తాలిబన్లకూ చాన్స్ ఇచ్చారు.. మరి నాసంగతేంటి....? కోర్టులో కొత్త కేసు వేసిన Trump

ABN , First Publish Date - 2021-10-03T02:49:50+05:30 IST

తన ట్విటర్ ఖాతా పునరుద్ధరించుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఫ్లోరిడా రాష్ట్రం ఫెడరల్ కోర్టులో మరో పిటిషన్ వేశారు.

తాలిబన్లకూ చాన్స్  ఇచ్చారు.. మరి నాసంగతేంటి....?  కోర్టులో కొత్త కేసు వేసిన Trump

ఇంటర్నెట్ డెస్క్: తన ట్విటర్ ఖాతా పునరుద్ధరించుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఫ్లోరిడా రాష్ట్రం ఫెడరల్ కోర్టులో మరో పిటిషన్ వేశారు. తాత్కాలికంగానైనా తన ఖాతాను మళ్లీ ప్రారంభించాలంటూ కోర్టును కోరారు. ఈ మేరకు ట్విటర్‌పై ఒత్తిడి పెంచాలని న్యాయమూర్తిని అభ్యర్ధించారు. అమెరికా చట్టసభల వేదిక క్యాపిటల్ హిల్‌‌ను ట్రంప్ మద్దతుదారులు ముట్టడించి రచ్చరచ్చ చేసిన అనంతరం..పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ట్రంప్ ఖాతాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నిషేధానికి వ్యతిరేకంగా ట్రంప్ గతంలోనే కేసు వేశారు.


తాజాగా ఆయన మరోమారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ చర్యలను నిలిపివేసేలా సోషల్ మీడియా వేదికలను ఆదేశించాలంటూ కోర్టులో ఇంజంక్షన్ కేసు పెట్టారు. ‘‘ట్వీట్ చేసేందుకు తాలిబన్లకు అవకాశం ఇచ్చిన ట్విటర్ నా అకౌంట్‌ను మాత్రం నిషేధించింది. తాలిబన్ల తమ విజయాలను బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు. అయితే..నేను మాత్రం అప్పట్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశానని, హింసను ప్రోత్సహించానని ట్విటర్ నా ఖాతాను స్తంభింపచేసింది. అప్పటికీ నేను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాను. ’’ అని ట్రంప్ తన అప్పీలులో పేర్కొన్నారు.  ‘‘అమెరికాలో రాజకీయ చర్చలపై ట్విటర్ అమితమై పట్టుకలిగి ఉంది. చరిత్రలో మునుపెన్నడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదు. ఇది స్వేఛ్చాయుత ప్రజాస్వామిక చర్చలపై పెను ప్రభావం చూపుతుంది’’ అని ట్రంప్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-03T02:49:50+05:30 IST