సంస్థాగతంపై ఆశలు

ABN , First Publish Date - 2021-09-14T05:41:26+05:30 IST

సంస్థాగతంపై ఆశలు

సంస్థాగతంపై ఆశలు

పదవుల కోసం ‘గులాబీ’ నేతల ప్రయత్నాలు

వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా అధికారపార్టీ అడుగులు

ఎమ్మెల్యేల అనుయాయులకే కమిటీల్లో చోటు

జిల్లాల కమిటీలపైనా ఆశావహుల చూపు

ఖమ్మం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు టీఆర్‌ఎస్‌ అధినాయ కత్వం చర్యలు చేపట్టింది. గ్రామ, మండల కమిటీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. అయితే కమిటీల్లో పనిచేసేవారికే ప్రాధాన్యం ఉంటుందని రాష్ట్ర, జిల్లా నేతలు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వ హించి స్పష్టం చేయగా.. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేల సిఫారసులకే స్థానం లభిస్తోంది. ఎవరికివారు తమ అనుచరులను గ్రామ, మండల కమిటీల్లో నియమించుకుంటురన్నారు. దీంతో పార్టీలోని ఇతర గ్రూపు నాయకులు, సంస్థాగత ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి తమ అనుచరులకు పదవులు ఇవ్వాలని చెప్పుకోవడం ఇష్టం లేక మంచోచెడో వారిమీదే నడవాలని సర్దుకు పోతున్నారు. వాస్తవానికి టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకత్వం సమన్వయంతో నియోజకవర్గాల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, పనిచేసే వారికే పదవులు ఇవ్వడం వల్ల పార్టీకి లాభం ఉంటుందని సూచించినా కిందిస్థాయిలో ఎమ్మెల్యేలకే పెత్తనం ఇవ్వడంతో వారు చెప్పినవారికే పదవులు అన్నట్టుగా టీఆర్‌ఎస్‌ కమిటీ నియామకాలు సాగుతున్నాయి. ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ, పాలేరులో ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, వైరాలో ఎమ్మెల్యే రాములునాయక్‌, సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మధిరలో జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఇల్లెందులో ఎమ్మెల్యే హరిప్రియ , పినపాకలో ఎమ్మెల్యే రేగా కాంతారావు, భద్రాచలంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, తెల్లం వెంకటరావు, అశ్వారావుపేటలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు నియోజకవర్గాల్లో సంస్థాగత ఎన్నికలను పర్యవేక్షిస్తు న్నారు. ఇందులో కొత్తగూడెం, పినపాక, ఇల్లెందు, పాలేరు ఎమ్మెల్యేలు గతంలో కాంగ్రెస్‌ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చారు. సత్తుపల్లి, అశ్వారావుపేటలో టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి రాగా వైరాలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రాములు నాయక్‌ కూడా గులాబీ గూటికి చేరారు ఈ నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ నియోజక వర్గ ఇన్‌చార్జ్‌ల అనుచరులుకూడా ఉండగా.. ఇప్పుడు వారి అనుచరులకు పదవులు దక్కడం లేదు. జిల్లాలో మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులకు కూడా కమిటీల్లో స్థానం దక్కడంలేదు. ఎక్కడైనా ఎమ్మెల్యేల అనుచరులు ముందుకు రాని చోట మాత్రమే తుమ్మల, నామ, పొంగులేటి వర్గీయు లకు అవకాశాలు లభిస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సంస్థాగత కమిటీల బాధ్యత పూర్తిగా ఎమ్మెల్యేలకే అప్పగించడంతో వారి అనుచరులకే అవకాశాలు ఇస్తుండడంతో భవిష్యత్‌ ఎన్నికల్లో ఇబ్బంది కర పరిస్థితులుంటాయని కొందరు టీఆర్‌ఎస్‌ నేతలు పేర్కొంటున్నారు. 

