Abn logo
Feb 13 2020 @ 05:45AM

ట్రంప్‌ భారత యాత్ర

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెగ సంబరపడిపోతున్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్న ట్రంప్‌ దంపతులను ఘనంగా స్వాగతిస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. అది ఎలా ఉండబోతున్నదీ ట్రంప్‌ స్వయంగా చెప్పారు. ఎయిర్‌పోర్టు నుంచి అహ్మదాబాద్‌ స్టేడియం వరకూ రోడ్డుకు ఇరువైపులా డెబ్బయ్‌ ఎనభైలక్షలమంది బారులు తీరి స్వాగతాలు పలుకుతారట. ప్రపంచంలో అతిపెద్ద స్టేడియంగా రికార్డులకు ఎక్కబోతున్న అహ్మదాబాద్‌ స్టేడియాన్ని ట్రంప్‌ అధికారికంగా ఆరంభించి, కనీసం లక్షమందిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. అమెరికా సభల్లో జనం సంఖ్య నలభై యాభైవేలకు మించదు కనుక, ఇకపై అమెరికాలో యాభైవేలమందిని చూసినా తనకు చిన్నగానే కనిపిస్తుందని ట్రంప్‌ జోక్‌ చేశారు. ‘చాలా పెద్ద స్టేడియం...ప్రపంచంలోనే పెద్దది. ఆయన దానిని కడుతున్నాడు, పూర్తికావచ్చింది’ అంటూ, మోదీ తనకు మంచి మిత్రుడనీ, గ్రేట్‌ జెంటిల్‌మెన్‌ అనీ ట్రంప్‌ తన భారత పర్యటన గురించి ఎంతో ఉత్సాహంగా చెప్పుకొచ్చారు. కానీ, కీలకమైన వాణిజ్య ఒప్పందం విషయానికి వచ్చేసరికి మాత్రం ఆయన మాటలు అంత ఉత్తేజకరంగా లేవు.

ట్రంప్‌కోసం అహ్మదాబాద్‌ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. రోడ్ల మరమ్మత్తులు, వెలుగు జిలుగుల కోసం భారీగా ఖర్చవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ సమావేశాలను కూడా వాయిదావేసుకుంది. గత ఏడాది హ్యూస్టన్‌లో జరిగిన ‘హౌడీ మోడీ’ తరహాలో, ఆ స్థాయిలో అహ్మదాబాద్‌ స్టేడియంలో ‘కెమ్‌ చో ట్రంప్‌’ (హౌ ఆర్‌ యూ ట్రంప్‌) సభ జరగబోతున్నది. ట్రంప్‌ స్వయంగా కోరడంతో మోదీ ఇందుకు ఉపక్రమించినట్టు కూడా వార్తలు వచ్చాయి. చైనా అధ్యక్షుడు, ఇజ్రాయెల్‌, జపాన్‌ ప్రధానులు ఇత్యాది విదేశీ అతిథులకు మోదీ స్వరాష్ట్రంలో ఆతిథ్యం ఇవ్వడం గతంలో చూసిందే. పైగా, ట్రంప్‌ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అమెరికా ప్రవాసులు, అందునా గణనీయమైన సంఖ్యలో ఉన్న గుజరాతీలు కనుక ఇక్కడ జరగవలసిందే.

దేశప్రజలందరూ తమ మాతృభాషల్లో ట్రంప్‌కు సామాజిక మాధ్యమాల ద్వారా స్వాగత వచనాలు పలకమని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. మోదీ ఆశిస్తున్నట్టుగా ట్రంప్‌ పర్యటన ఇరుదేశాల సంబంధాలు దృఢపడేందుకు ఉపకరిస్తుంది, పరస్పర సహకారానికి పునాదులు వేస్తుంది. పైగా, ఆయన ఇప్పుడు అమెరికా సెనేట్‌ అభిశంసననుంచి బయటపడి, మచ్చలేని మనిషిగా ఈ ఏడాది చివర్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడబోతున్నారు. కనుక పర్యటన ఏర్పాట్లు ఈ తీరున ఘనంగా ఉండవలసిందే. 

అంతా బాగున్నది కానీ, కీలకమైన వాణిజ్య ఒప్పందం అంశాన్నే ట్రంప్‌ తేలికగా తీసుకున్నట్టు కనిపిస్తున్నది. ఇండియన్స్‌ ఏదో అడుగుతున్నారు కానీ, సరిగ్గా ఉంటేనే అది జరుగుతుందనడం, ‘రైట్‌ డీల్‌–నో డీల్‌’ అనేయడం కేవలం ముందు జాగ్రత్తతో చేసినవా లేక ఒప్పందంలోని అంశాలు ఇంకా కొలిక్కిరాలేదా అన్న అనుమానం రేకెత్తిస్తున్నాయి. ట్రంప్‌ పర్యటనలో ప్రధానాంశం ఈ ఒప్పందమేనని ఎప్పటినుంచో అనుకుంటుంటే, ఇప్పుడాయన దీని గురించి ఇంత తక్కువ మాట్లాడటం విచిత్రమే. అమెరికా డైరీ ఉత్పత్తులకు, వైద్యపరికరాలకు భారతదేశం తన మార్కెట్లు తెరవాలనీ, మరిన్ని రాయితీలు ఇవ్వాలని ట్రంప్‌ పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఇందుకు ప్రతిగా ట్రంప్‌ ఇటీవల రద్దుచేసిపారేసిన గతకాలపు హోదాలన్నీ తనకు తిరిగికట్టబెట్టాలని భారత్‌ అడుగుతున్నది. భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా వంటి పలుదేశాలు తాము ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాలేనని కేవలం స్వయంప్రకటనతో రాయితీలు తన్నుకుపోవడమేమిటని ప్రపంచవాణిజ్య సంస్థతో కూడా అమెరికా తీవ్రంగా గొడవపడింది. చైనా, భారత్‌ సహా ప్రత్యేక ప్రాధాన్యతను ఎత్తివేయబోయే కొన్ని దేశాల జాబితాను అమెరికా సోమవారం ఖరారు చేసిందని కూడా వార్తలు వెలువడ్డాయి. 

ట్రంప్‌ పలు దేశాలతో వాణిజ్య ఒప్పందాలను తిరగరాస్తున్నది ప్రధానంగా తన రాజకీయ ప్రయోజనాలకోసమే. అమెరికా, చైనా మధ్య తీవ్రస్థాయి వాణిజ్య యుద్ధం సాగిన తరువాత ఇటీవలే ఆ రెండు దేశాల మధ్యా ఓ ఒప్పందం కుదిరింది. దీనిని కొంతమంది ఆర్థిక నిపుణులు యుద్ధ సంధిగా అభివర్ణిస్తూ అమెరికాకు పెద్ద ప్రయోజనం చేకూర్చదని కూడా తేల్చేశారు. భారత్‌తో కూడా ట్రంప్‌ ఇటీవలికాలంలో పోటాపోటీ సుంకాల యుద్ధం సాగించిన నేపథ్యంలో, అటువంటి ఏదో ఒక ఒప్పందం చేసుకోవడం అవసరం. అదేమీ లేకుండా ‘హౌ ఆర్‌ యూ’ అంటూ ట్రంప్‌ ఎన్నికల విజయానికి ఉపకరించే పలుకరింపుల వల్లా, ఆయుధాల కొనుగోలు ఒప్పందాల వల్లా భారత్‌కు పెద్దగా లాభించేదేమీ ఉండదు.

Advertisement
Advertisement
Advertisement