ట్రూజెట్‌ భారీ విస్తరణ

ABN , First Publish Date - 2021-04-06T06:24:12+05:30 IST

ప్రాంతీయ విమానయాన సంస్థ ట్రూజెట్‌.. కొత్త ప్రమోటర్‌, ప్రవాస భారతీయుడు, ఇంటరప్స్‌ ఇంక్‌ అధిపతి లక్ష్మీ ప్రసాద్‌.. భారత విమానయాన రంగంలో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు 190 కోట్ల డాలర్ల (సుమారు రూ.14,000 కోట్లు) పెట్టుబడితో హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ట్రూజెట్‌ను ప్రముఖ విమానయాన సంస్థగా తీర్చిదిద్దేందుకు...

ట్రూజెట్‌ భారీ విస్తరణ

  • రూ.14,000 కోట్ల పెట్టుబడి 
  • కొత్తగా 108 విమానాల కొనుగోలు
  • ఈ నెలాఖర్లో ఎయిర్‌బస్‌, ఎంబ్రాయర్‌తో ఒప్పందం 
  • సంస్థకొత్త ప్రమోటర్‌ లక్ష్మీ ప్రసాద్‌ వెల్లడి 

ప్రాంతీయ విమానయాన సంస్థ ట్రూజెట్‌.. కొత్త ప్రమోటర్‌, ప్రవాస భారతీయుడు, ఇంటరప్స్‌ ఇంక్‌ అధిపతి లక్ష్మీ ప్రసాద్‌.. భారత విమానయాన రంగంలో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు 190 కోట్ల డాలర్ల (సుమారు రూ.14,000 కోట్లు) పెట్టుబడితో హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ట్రూజెట్‌ను ప్రముఖ విమానయాన సంస్థగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. వచ్చే మూడేళ్లలో ఈ నిధులు మొత్తాన్ని ఖర్చు చేస్తామని ప్రసాద్‌ ‘మనీకంట్రోల్‌ వెబ్‌సైట్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం ట్రూజెట్‌ చేతిలో ఏడు విమానాలు మాత్రమే ఉన్నాయి. క్రమంగా వీటి సంఖ్యను వందకు పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఎయిర్‌బస్‌ నుంచి 54, ఎంబ్రాయర్‌ నుంచి 54 కొత్త విమానాలు కొనుగోలు చేయనుంది. ఈ నెలాఖర్లో ఇందుకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు ప్రసాద్‌ చెప్పారు. 


కార్గో, చార్టర్డ్‌ విమాన సర్వీసుల్లోకి:  ప్రసాద్‌ నిర్వహణలోని ఇంటరప్స్‌ ఇంక్‌ ఈ మధ్యనే హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (ఎంఈఐఎల్‌) కంపెనీకి ట్రూజెట్‌ ఈక్విటీలో ఉన్న 49 శాతం వాటా ను కొనుగోలు చేసింది. వాస్తవానికి ప్రభుత్వ రంగ విమానయాన సంస్థఎయిర్‌ ఇండియాను దక్కించుకునేందుకు ప్రసాద్‌ ప్రయత్నించినా, కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ట్రూజెట్‌లో 49 శాతం వాటా దక్కడంతో దాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సాధారణ విమాన సర్వీసులతో పాటు కార్గో, ప్రత్యేక చార్టర్డ్‌ విమాన సర్వీసులు, హెలిక్టాప్టర్ల ద్వారా ఎయిర్‌ అంబులెన్స్‌ సేవలు కూడా ట్రూజెట్‌ ద్వారా అందించనున్నట్టు ప్రసాద్‌ చెప్పారు. 


విదేశాలకు కూడా: కాగా మున్ముందు ట్రూజెట్‌ విమాన సేవలను విదేశాలకూ విస్తరించేందుకు ప్రసాద్‌ సిద్ధమవుతున్నారు. గతంలో దేశీయ విమానయాన రంగంలో ఐదేళ్ల అనుభవం ఉంటే గానీ ఇందుకు అనుమతించే వారు కాదు. కొత్త నిబంధనల ప్రకారం కనీసం 20 విమానాలు ఉన్న ఏ దేశీయ విమానయాన సంస్థ అయినా విదేశాలకు విమాన సర్వీసులు ప్రారంభించవచ్చు. 


ప్రధాన హబ్‌గా హైదరాబాద్‌ 

ప్రస్తుతం అమెరికాలో స్థిరపడిన ప్రసాద్‌ పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. ట్రూజెట్‌ కూడా హైదరాబాద్‌ కేంద్రంగానే పని చేస్తోంది. ట్రూజెట్‌ను మరింత విస్తరించి హైదరాబాద్‌ను భారత విమానయాన రంగానికి ప్రధాన కేంద్రం (హబ్‌)గా తీర్చిదిద్దాలన్నది తన కల అని ప్రసాద్‌  చెప్పడం విశేషం. ‘నేను హైదరాబాద్‌లోనే పెరిగా. కాబట్టి నాకు ఈ నగరంతో భావోద్వేగపూరితమైన సంబంధం ఉంది’ అన్నారు.

Updated Date - 2021-04-06T06:24:12+05:30 IST