సుపారీ ఎలా తీసుకోవాలో మాణిక్కం ఠాగూర్‌ను అడగాలి!

ABN , First Publish Date - 2021-10-24T08:14:00+05:30 IST

పదవిని అమ్ముకోవడానికి సుపారీ ఎలా తీసుకోవాలనేదానిపై కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్కం ఠాగూర్‌ను అడిగితే చెబుతారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. పీసీసీ పదవికి సుపారీ ..

సుపారీ ఎలా తీసుకోవాలో  మాణిక్కం ఠాగూర్‌ను అడగాలి!

  • సీసీ పదవిని అమ్ముకున్నాడని సొంత పార్టీ నేతలే ఆరోపించారు
  • ఆయన మాపై ఆరోపణలు చేయడమా: కేటీఆర్‌


హైదరాబాద్‌ సిటీ/మాదాపూర్‌/హైదరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): పదవిని అమ్ముకోవడానికి సుపారీ ఎలా తీసుకోవాలనేదానిపై కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్కం ఠాగూర్‌ను అడిగితే చెబుతారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. పీసీసీ పదవికి సుపారీ ఎలా తీసుకోవాలో అడిగితే ఆయన చెబుతాడని.. ఈ విషయం తాను చెప్పడం లేదని, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డే చెప్పారని గుర్తుచేశారు. రూ.50 కోట్లకు పీసీసీ అధ్యక్ష పదవిని రేవంత్‌కు అమ్ముకున్నారని ఆయనే చెప్పారన్నారు. ఇప్పటి వరకు ఠాగూర్‌ ఈ విషయాన్ని ఖండించలేదని.. ఆయన సొంత పార్టీలో ఆరోపణలు చేసే వారిపై మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. ఇతర పార్టీల విషయాలను ప్రస్తావిస్తే ఎబ్బెట్టుగా ఉంటుందన్నారు. గాంధీభవన్‌లో గాడ్సేలు దూరారని, ఇతర పార్టీలను విమర్శించే ముందు కాంగ్రెస్‌ నేతలు గురువింద గింజను గుర్తు చేసుకోవాలని సూచించారు.


టీఆర్‌ఎస్‌ ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హెచ్‌ఐసీసీలో నిర్వహించనున్న ప్లీనరీ ఏర్పాట్లను శనివారం కేటీఆర్‌ పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం తన పరిధిని అతిక్రమిస్తున్నట్లు అనిపిస్తోందని కేటీఆర్‌ అన్నారు. దళితబంధు పథకం ఎప్పుడో ప్రారంభమైందని.. ఎవరో షికాయత్‌ చేస్తే ఆ పథకాన్ని ఆపడం ఎంత వరకు సమంజసమో ఈసీకే తెలియాలన్నారు. ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీ్‌సగడ్‌లోనూ ఎన్నికల కోడ్‌ పెడ్తరేమో చూడాలని వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్‌, బీజేపీ మధ్య ఒప్పందం ఉంది. వాళ్లు రహస్యంగా కలుసుకుంటున్నరు. అన్నా జాగ్రత్త అని, ప్రజలే మాకు సమాచారమిస్తున్నారు. గోల్కొండ రిసార్ట్స్‌లో రహస్యంగా కలవలేదని రేవంత్‌, ఈటలను చెప్పమనండి. ఆధారాలతో సహా చూపిస్తాం. హుజూరాబాద్‌లో బీజేపీ, కాంగ్రె్‌సల ఉమ్మడి అభ్యర్థిగా ఈటల బరిలో ఉన్నారు. ఆ రెండు పార్టీల మధ్య జరిగిన లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే ఈ వ్యవహారమంతా నడుస్తోంది. ఆ రెండు జాతీయ పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా హుజూరాబాద్‌లో విజయం టీఆర్‌ఎ్‌సదే అని కేటీఆర్‌ చెప్పారు. 


త్వరగా ప్రాంగణానికి చేరుకోవాలి..

25న హైటెక్స్‌ హెచ్‌ఐసీసీలో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ జరుగుతుందని,  ఉదయం 10 నుంచే పార్టీ ప్రతినిధులు ప్రాంగణానికి రావాలని కేటీఆర్‌ చెప్పారు. ‘‘గులాబీ జెండా కేసీఆర్‌...’’ అంటూ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ రచించి, యశోకృష్ణ స్వరపరిచి, ధనుంజయ్‌ ఆలపించిన పాటను కేటీఆర్‌  ఆవిష్కరించారు. ఇంధన ధరల పెరుగుదలను సమర్ధించుకుంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘వాళ్లంతా వాట్సాప్‌ వర్సిటీ ఉత్పత్తులు’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2021-10-24T08:14:00+05:30 IST