ట్రంప్‌, ఇక చాలు

ABN , First Publish Date - 2020-12-17T06:07:40+05:30 IST

అమెరికాలో సోమవారం జరిగిన ఎలక్టొరల్‌ కాలేజీ సమావేశం ఉన్న నిజాన్నే బల్లగుద్ది మరీ చెప్పింది. మొన్నటి అధ్యక్ష ఎన్నికల్లో...

ట్రంప్‌, ఇక చాలు

అమెరికాలో సోమవారం జరిగిన ఎలక్టొరల్‌ కాలేజీ సమావేశం ఉన్న నిజాన్నే బల్లగుద్ది మరీ చెప్పింది. మొన్నటి అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌, కమలా హారిస్‌ ఘన విజయం సాధించారనీ, అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షులు ఇక ముమ్మాటికీ వారేనని 306 ఓట్లతో ఈ సమావేశం నిర్థారించింది. ఓటమిని అంగీకరించడానికి డొనాల్డ్‌ ట్రంప్‌కు మనసురావడం లేదు కానీ, ఆయనకూ, మిగతా రిపబ్లికన్‌ పార్టీ నాయకులకూ ఇంతకంటే విస్పష్టమైన సందేశం ఇంకేమీ ఉండదు. ఎన్నికల్లో అన్యాయాలూ అక్రమాలూ చేసి బైడెన్‌ నెగ్గుకొచ్చాడంటూ న్యాయస్థానాలను ఆశ్రయించిన ట్రంప్‌కు అక్కడా వరుస ఎదురుదెబ్బలే. ట్రంప్‌ ఇంకా ఎంతకాలం అదే అర్థంలేని మొండిపట్టుదల ప్రదర్శిస్తే అంతమేరకు తనతో పాటు, పార్టీ పరువు కూడా తీసేసినవారవుతారు. అమెరికా ఎన్నికల వ్యవస్థనీ, ప్రజాస్వామ్యాన్ని అప్రదిష్టపాల్జేసిన అపఖ్యాతి ఆయనతో పాటు పార్టీ మెడకూ చుట్టుకుంటుంది. 


ఎలక్టొరల్‌ కాలేజీ ఓటింగ్‌ తరువాత రిపబ్లికన్‌ నాయకులు దిగిరాక తప్పడం లేదు. ఆ పార్టీ సీనియర్‌ నాయకుల్లో ఒకరైన మిచ్‌ మెక్‌కానెల్‌ కొత్త అధ్యక్ష ఉపాధ్యక్షులకు తన బహిరంగ మద్దతు ప్రకటించడమే కాక, ఎన్నికల ఫలితాలను ప్రశ్నించడం, అనుమానించడం ఇక మనం మానుకోవాలని పార్టీకి హితబోధ కూడా చేశారు. పార్టీకి వీరవిధేయుడని పేరున్న ఈ పెద్దాయన గతంలో పలు సందర్భాల్లో ట్రంప్‌ను వ్యతిరేకించినా, బైడెన్‌ విజయాన్ని కూడా మొన్నటివరకూ గుర్తించ నిరాకరించాడు. ట్రంప్‌కు సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురవడం, ఎలక్టొరల్‌ కాలేజీ బైడెన్‌ పక్షాన నిలవడంతో రిపబ్లికన్ సెనేటర్లు ఒకరి తరువాత ఒకరు ఎన్నికల ఫలితాలను ఎదురు ప్రశ్నించవద్దని వ్యాఖ్యానించడం ఆరంభించారు. ఎలక్టొరల్‌ కాలేజీ ఫలితాలకు లాంఛనప్రాయమైన ఆమోదముద్ర వేసేందుకు జనవరి 6న జరగబోయే పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశానికి ఎంతోముందుగానే రిపబ్లికన్‌పార్టీ నేతల వైఖరిలో ఈ మార్పు రావడం, బైడెన్‌తో కలసిపనిచేస్తామని అనేకులు ప్రకటించడం ట్రంప్‌కు ఎదురుదెబ్బే.


సుప్రీంకోర్టు తీర్పును సైతం తప్పుబడుతున్న ట్రంప్‌, తన ఓటమి విషయంలో ఇంతవేగంగా రాజీపడకపోవచ్చునని విశ్లేషణలు వెలువడుతున్నాయి. బైడెన్‌ను నిలువరించడానికి మరిన్ని మార్గాలు వెదుకుతామంటూ ఆయన వైట్‌హౌస్‌ అనుయాయులు చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ట్రంప్‌ మొండితనం తెలిసిందే కనుక, బైడెన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కూడా ఆయన రారనీ, ఆ విధంగా గైర్హాజరై మరో నలుగురు మాజీ దేశాధ్యక్షులతో పాటు ఈయన కూడా చరిత్రలో నిలిచిపోతారని అంటున్నారు. బైడెన్‌ ప్రమాణ స్వీకారం తరువాత కూడా ట్రంప్‌ తన వైఖరి వదలకపోయినా ఆయనకు వ్యక్తిగతంగా వచ్చిన నష్టమేమీ ఉండదు. కానీ, పోయేది అమెరికా పరువే. అతిఘనమైన ప్రజాస్వామ్యదేశంగా చెబుతున్న అమెరికాలో ఎన్నికల ప్రక్రియ ఇంత సుదీర్ఘంగా, సంక్లిష్టంగా, వివాదాస్పదంగా ఉండటం చూసి ప్రపంచం ఆశ్చర్యపోతున్నది. నియంతృత్వ దేశాల్లో తప్ప ప్రజాస్వామిక దేశాల్లో చూడని విచిత్రమైన ఘట్టాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అధికార బదలాయింపు ఎంతో గౌరవంగా, సునాయాసంగా జరిగేట్టు చూడాల్సిన బాధ్యతను రిపబ్లికన్‌ నాయకులు ఇప్పటికైనా నెత్తికెత్తుకోవాలి. ట్రంప్‌కు వంతపాడటం ఆపివేసి, కొత్త పాలకులతో, ప్రభుత్వంతో కలసి పనిచేయాల్సిన బాధ్యత రిపబ్లికన్ సెనేటర్లపై ఉంది. ఇటీవలి ట్రంప్‌ అనుకూల ర్యాలీ హింసాత్మకంగా మారి, నాలుగు చర్చీలపై దాడులు జరిగి, నల్లజాతివారి బ్యానెర్లు, చిహ్నాలను తగులబెట్టిన ఘటన ఒక ప్రమాద హెచ్చరిక. ట్రంప్‌ను అలాగే వదిలేస్తే ఆయన తౘన వ్యాఖ్యలతో ఇటువంటి మరిన్ని ఘటనలకు కారకుడవుతాడు. తాను ఓడిపోలేదని నమ్ముతున్న ట్రంప్‌ నాలుగేళ్ళ తరువాత మళ్ళీ పోటీచేసి చక్కగా గెలవవచ్చు. అంతలోగా, ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు తాను చేస్తున్న ప్రతీ ప్రయత్నం వీగిపోతున్న స్థితిలో, ఎలక్టొరల్‌ కాలేజీ ఓట్లు నిర్థారణ అయితే తప్ప వైట్‌హౌస్‌ ఖాళీ చేయనని గతంలో ప్రకటించిన ఆయన తన మాటకు కట్టుబడి సాధ్యమైనంత వేగంగా గుడ్‌బై చెప్పడం సముచితం.

Updated Date - 2020-12-17T06:07:40+05:30 IST