మూకుమ్మడి మూసివేతలు సబబుకాదు

ABN , First Publish Date - 2021-04-03T05:59:56+05:30 IST

కొవిడ్‌–-19 రెండవ అల వేగంగా వ్యాప్తి చెందుతున్నదన్న కారణంతో రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నింటిని అకస్మాత్తుగా మూసివేసారు. ఈ నిర్ణయం బాధతో తీసుకున్నామనీ, అనివార్యమైయినది అనీ, తాత్కలికమేనని మీరే ప్రకటించారు....

మూకుమ్మడి మూసివేతలు సబబుకాదు

మాన్య ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు గారికి,


కొవిడ్‌–-19 రెండవ అల వేగంగా వ్యాప్తి చెందుతున్నదన్న కారణంతో రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నింటిని అకస్మాత్తుగా మూసివేసారు. ఈ నిర్ణయం బాధతో తీసుకున్నామనీ, అనివార్యమైయినది అనీ, తాత్కలికమేనని మీరే ప్రకటించారు. ప్రారంభమైన మూడువారాలకే ఆరు నుంచి ఎనిమిది తరగుతులు, ఆరు వారాలలోపే 9, 10వతరగతులు, అలాగే ఇంటర్‌ డిగ్రీ, ప్రొఫెషనల్‌ కోర్స్‌లు మూతపడ్డాయి. ఈ నిర్ణయం కలిగిస్తున్న సంచలనాల నేపథ్యంలో మీ దృష్టికి కొన్ని విషయాలను సవినయంగా తీసుకురాదల్చాము.


పదహారేళ్ళ వయస్సు లోపు పిల్లలలో వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువ అని, ప్రాణభయం దాదాపు లేనేలేదని పలు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఇప్పటికే నివేదికలు ఇచ్చాయి. కరోనాతో మరికొంతకాలం సహజీవనం తప్పనిసరి అనే మీ వాదనే తీసుకున్నా వైరస్‌ని గుర్తించిన ప్రాంతాలలో తక్షణ చర్యలు తీసుకుంటూ కార్యకలాపాలను యథావిధిగా నడిపించవలసే ఉంటుంది. అంతేతప్ప మూకుమ్మడి మూసివేతలు ఎంతమాత్రం పరిష్కారం కాదు. 


పిల్లల ఆరోగ్యం కంటే ఏవీ ముఖ్యం కావు అన్న స్టాండ్‌ తీసుకుంటే ప్రజల ఆరోగ్యం కంటే కూడా ఏది ముఖ్యం కాదు అనే అనుకోవాలి. అప్పుడు బార్లు, రెస్టారెంట్‌లు, సినిమాహాళ్ళు, విమాన ప్రయాణాలు, ఎన్నికల ప్రచారాలు, కుంభ మేళాలు, జాతర్లు అన్నీ, అన్నీ మూసివేయాల్సి ఉంటుంది.... కొన్ని గురుకులాలలో చాలినంత స్థలం లేక, తగినంత ఫండ్‌ లేక కొవిడ్‌-– 19 నిబంధనలు పాటించలేక కరోనా వ్యాప్తిని అడ్డుకోలేకపోతే, ఆ గుప్పెడు పాఠశాలలను అదుపులోకి తీసుకొని నష్టనివారణ చేపట్టకుండా ఏకబిగిన రాష్ట్రమంతా విద్యాసంస్థల మూసివేత అమలుచేయడం ఎటువంటి సైన్సో అర్ధం కావడం లేదు.


కరోనా కారణంగా సంవత్సర కాలంగా ఇంటికే పరిమితమైన పిల్లలలో తీవ్రమైన అభ్యసన మాంద్యం నెలకొన్నది. తిరిగి పట్టాలు ఎక్కించడానికి ఎన్ని నెలల సమయం పడుతుందో తెలియని స్థితి. పిల్లల మానసిక ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడింది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల కోసం ఎవరో ఒకరు ఇంటివద్ద ఉండవలసి రావడంతో తల్లిదండ్రులు పోగొట్టుకున్న పనిదినాల విలువ కూడా చాలా ఎక్కువగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల పాలకులు విద్యార్ధులను తిరిగి బడికి రప్పించటం ఎట్లా అని ఆలోచిస్తుంటే మనం బడులనుండి వెళ్ళగొట్టడం భావ్యమా? వ్యాక్సినేషన్‌ వచ్చిన తరువాత కూడా జాగ్రత్తలు తీసుకోలేమని చేతులు ఎత్తివేయడం న్యాయమా? 


