టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ

ABN , First Publish Date - 2021-10-25T04:38:40+05:30 IST

మక్తల్‌ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. మక్తల్‌ మునిసిపాలిటీ కేంద్రంగా మొదలైన రాజకీయం టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీగా మారింది.

టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ
మక్తల్‌ పట్టణం

రసకందాయంగా మారిన మక్తల్‌ రాజకీయం

తరచూ ఉద్రిక్తతలు, వాగ్వాదాలు 

పార్లమెంట్‌ ఎన్నికల నుంచి మారిన సీన్‌

నియోజకవర్గంపై కమలం పార్టీ కన్నేయడంతో మారుతున్న పరిణామాలు

బీజేపీని అడ్డుకునే క్రమంలో దూకుడుగావ్యవహరిస్తున్న చిట్టెం

వేడెక్కిన రాజకీయాలతో సర్వత్రా చర్చనీయాంశం


మహబూబ్‌నగర్‌, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మక్తల్‌ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. మక్తల్‌ మునిసిపాలిటీ కేంద్రంగా మొదలైన రాజకీయం టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీగా మారింది. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పావని మధ్య వాగ్వాదం వివాదస్పద మలుపు తిరిగింది. పట్టణంలోని అభివృద్ధి పనులు, పనుల మంజూరు విషయంలో ఎమ్మెల్యేకు కౌన్సిల్‌కు మధ్య విబేధాలతో పరస్పర విమర్శలకు తెరలేచింది. ఈ క్రమంలో ఈనెల 21న మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశం వాడివేడిగా జరిగింది. ఆ తర్వాత మునిసిపల్‌ కార్యాలయం వద్ద కౌన్సిల్‌ చైర్‌పర్సన్‌, కమిషనర్‌పై ఎమ్మెల్యే చిట్టెం ఫైరవడం రాజకీయంగా దుమారం లేపింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే, చైర్‌పర్సన్‌ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఎమ్మెల్యే ఛత్రపతి శివాజీ చిత్రపటం విషయంలో, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ను ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారని, ఆయన వ్యాఖ్యలు తక్షణం ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో బీజేపీ నాయకులు ఆందోళనలకు దిగడంతో మక్తల్‌ నియోజకవర్గంలో రాజకీయం హాట్‌హాట్‌గా మారింది. ఛత్రపతి శివాజీ గురించి తాను ఉద్దేశపూర్వక విమర్శలు చేయలేదని, సీఎం కేసీఆర్‌, తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటాలను కూడా ఏర్పాటు చేయాలని సూచించే క్రమంలో తన వ్యాఖ్యలు వక్రీకరించారని ఎమ్మెల్యే ఆదివారం చెప్పారు. ఏదేమైనా తన వ్యాఖ్యలు ఎవరికైనా బాధ కలిగిస్తే ఉపసంహరించుకుంటున్నానని పేర్కొనడం ద్వారా వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టారు. అయితే మక్తల్‌ మునిసిపాలిటీ కేంద్రంగా మొదలైన టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ రాజకీయం మున్ముందు మరింత వాడివేడిగా సాగబోతుందనేందుకు ఈ ఘటనలు అద్దం పడుతున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 


రోజుకో మలుపు..