జిల్లా కమిటీలపై ఆశలు

టీఆర్‌ఎస్‌ గ్రామ, మండల కమిటీల నియామక ప్రక్రియ ఈనెల 20లోపు పూర్తయ్యే అవకాశం ఉండగా.. ఆ తర్వాత ఇరు జిల్లాల కమిటీల ప్రక్రియమొదలు కానుంది. ఈ క్రమంలో ఇరుజిల్లాల్లోని నాయకులు పదవులపై ఆశలు పెట్టుకుంటున్నారు. ఖమ్మం జిల్లా కమిటీ అధ్యక్ష పదవిని బీసీకి కేటాయిస్తారని ప్రచారం జరుగుతుండగా ఇతర వర్గాలు కూడా తమకు అవకాశం ఇవ్వాలని, జిల్లా నేతలను కోరుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం జిల్లా పార్టీ కార్యాలయ ఇన్‌చార్జ్‌గా ఉన్న గుండాల కృష్ణకు జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందన్న ప్రచారం రుగుతోంది. అయితే ఆర్‌జేసీ కృష్ణ తనకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ పదవి కావాలని కొంతకాలంగా పార్టీ రాష్ట్ర నేతలను, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను కోరుతున్నారు. అయితే జిల్లా పార్టీ పదవి తీసుకుంటే రాష్ట్రస్థాయి పదవి దక్కే అవకాశం లేదు. బీసీలో ఆర్‌జేసీ కృష్ణ ఒకవేళ జిల్లా అధ్యక్ష పనదవి వద్దంటే ఖమ్మం నగర అధ్యక్షుడిగా ఉన్న కమర్తపు మురళితోపాటు జిల్లాలో ఉన్న మరికొందరు బీసీ నేతల పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. ఖమ్మంజిల్లా అధ్యక్ష పదవి విషయంలో ఎంపీ నామా వర్గం నుంచి మహిళనేత మద్దినేని బేబి స్వర్ణకుమారి తదితరులు కూడా జిల్లా పదవి ఆశిస్తున్నారు. అయితే ఖమ్మంలో ఆర్యవైశ్య సంఘం నుంచి కూడా ఈ సారి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఖమ్మం జిల్లా అధ్యక్ష పదవి బీసీకే ఇవ్వాలని, ఇప్పటికే పార్టీ అధిష్ఠానం నిర్ణయించుకున్నట్టు సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ విషయంలో అక్కడ ఓసికి కేటాయించే అవకాశం కనిపిస్తుంది. అక్కడ ఎమ్మెల్యేల పదవులు ఐదింటిలో నాలుగు ఎస్సీకి రిజర్వు అయి ఉన్నాయి. కొత్తగూడెం ఎమ్మెల్యేగా బీసీ వర్గానికిచెందిన వనమా వెంకటేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఓసీకి జిల్లా అధ్యక్ష పగ్గాలు దక్కే అవకాశం ఉంది. జిల్లాలో సీనియర్‌ నేతగా డీసీసీబీ డైరెక్టర్‌గా ఉన్న తుళ్లూరి బ్రహ్మయ్యకు జిల్లా పార్టీ అధ్యక్ష పగ్గాలు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల ఆయన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కూడా సమావేశమై పార్టీ అధ్యక్ష పగ్గాలు ఇస్తే పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని చెప్పినట్టు తెలిసింది. బ్రహ్మయ్యకు టీఆర్‌ఎస్‌లో ఇతరవర్గాలనుంచి కడా మద్దతు ఉంది. ఓసీకి కేటాయిస్తే బ్రహ్మయ్యకు దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే టీఆర్‌ఎస్‌లో జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్‌ గతంలో కొత్తగూడెం జేఏసీ నేతగా ఉన్న బిక్కసాని నాగేశ్వరరావుతోపాటు మరికొందరు నేతలు  ఆశగా ఉన్నారు. ఒకవేళ ఎస్టీకి కేటాయిస్తే రాష్ట్ర నేతగా ఉన్న భద్రాద్రి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తెల్లం వెంకటరావుకు అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉంది. అయితే ముఖ్యమంత్రి టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్‌ సీల్డ్‌ కవర్‌లో జిల్లా అధ్యక్షుల పేర్లు ఖరారుచేయనుండగా.. అందరిలోనూ ఉత్కంఠ కనిపిస్తోంది. 

Updated Date - 2021-09-14T05:41:26+05:30 IST