సమరమే అంటున్న స్వతంత్రులు.. ప్రిస్టేజ్‌గా తీసుకున్న టీఆర్ఎస్.. ఏం జరుగుతుందో!?

ABN , First Publish Date - 2021-02-23T19:22:45+05:30 IST

ఎన్నికల సమరాన్ని అధికార పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది.

సమరమే అంటున్న స్వతంత్రులు.. ప్రిస్టేజ్‌గా తీసుకున్న టీఆర్ఎస్.. ఏం జరుగుతుందో!?

నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎన్నికల సమరాన్ని అధికార పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. సిట్టింగ్‌ స్థానం చేజారిపోకుండా పట్టుబిగించేందుకు యత్నిస్తోంది. 6 నెలలుగా నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. గత ఎన్నికల్లో రెండో స్థానానికి పరిమితమైన బీజేపీ పట్టభద్రుల పోలింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్ల మద్దతు కూడగడుతోంది. ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ సైతం ప్రచారంలో దూకుడు పెంచింది. మరోవైపు బలమైన స్వతంత్రులు బరిలోకి దిగుతుండటంతో.. ప్రధాన పార్టీల్లో కలవరం రేగుతుందట. అసలు కథేంటో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఇన్‌సైడ్‌లో చూద్దాం.


సవాల్‌గా తీసుకున్న మంత్రి..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంటుంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ప్రధాన పార్టీలు పట్టభద్రుల సమరంలో విజయం సాధించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. మరోవైపు ప్రధాన పార్టీలకు ఏ మాత్రం తగ్గకుండా స్వతంత్ర అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. అధికార పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మళ్లీ పోటీ చేస్తున్నారు. దాంతో గులాబీ నేతలు ఆరు నెలలుగా నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు జోరుగా నిర్వహిస్తున్నారు. అధిష్టానం ఆదేశాలతో 50 మంది ఓటర్లకు ఒక ఇంచార్జ్‌ను నియమించి గ్రాడ్యువేట్ల మద్దతు కూడగడుతున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికను సవాల్‌గా తీసుకుని నియోజకవర్గాల వారీగా మీటింగ్‌లు పెడుతున్నారు. 


ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించినా..

గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ..తమ అభ్యర్థిగా వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని బరిలోకి దింపింది. మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రతి 25 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జ్‌ను నియమించి, మూడు జిల్లాల్లో సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఆలస్యంగా తమ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ను ప్రకటించిన కాంగ్రెస్.. క్యాంపెయిన్‌లో స్పీడ్‌ పెంచింది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థితో కలిసి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రచారం హోరెత్తిస్తున్నారు.


జోరుగా క్యాంపెయిన్..

కాగా.. తనకు కాంగ్రెస్‌ మద్దతు ఉంటుందని మొదటినుంచి భావించిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌కు.. హస్తం పార్టీ హ్యాండ్‌ ఇచ్చి తమ అభ్యర్థిని ప్రకటించడంతో.. ఆయన అలెర్ట్‌ అయ్యారట. ఇప్పటికే టీజేఎస్‌ అధ్యక్షుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా ప్రచారం చేశారు. ఉస్మానియా విద్యార్థులు సైతం ఆయనకు మద్దతుగా జిల్లాల్లో పర్యటించారు. సమయం తక్కువగా ఉండడంతో సభల ద్వారా ప్రచారం నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు వామపక్షాల అభ్యర్థిగా బరిలో నిలిచిన జయసారధి రెడ్డి ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో జోరుగా క్యాంపెయిన్‌ చేశారు. పట్టభద్రుల ఓటర్లు, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు నిర్వహించి వారి మద్దతు కోరారు.


వ్యూహాలకు పదును..

ప్రధాన పార్టీలతో పాటు బలమైన స్వతంత్ర అభ్యర్థులు బరిలో దిగుతుండటంతో ఈసారి పట్టభద్రుల ఎన్నికల సమరం రసవత్తరంగా మారుతోంది. అధికార టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల కంటే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తూ పట్టభద్రుల మద్దతు కోరుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. అధిక సంఖ్యలో ఇండిపెండెంట్లు పోటీలో ఉండటంతో.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే చర్చ జరుగుతుందట. దాంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటును సొమ్ము చేసుకోవడమే లక్ష్యంగా విపక్ష పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు వ్యూహాలకు పదునుపెడుతున్నారట.


ఎవరికి తోచినట్లుగా వారు ప్రచారం..

యాదాద్రి జిల్లాకు చెందిన సూదగాని శంకర్ గౌడ్ నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యువేట్‌ ఎమ్మెల్సీ స్థానానికి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. గతంలో మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ పీఏగా పనిచేసిన పరిచయాలతో పాటు బలమైన బీసీ సామాజిక వర్గ నేతగా ఉన్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు ప్రచారం పూర్తి చేశారట. పలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రచారం నిర్వహించడంతో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇక తీన్మార్ మల్లన్నగా పేరుగాంచిన నవీన్‌ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 1600 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించి.. పట్టభద్రులను తనదైన శైలీలో ఆకట్టుకున్నట్లు సమాచారం. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ సైతం ముమ్మరంగా ప్రచారం చేశారు. ఇక యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమ ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు.


సర్వత్రా ఉత్కంఠ!

అయితే 2015 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పట్టభద్రుల ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. నల్గొండ-వరంగల్- ఖమ్మం జిల్లాల్లో గతంలో 2 లక్షల 81 వేల138 మంది ఓటర్లు ఉండగా ఈసారి ఆ సంఖ్య 4 లక్షల 92 వేల 943కు పెరిగింది. మొత్తంగా గ్రాడ్యువేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు దీటుగా స్వతంత్రులు ప్రచారం చేస్తుండటంతో.. గెలుపు ఎవరిని వరిస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది.



Updated Date - 2021-02-23T19:22:45+05:30 IST