ట్రంప్‌కు మేలు, అమెరికాకు కీడు

ABN , First Publish Date - 2020-02-02T01:25:02+05:30 IST

ఇరాన్‌పై దాడి ద్వారా డోనాల్డ్ ట్రంప్ వ్యక్తిగతంగా రాజకీయ లబ్ధి పొందగలిగే అవకాశమున్నది. అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న ట్రంప్ అనుసరిస్తున్న విధానాలతో ఒక దేశంగా అమెరికా తప్ప

ట్రంప్‌కు మేలు, అమెరికాకు కీడు

ఇరాన్‌పై దాడి ద్వారా డోనాల్డ్ ట్రంప్ వ్యక్తిగతంగా రాజకీయ లబ్ధి పొందగలిగే అవకాశమున్నది. అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న ట్రంప్ అనుసరిస్తున్న విధానాలతో ఒక దేశంగా అమెరికా తప్పక నష్టపోతుంది. 


అ‍‍మెరికా రాజకీయాలలో ఇరాన్, ఇరాఖ్‌ దేశాలు మరోసారి కేంద్రబిందువు అవుతున్నాయి. దీని పర్యవసానంగా అరబ్బు దేశాల రాజకీయ, సైనిక సమీకరణలూ శరవేగంగా మారుతున్నాయి. భారత్‌తో సహా అనేక వర్ధమాన దేశాలపై అనివార్యంగా ఈ పరిణామాల ప్రభావం పడుతుంది.

 

పశ్చిమాసియాలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానానికి కారణాలు ఏమిటో నిశితంగా చూడవలసిన అవసరమున్నది. సెనేట్ (కాంగ్రెస్ ఎగువ సభ)లో ట్రంప్‌పై అభిశంసన తీర్మానం చర్చకు రానుండటం; ఈ సంవత్సరాంతంలో జరగనున్న అధ్యక్ష పదవి ఎన్నికలు..- ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకునే ఇరాఖ్‌లో ఇరానియన్ సైనికాధికారి జనరల్ సులేమానిపై ట్రంప్‌ డ్రోన్ దాడికి ఆదేశించి వుంటారని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే జనరల్ సులేమాని హత్యతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పలు సంక్లిష్ట పరిణామాలు వడిగా చోటు చేసుకుంటున్నాయి.

 

ఇరాన్‌పై దాడి ద్వారా ట్రంప్ వ్యక్తిగతంగా రాజకీయ లబ్ధి పొందగలిగే అవకాశమున్నది. అయితే, అటువంటి దాడితో ఒక దేశంగా అమెరికా మాత్రం తప్పక నష్టపోతుంది. పశ్చిమాసియాలో ఇరాన్ మినహా పొరుగున ఇరాఖ్‌లో ఉన్నంతగా షియాలు మరే దేశంలోను లేరు. సద్దాం హుస్సేన్ హయాంలో ఇరాన్‌కు ఇరాఖ్ వ్యవహారాలలో ఏ మాత్రం వేలు పెట్టే అవకాశం లభించలేదు. ఈ శతాబ్ది తొలి సంవత్సరాలలో ఇరాఖ్‌ను దురాక్రమించుకున్న అమెరికా, ఇరాన్ పట్ల సానుకూల వైఖరితో వ్యవహరించింది. ఆ తరువాతే ఇరాఖ్‌తో పాటు ఇతర అరబ్ దేశాలలో ఇరాన్ ప్రభ ఒక్కసారిగా వెలిగిపోయింది.

 

ఇస్లామిక్ స్టేట్‌తో పరాకాష్ఠకు చేరిన ఇస్లామిక్ ఉగ్రవాదం అనేక దేశాలకు పెను సవాళ్లను విసిరింది. ఇస్లామిక్ స్టేట్ పెనుప్రమాదం నుంచి రక్షించుకోవడానికి అమెరికాతో సహా అనేక దేశాలు దిక్కుతోచని పరిస్థితులలో కొట్టుమిట్టాడాయి. ఆ పరిస్థితులలో ఇరాన్ తమ షియా సానుకూల సాయుధ దళాలతో ఇరాఖ్–సిరియా సరిహద్దులలో ఇస్లామిక్ స్టేట్‌ను సమర్థంగా అణచివేసింది, ఈ చర్య ద్వారా అరబ్ దేశాలలోని షియా ప్రాంతాలలో తనకు వ్యూహాత్మక పట్టు ఉందని ఇరాన్ తిరుగులేని విధంగా నిరూపించింది. ఇరాన్ సాధించిన ఈ విజయాలకు జనరల్ ఖాసిం సులేమానీ ప్రధాన కారకుడు.

