అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై సంకేతాలిచ్చిన ట్రంప్!

ABN , First Publish Date - 2021-03-01T18:33:15+05:30 IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా వ్యవహరించినా కొందరు రిపబ్లికన్ పార్టీ నేతలు మాత్రం ఆయనను అభిమానిస్తూనే ఉన్నారు. ఇందుకు ఫ్లోరిడాలోని ఓర్లాండ్‌లో చోటు చేసుకున్న ఘటనే ఉద

అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై సంకేతాలిచ్చిన ట్రంప్!

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా వ్యవహరించినా కొందరు రిపబ్లికన్ పార్టీ నేతలు మాత్రం ఆయనను అభిమానిస్తూనే ఉన్నారు. ఇందుకు ఫ్లోరిడాలోని ఓర్లాండ్‌లో చోటు చేసుకున్న ఘటనే ఉదహరణ. విషయం ఏంటంటే.. ఫిబ్రవరి 28న ఓర్లాండో‌లో జరిగిన కన్సర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (సీపీఏసీ) ర్యాలీ‌లో.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొని, ప్రసంగించారు. ఈ సందర్భంగా కొందరు రిపబ్లికన్ పార్టీ నేతలు  సమావేశ ప్రాంగణంలో ట్రంప్ బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. సమావేశం సందర్భంగా ట్రంప్ బంగారు విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 



ఇదిలా ఉంటే.. గత ఏడాది జరిగిన ఎన్నికలతోపాటు జో బైడెన్‌పై ట్రంప్ తన ఆరోపణలను కొనసాగించారు. ఎన్నికల్లో తానే గెలిచానని పునరుద్ఘాటించారు. అంతేకాకుండా 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిచ్చారు. సీపీఏసీ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘మీ సహాయంతో హౌస్‌ను తిరిగి చేజిక్కించుకుంటాం. సెనేట్‌ను గెలుస్తాం. తర్వాత రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు తిరిగి శ్వేతసౌధానికి చేరుకుంటాడు. అయితే అది ఎవరూ? అనే విషయం నాకూ ఆశ్చర్యకరంగానే ఉంది. ఎవరికి తెలుసు? నేను మూడవ సారి వారిని ఓడించాలని కూడా నిర్ణయించుకుంటాను, సరేనా?’ అంటూ వ్యాక్యానించారు. 


Updated Date - 2021-03-01T18:33:15+05:30 IST