జి-7లో భారత్‌!

ABN , First Publish Date - 2020-06-01T14:14:43+05:30 IST

ఏడు దేశాల కూటమి జి-7 సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ప్రపంచంలోని అగ్రగామి ఆర్థిక వ్యవస్థలైన ఈ ఏడు దే

జి-7లో భారత్‌!

  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడి

వాషింగ్టన్‌, మే 31: ఏడు దేశాల కూటమి జి-7 సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ప్రపంచంలోని అగ్రగామి ఆర్థిక వ్యవస్థలైన ఈ ఏడు దేశాల కూటమిలో భారత్‌ను కూడా చేర్చుకోవాలని ఆయన అభిలషిస్తున్నారు. చైనా ప్రాబల్యాన్ని నిరోధించడానికి ఇది అవసరమని భావిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇప్పటి కూటమి 55 శాతానికి మాత్రమే ప్రాతినిఽధ్యం వహిస్తోందని.. భారత్‌తో పాటు మరో 3 దేశాలను కూడా చేర్చుకుని జి-11 మహాకూటమిగా ఏర్పడాలని ఆయన సూచించారు. ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్‌-ఎక్స్‌ తొలిసారి మానవుడిని అంతరిక్షంలోకి పంపిన కార్యక్రమానికి శనివారం హాజరై తిరిగివస్తున్న సమయంలో ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో ట్రంప్‌ విలేకరులతో మాట్లాడారు. జూన్‌ ఆఖరులో జరగాల్సిన జి-7 భేటీని సెప్టెంబరుకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటి కూటమి కాలం చెల్లిన గ్రూపు అని.. భారత్‌, రష్యా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాలను కూడా చేర్చుకుని దానిని విస్తరించాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు.  చైనాను ఎదుర్కోవడానికి  సంప్రదాయ మిత్ర దేశాలన్నీ ఏకం కావాలని చెప్పారు. తొలుత ఆయన రష్యా పేరు చెప్పలేదు. తర్వాత విలేకరులతో ఆఫ్‌ది రికార్డుగా మాట్లాడుతూ రష్యా పేరును గట్టిగా సూచించారు. అయితే ఈ కూటమి సమావేశం ఎప్పుడు జరుగుతుందో స్పష్టత లేదు.


ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలు సెప్టెంబరు 15న ప్రారంభమై 22న ముగుస్తాయి. వాటికి వివిధ దేశాధినేతలు హాజరవుతారు. ఆ సందర్భంగానే కూటమి భేటీ ఏర్పాటు చేయాలని ట్రంప్‌ యంత్రాంగం భావిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. ఇది ఎన్నికల్లో ట్రంప్‌కు ఉపకరించవచ్చని అంటున్నారు. కాగా.. ట్రంప్‌ భారత్‌ను మహాకూటమిలో చేర్చాలని భావించడం అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత్‌ పలుకుబడికి నిదర్శనమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రష్యాతో కలిపి ప్రస్తుత జి-7 ఒకప్పుడు జి-8గా ఉండేది. అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, కెనడా, జపాన్‌, ఇటలీ, జర్మనీ, రష్యా ఇందులో భాగస్వాములు. ఉక్రెయిన్‌ భూభాగం క్రిమియాను రష్యా తనలో విలీనం చేసుకున్నందుకు నిరసనగా 2014లో ఆ దేశాన్ని కూటమి నుంచి బహిష్కరించారు. దాంతో జి-8 స్థానంలో జి-7 ఏర్పడింది. నిరుడు ఫ్రాన్స్‌లోని బియారిట్జ్‌లో జి-7 దేశాధినేతలు సమావేశమయ్యారు. ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఎమాన్యుయల్‌ మెక్రాన్‌ ఆహ్వానం మేరకు భారత ప్రధాని మోదీ ఈ భేటీకి హాజరయ్యారు. జి-8గా ఉన్నప్పుడు 2005లో భారత్‌ను ఒకసారి ఆహ్వానించారు. ఇండియా ప్రస్తుతం జి-20 దేశాల కూటమిలో భాగస్వామిగా ఉంది.


Updated Date - 2020-06-01T14:14:43+05:30 IST