రం ఎంత మేర ధాన్యాన్ని తీసుకుంటుందో చెబితే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లలో చొరవ తీసుకుంటుందని తెలిపారు. కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ రాజ్యసభలో తమ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటవేత ధోరణిలో మాట్లాడారని విమర్శించారు. కాగా, తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేలా కేంద్రం వ్యవహరిస్తోందని టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు ఆరోపించారు. తమ నిరసనను కేంద్రం కనీసం పట్టించుకోలేదని, అందుకే పార్లమెంటును బహిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని సభలో ప్రకటించేందుకు మాట్లాడడానికి కొంత సమయం ఇవ్వాలని స్పీకర్‌ను కోరినా నిరాకరించారన్నారు. పార్లమెంటు వేదికగా రైతులకు న్యాయం జరగడం లేదని, కేవలం బిల్లుల ఆమోదం కోసమే నడిపిస్తున్న సమావేశాలకు తాము వెళ్లబోమని ప్రకటించారు. 

Updated Date - 2021-12-08T07:24:11+05:30 IST