ట్రంప్ అభిశంసనపై మరోసారి చర్చ.. ఈసారి గ్యారంటీనా?

ABN , First Publish Date - 2021-01-14T04:19:17+05:30 IST

అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన గురించి యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్‌లో మరోసారి చర్చ మొదలైంది. వారం రోజుల క్రితం యూఎస్ కాపిటోల్ హిల్‌పై ట్రంప్ మద్దతు దారులు దాడికి దిగిన తర్వాత ఈ చర్చ జరుగుతుండటం గమనార్హం.

ట్రంప్ అభిశంసనపై మరోసారి చర్చ.. ఈసారి గ్యారంటీనా?

వాషింగ్టన్: అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన గురించి యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్‌లో మరోసారి చర్చ మొదలైంది. వారం రోజుల క్రితం యూఎస్ కాపిటోల్ హిల్‌పై ట్రంప్ మద్దతు దారులు దాడికి దిగిన తర్వాత ఈ చర్చ జరుగుతుండటం గమనార్హం. ఈ చర్చలో చాలా మంది కాపిటోల్ ఘర్షణలకు ట్రంపే కారణమని విమర్శలు చేశారు. వీరిలో ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్లు కూడా ఉన్నారు. అయితే రిపబ్లికన్లు అందరూ ట్రంప్ వ్యతిరేకులు కాదు. కొందరు ట్రంప్ ప్రవర్తనను అంగీకరించలేదు కానీ, ఇప్పుడు సడెన్‌గా అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం తీసుకురావడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. అంటే మరికొన్ని రోజుల్లో అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ ఎలాగూ తప్పుకోక తప్పదు.


దీన్నే రిపబ్లికన్లు ప్రస్తావిస్తున్నారు. ఎటూ మరికొన్ని రోజుల్లో ట్రంప్ తప్పుకుంటారని, ఇలాంటి సమయంలో అభిశంసన కన్నా.. 9/11 ఉగ్రదాడులపై పెట్టినట్లు ఓ కమిషన్ ఏర్పాటు చేయడం సరైన నిర్ణయమని వాళ్లు సూచించారు. ‘అధ్యక్షుడి రెక్లెస్ మాటలు, ఆమోదయోగ్యం కాని ప్రవర్తన క్షమార్హం అని భావించి కాదు. అధ్యక్ష పదవికి కొంత గౌరవం, ప్రొసీజర్లు ఉంటాయి కాబట్టే ఇలా అడుగుతున్నాం’ అని రిపబ్లికన్లు అంటున్నారు. అలాగే ట్రంప్‌పై రెండోసారి అభిశంసన తీర్మానం చేయడం వల్ల దేశంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని, కావున ఎలాంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దని సూచించారు.



అయితే దీనిపై డెమొక్రాట్ల వాదన మరోలా ఉంది. ‘మనం యాక్చువల్‌గా నేరం జరిగిన ప్రాంతంలో చర్చించుకుంటున్నాం. అధ్యక్షుడి కారణంగానే ఈ చర్చ జరుగుతోందని గుర్తుంచుకోండి’ అని అంటున్నారు. అలాగే రిపబ్లికన్లలో ఉన్నత స్థాయిలో ఉన్న లిజ్ చెనీ కూడా ట్రంప్ అభిశంసనకు మద్దతుగా నిలబడటాన్ని డెమొక్రాట్లు ఎత్తిచూపారు. అంతకుముందు చెనీ మాట్లాడుతూ.. కాపిటోల్ ఘటనకు ట్రంపే కారణమని, అమెరికా రాజ్యాంగానికి ఇంతకంటే ఘోరమైన ద్రోహం చరిత్రలో జరగలేదని మండిపడ్డారు. దీంతో రిపబ్లికన్లు కూడా చీలిపోయారు. కొందరు అభిశంసనకు మద్దతిస్తుండగా, మరికొందరు ఈ నిర్ణయం సరైంది కాదని అంటున్నారు. ఈ క్రమంలో శ్వేతసౌధంపై మరిన్ని చర్యల కోసం డిమాండ్లు పెరిగే అవకాశం ఉంది.


కాగా, హౌస్‌లో ఇంతకు ముందే ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఓ ప్రతిపాదన చేశారు. దీని కోసం వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్.. రాజ్యాంగంలోని అమెండ్‌మెంట్ 25 అధికారంతో ట్రంప్‌ను అధ్యక్షుడిగా తొలగించాలని కోరారు. హౌస్‌లో 223-205 ఓట్లతో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. అయితే దీన్ని తిరస్కరించిన పెన్స్.. తాను రాజకీయాల కోసం తనకు రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని వాడుకోనని స్పష్టంగా చెప్పేశారు. ఈ క్రమంలోనే మరోసారి ట్రంప్ అభిశంసనపై తీర్మానం చేయడానికి హౌస్ మీటింగ్ మొదలైంది. అయితే ఈ సారి మాత్రం అభిశంసన తీర్మానానికి ఆమోదం లభించే అవకాశం ఉందని, రెండు పార్టీలు ఈ విషయంలో ఒకే నిర్ణయంతో ఉన్నట్లు సమాచారం. దీంతో కచ్చితంగా ట్రంప్‌ను సాగనంపేస్తామని డెమొక్రాట్లు ధీమాగా ఉన్నారు.

Updated Date - 2021-01-14T04:19:17+05:30 IST