 

అరబ్బు దేశాలలో ఇరాన్ సైనిక, రాజకీయ వ్యూహాల రూపకర్త జనరల్ సులేమానీ. ఇటువంటి కీలక వ్యక్తిని అమెరికా హతమార్చడంతో ఒక్క సారిగా పరిస్థితి మారిపోయింది. అరబ్బు దేశాలలో కీలకమైన ఇరాఖ్‌లో అమెరికా వ్యూహాత్మక తప్పిదాలకు జనరల్ సులేమానీ హత్యే ఒక తార్కాణం. అసలు అరబ్బు దేశాలన్నిటా అస్థిరత సృష్టించమే అమెరికా లక్ష్యంగా వున్నది. జనరల్ సులేమానీ హత్యతో ఆ లక్ష్యమే అమెరికా ప్రయోజనాలకు విఘాతంగా పరిణమించింది. తమ దేశంలో తమ అనుమతి లేకుండా ఇరానియన్ సైనికాధికారిని హతమార్చడం పట్ల ఇరాఖ్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయింది. తత్కారణంగానే అమెరికా సైనిక బలగాలను తమ దేశం నుంచి బహిష్కరిస్తూ ఇరాఖ్ పార్లమెంటు ఒక తీర్మానం చేసింది. ఇరాఖ్‌లోని అమెరికా సైనికాధికారులు స్వదేశానికి వెళ్ళిపోవడానికి సంసిద్ధమయ్యారు. అయితే, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ససేమిరా అన్నారు. తాము ఇరాఖ్ నుండి వెనక్కి తగ్గేది లేదని ఆయన నిస్సిగ్గుగా ప్రకటించారు. పైగా తాము తిరిగి వెళ్ళాలంటే ఇరాఖ్ తమకు భారీ మొత్తంలో డబ్బు చెల్లించవల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు. అంతేకాక ఇరాన్‌లోని యాభై రెండు చారిత్రక ప్రదేశాలపై దాడులు చేసేందుకు తాము వెనుకాడబోమని డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ హెచ్చరికతో, అంతర్జాతీయ వ్యవహారాలలో పాటించవల్సిన మర్యాదలన్నిటినీ అమెరికా అధ్యక్షుడు పూర్తిగా విస్మరించారని చెప్పక తప్పదు.

 

అమెరికా తప్పిదాల ఫలితంగా అరబ్బు దేశాలలో రష్యా ప్రాబల్యం పెరుగుతోంది. పశ్చిమాసియాలో వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా రష్యా తన ప్రయోజనాలను సాధించుకొంటోంది. సిరియా విషయంలో రష్యా తన పట్టును నిరూపించుకుంది. అమెరికా, సౌదీ అరేబియాలకు సమాంతరంగా ఎదగడానికి రష్యా, టర్కీలు అన్ని విధాల ప్రయత్నిస్తున్నాయి. ఇక ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా చేస్తున్న ప్రకటనలతో వాణిజ్య ప్రపంచం భగ్గుమన్నది. చమురు ధరలు పెరిగిపోయాయి. బంగారం ధరలు సైతం అనూహ్యంగా పెరిగిపోయాయి. బంగారం ధరలు ఇంత భారీ స్థాయిలో పెరగడం గత ఏడేళ్ళలో ఇదే మొదటిసారి. మన దేశంపై ఈ పరిణామాల ప్రభావం సంతోషకరంగా ఉండదని మరి చెప్పనవసరం లేదు.

 

ప్రపంచవ్యాప్తంగా చమురు వినియోగంలో భారతదేశం మూడో ప్రధాన దేశం. దేశ ఆర్థికవ్యవస్థలో చమురు బిల్లు అత్యంత వ్యయభరితమైనది. చమురు పీపా ధరలో ఒక్క డాలర్ వ్యత్యాసం వచ్చినా దాని ప్రభావం భారతదేశంపై కొన్ని వందల కోట్ల రూపాయలలో ఉంటుంది. సహజంగానే ఏ దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది మంచిది కాదు. అందునా భారత్ లాంటి వర్ధమాన దేశాలకు ఏమాత్రం మంచిది కాదని మరి చెప్పనవసరం లేదు. ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న 2020–-21 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్‌పై ఈ పరిణామాల ప్రభావం ఉంటుందనడంలో సందేహం లేదు.

 

ఏమైనా గల్ఫ్ చమురు రంగంలో ప్రతికూల పరిస్థితులు మోదీ సర్కార్‌కు శుభప్రదం కావు. రాజకీయంగా అచ్ఛేదిన్‌నివ్వవు. సౌదీ అరేబియా, ఇరాఖ్, ఇరాన్ దేశాల నుంచే భారత్ ప్రధానంగా చమురు దిగుమతులు చేసుకొంటుంది. అరబ్బు దేశాలలో చోటు చేసుకునే అన్ని కీలక రాజకీయ, సైనిక కార్యకలాపాలలో అమెరికా పాత్ర తప్పకుండా వుంటుంది. ముఖ్యంగా సౌదీ పక్షాన వచ్చే అమెరికాది కీలక పాత్ర అనేది విదితమే. అమెరికా ఒత్తిడి కారణాన ఇరాన్ నుండి చమురు దిగుమతులను భారత్ క్రమేణా తగ్గిస్తోంది. ఇరాన్ సంక్షోభం ఒక్క భారత్‌నే కాదు, పొరుగున ఉన్న దుబాయిని కూడా పరోక్షంగా ప్రభావితం చేస్తుందంటే విస్మయం కలుగుతుంది కదూ! 


Updated Date - 2020-02-02T01:25:02+05:30 IST