మక్తల్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీగా సాగుతోన్న రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొండయ్య బలమైన పోటీనే ఇవ్వడంతో పాటు 25 వేల వరకు ఓట్లు సాధించి, మూడో స్థానంలో నిలిచారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన డీకే అరుణకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంటే 1500 పైచిలుకు ఓట్ల మెజార్టీ రావడం ద్వారా టీఆర్‌ఎ్‌సపై ఆధిక్యం చాటినట్లయ్యింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి బీజేపీలో చేరడం, వారికి క్రియాశీలక బాధ్యతలు ఆపార్టీలో దక్కడంతో ఈ నియోజకవర్గంలోనూ ఆమేరకు రాజకీయంగా మార్పులు వచ్చాయి. అప్పటికే నియోజకవర్గంలో సంఘ్‌ ప్రభావంతో క్షేత్రస్థాయి నుంచి బలంగానే ఉన్న బీజేపీకి ఈ నాయకుల అనుచరుల చేరికలతో మరింత బలం చేకూరింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి, టీఆర్‌ఎ్‌సకు బలమైన పోటీ ఇచ్చిన మాదిరెడ్డి జలంధర్‌రెడ్డి సైతం బీజేపీలోకి రావడం పార్టీకి ప్లస్‌గా మారింది. అదే ఒరవడిలో మక్తల్‌ మునిసిపాలిటీలో బీజేపీ హవా చాటింది. నియోజకవర్గ కేంద్రమైన మక్తల్‌ పట్టణాన్ని 2019లో మునిసిపాలిటీగా మార్చారు. మొదటిసారి జరిగిన ఎన్నికల్లో బీజేపీ కౌన్సిల్‌లో అదిక సీట్లు సాధించి, చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులు దక్కించుకుంది. చైర్‌పర్సన్‌ ఎన్నిక సమయంలో బీజేపీ అభ్యర్థికి కాంగ్రెస్‌ కౌన్సిలర్లు సైతం మద్దతుగా నిలిచారు. ఉమ్మడి జిల్లాలో 19 మునిసిపాలిటీలు ఉండగా, ఈ ఒక్క మునిసిపాలిటీ మినహా మిగిలిన 18 చోట్ల టీఆర్‌ఎస్‌ పార్టీయే బీజేపీ విజయం సాధించింది. 


నాటి నుంచి వాడివేడి..

అధికార టీఆర్‌ఎ్‌సకు ఈ మునిసిపాలిటీ దక్కకపోవడంతో ఆది నుంచి మునిసిపల్‌ పాలకవర్గానికి, ఎమ్మెల్యేకు మధ్య విబేధాలు వస్తూనే ఉన్నాయి. మొత్తంగా పార్లమెంట్‌ ఎన్నికల సమయం నుంచి ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య వాడివేడి రాజకీయమే సాగుతోంది. రెండు పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. అవకాశమొచ్చిన ప్రతి సందర్భంలో ఇక్కడి బీజేపీ నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎ్‌సనీ, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని ఇరుకునబెట్టేలా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం చర్చనీయాంశంగా మారుతోంది. నేరుగా ఎమ్మెల్యేపై ఆరోపణలు గుప్పించడంతో పాటు, ఎమ్మెల్యే వర్సెస్‌ బీజేపీ నాయకులుగా పలు సందర్భాల్లో వాగ్వాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. ఈ స్థానంపై కన్నేసిన బీజేపీ నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కేవలం సాదాసీదా రాజకీయ కార్యక్రమాలకే పరిమితం కాకుండా, స్థానికంగా జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో లోతుపాట్లు, నాయకుల వైఫల్యాలు, అధికారుల నిర్లక్ష్యం వంటి అంశాలపై ఉద్యమ కార్యాచరణతో ఎప్పటికప్పుడు వేడి కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సైతం బీజేపీ వ్యూహాలను ఎదుర్కొనే క్రమంలో దూకుడుగానే వెళ్తుండడంతో ఉద్రిక్తతకు అవకాశం ఏర్పడుతోంది. నియోజకవర్గంలో జరిగే ప్రతీ అభివృద్ధి కార్యక్రమంపైనా బీజేపీ ఆరోపణలు ఎక్కుపెడుతుండటం, వాటికి కౌంటర్లు ఇచ్చే క్రమంలో ఎమ్మెల్యే ఒక్కోసారి ఘాటుగా మాట్లాడుతుండడంతో వివాదానికి తెరలేస్తోంది. మొత్తంగా ఈ నియోజకవర్గంపై కన్నేసిన బీజేపీ ఇక్కడ కార్యక్రమాల వేగం పెంచగా, పట్టు కొనసాగించేందుకు ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి దూకుడు వైఖరి అవలంభిస్తున్నారు. రెండు శిబిరాలు పోటాపోటీగా రంగంలోకి దిగడంతో మక్తల్‌ రాజకీయాలు ఏమలుపు తిరగనున్నాయోననే చర్చ రాజకీయాల్లో సాగుతోంది. 

Updated Date - 2021-10-25T04:38:40+05:30 IST