తెలంగాణ పట్ల కేంద్రానిది సవతి తల్లి ప్రేమ: Tummala

ABN , First Publish Date - 2021-11-12T19:48:31+05:30 IST

తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

తెలంగాణ పట్ల కేంద్రానిది సవతి తల్లి ప్రేమ: Tummala

భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ధర్నాలో తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ వరి రైతులను ముంచే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. పంజాబ్‌లో పండిన ప్రతి ధాన్యపు గింజను కొంటున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకు మాత్రం మొండి చేయి చూపిస్తుందన్నారు. రైతుల అభివృద్ధిపై నిజమైన చిత్తశుద్ధి టీఆర్ఎస్‌కి మాత్రమే ఉందని తెలిపారు. టన్ను పామాయిల్ ధర రూ.7000 నుండి రూ.18000కు పెంచిన ఘనత టీఆర్ఎస్‌కే దక్కిందని ఆయన అన్నారు.


వరి పంటను కొనేదిలేదని కేంద్రం తేల్చి చెప్పడం వల్లే తెలంగాణ రైతాంగానికి ప్రత్నామ్యాయ పంటలు వేయాలని సూచించామన్నారు. తెలంగాణలో బీజేపీ రాజకీయంగా ఎదిగేందుకు టీఆర్‌ఎస్‌పై బీజేపీ నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమే అని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వరి కొనేదిలేదని తెగేసి చెప్తుంటే రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం వరి పండించాలాని రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో పండే ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేసే వరకూ కేంద్రాన్ని నిలదీస్తూనే ఉంటామని తుమ్మల స్పష్టం చేశారు. 


Updated Date - 2021-11-12T19:48:31+05:30 IST