Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 8 2021 @ 02:23AM

టీఆర్‌ఎస్ ను తరిమికొడతాం

ఈ మహోద్యమంలో కలిసి రండి.. ఉద్యమకారులకు బండి సంజయ్‌ పిలుపు.. బీజేపీలో చేరిన తీన్మార్‌ మల్లన్న

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ పార్టీని తరిమికొట్టే మహోద్యమంలో కలిసి రావాలని తెలంగాణ ఉద్యమకారులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. ‘‘టీఆర్‌ఎస్‌ కుటుంబ, అవినీతి, నియంత ప్రభుత్వాన్ని తరిమి కొడతాం. కేసీఆర్‌ రాక్షస పాలనకు చరమగీతం పాడతాం. తెలంగాణ ఉద్యమకారులకు వేదిక బీజేపీ. పార్టీ చేపడుతున్న ఈ మహోద్యమానికి మద్దతు పలకాలని తెలంగాణ ఉద్యమకారులను కోరుతున్నా’’ అని అన్నారు. మంగళవారం ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ తరుణ్‌ చుగ్‌, బండి సంజయ్‌ సమక్షంలో తీన్మార్‌ మల్లన్న బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడారు. తెలంగాణలో దుర్మార్గ పాలన అంతం బీజేపీతోనే సాధ్యమని ఉద్యమకారులు భావిస్తున్నారని తెలిపారు. విఠల్‌, మల్లన్న వంటి నేతలకు రాజకీయ స్వార్థం లేదని, వారు ఉద్యమకారులని, పోరాట పటిమ ఉన్న నేతలని పేర్కొన్నారు. రాష్ట్రంలో అవినీతి, రాక్షస, కుటుంబం పాలన కొనసాగిస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వంపై మల్లన్న పోరాడుతున్నారని చెప్పారు. ఆయన కలంతో గళమెత్తుతుంటే జీర్ణించుకోలేని కేసీఆర్‌.. అనేక కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్నను ఓడించేందుకు సీఎం కేసీఆర్‌ రూ.వందల కోట్లు ఖర్చు చేసినా 1.4 లక్షల ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారని తరుణ్‌ చుగ్‌ తెలిపారు. తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌కు రాజకీయ సమాధి కట్టడం ఖాయమని తీన్మార్‌ మల్లన్న అన్నారు. బీజేపీ తనకు సభ్యత్వ తాడు ను ఇచ్చిందని, దాంతో రాష్ట్రాన్ని దోచుకుంటున్న కేసీఆర్‌ కుటుంబాన్ని అమరవీరుల స్తూపానికి కట్టేస్తానన్నారు. 


మధ్యాహ్న భోజనం నిలిపేసే కుట్ర: విజయశాంతి

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా పేదపిల్లలకు విద్యను దూరం చేస్తున్న సీఎం కేసీఆర్‌, ఇప్పుడు వారికి మధ్యాహ్న భోజనాన్నీ దూరం చేసేందుకు కుట్ర పన్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ఆరోపించారు. కాగా, ఎస్సీ వర్గీకరణకు సహకరించాలని, ఈ నెల 14న జరగనున్న మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభకు హాజరుకావాలని బండి సంజయ్‌కి ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో సంజయ్‌ని కలిసి ఈ మేరకు వినతి పత్రాన్ని అందించారు. 

Advertisement
Advertisement