పాఠశాల రంగంలో సుమారు 30 లక్షల మంది విద్యార్ధులకు పాఠాలు చెపుతున్న 3 లక్షల పైచిలుకు ప్రైవేట్‌ ఉపాధ్యాయుల దీనమైన పరిస్థితి చూస్తే ఎవరికైనా మనసు ద్రవించి తీరాలి. సంవత్సర కాలంగా జీతాలు లేక వృత్తి వదిలి శారీరక శ్రమలు చేసుకుంటూ బ్రతుకీడుస్తున్న వారు కొందరైతే, ఒంటి మీద వున్న పుస్తెలతాడు అమ్ముకుని రోజులు వెళ్ళదీస్తున్న వారు మరికొందరు. ఎటువంటి సహాయానికి నోచుకొక, పరువు ప్రతిష్టలకు దడిచి లోలోనే కుళ్ళి కృశిస్తున్న ఈ ఉపాధ్యాయవర్గం మనందరి సామాజిక బాధ్యత కాదా? ‘‘తెలంగాణలో అద్భుతమైనప్రతిభతో విద్యార్ధులు ఇప్పటిదాక రాణిస్తున్నారు’’ అంటే అందుకు కారణం ఈ గురువుల కష్టం కాదా? మరి ఏది గురుదక్షిణ? అందుకే లాక్‌డౌన్‌ కాలానికి కనీస జీవన భృతి కింద నెలకు 7,000/- రూపాయలు ఇస్తే సముచితంగా ఉంటుంది అని మీ దృష్టికి తీసుకు వస్తున్నాం.


అలాగే గ్రామీణ ప్రాంతాలలో ఇంటర్‌ నెట్‌ సౌకర్యం లేక స్మార్ట్‌ ఫోన్‌ లేక టివిల ముందు కూర్చోలేక నూటికి 85 శాతంమంది విద్యార్ధులు చదువుకు ఎప్పుడో దూరమై పోయారు. వేలాది మంది ఆడపిల్లలకు బాల్యవివాహాలు జరుగుతున్నాయి. వేలాది బాలలు కార్మికులుగా మారారు. సంక్షేమ రాజ్యంలో ఈ సంక్షోభం నుండి వారిని బయటకు తీసుకువచ్చేందుకు మనం కాస్త ఖర్చు పెట్టలేమా? ప్రతి విద్యార్ధికి ఇంటర్‌ నెట్‌ సౌకర్యం, చౌకధరలో ట్యాబ్‌ అందించగలిగితే అది కరోనాతో సహజీవనం చేస్తూ చదువులు కొనసాగిస్తునట్లు లెక్క, లేదంటే చదువుకు విడాకులిచ్చి కరోనాతో మాత్రమే సహజీవనం చేస్తున్నట్లు లెక్క. మనం ఏమి చేయదలచుకున్నామో నిర్ణయించుకోవాలి.


2020 సెప్టెంబర్‌ -1 నుండి ఆన్‌లైన్‌లో, టీవీల్లో పాఠాలు చెపుతున్నామని గొప్పగా చెప్పుకుంటున్నాం. ఒక్క పరీక్ష కూడా నిర్వహించలేకపోయాం. హెలికాప్టర్‌లో నుండి జ్ఞానవిత్తనాలు వెదజల్లాం, మొలకెత్తాయా మంచిది, లేదా వాటి కర్మ అని ప్రభుత్వాలు భావించటం మంచిది కాదు. ఉన్న కొద్దిపాటి వనరులతోనైన ఏమేరకు ప్రమాణాలు సాధించామో చూడటం మన కనీస బాధ్యత. అందుకోసం వెంటనే ఒక సమగ్రమైన ఎకడమిక్‌ క్యాలండర్‌నో, పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేయడం తక్షణ అవసరం. విద్యారంగంలో ఒక సగానికి బాధ్యత వహిస్తున్న వర్గంగా మీ ముందుంచుతున్న ఈ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాం.


– తెలంగాణ రికగ్నైజ్డ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (టీఆర్ఎస్‌ఎమ్‌ఏ)

Updated Date - 2021-04-03T05:59:56+05:30 IST