ట్రంప్‌ను దింపేయాల్సిందే

ABN , First Publish Date - 2021-01-09T07:47:56+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన పదవీకాల చివరిదశలో పూర్తి సంక్షోభ స్థితిలో పడ్డారు. కేపిటల్‌ భవనంపై దాడితో పరిస్థితి మొత్తం మారిపోయి-

ట్రంప్‌ను దింపేయాల్సిందే

  • విధ్వంసాలను అభిశంసించాల్సిందే.. 220 మంది కాంగ్రెస్‌ సభ్యుల డిమాండ్‌!
  • మీరు చేయకుంటే మేమే చేస్తాం.. ఉపాధ్యక్షుడికి డెమొక్రాట్ల స్పష్టీకరణ
  • ట్రంప్‌ యూటర్న్‌... దాడిపై ఖండన.. స్వీయ-క్షమాభిక్షపై మంతనాలు
  • మరిక పోటీచేయనని సంకేతాలు.. బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి వెళ్లనని ట్వీట్‌

5 కు పెరిగిన మృతుల సంఖ్య 


వాషింగ్టన్‌, జనవరి 8: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన పదవీకాల చివరిదశలో పూర్తి సంక్షోభ స్థితిలో పడ్డారు. కేపిటల్‌ భవనంపై దాడితో పరిస్థితి మొత్తం మారిపోయి- ఆయనను తక్షణం గద్దె దింపేయాల్సిందేనన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. ట్రంప్‌ అధికారంలో ఉండేది కేవలం 12 రోజులే అయినా ఈ స్వల్ప సమయంలోనే -ఆయన దుశ్చర్యలకు తగిన ‘శిక్ష’ విధించాలని డెమొక్రాట్లు పట్టుదలగా ఉన్నారు. ‘25వ సవరణను అనుసరించి ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ , కేబినెట్‌ తక్షణం సమావేశమై వెంటనే అధ్యక్షుణ్ణి తప్పించాలి.


ఇది ఒక ఎమర్జెన్సీ.. అర్జెంట్‌గా జరిగిపోవాలి. ఇంపీచ్‌ హిమ్‌.. ఇంపీచ్‌ హిమ్‌... అంటూ నా ఫోన్‌ రోజంతా వేలాది కాల్స్‌తో మార్మోగిపోతోంది. ఒకవేళ వారు గనక ఈ నిర్ణయం తీసుకోకపోతే మేమే అభిశంసన ప్రక్రియను ప్రారంభిస్తాం. దేశ ప్రజాస్వామ్యంపై దాడిని స్వయంగా ప్రోత్సహించిన అధ్యక్షుడు ఇక ఎంతమాత్రం ఆ పదవిలో ఉండడానికి వీల్లేదు’ అని స్పీకర్‌ నాన్సీ పెలోసీ డిమాండ్‌ చేశారు. ఉభయ సభల్లోని దాదాపు 220 మంది సభ్యులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీరిలో అనేకమంది రిపబ్లికన్లు కూడా ఉండడం విశేషం. అయితే పెన్స్‌ గనక దీనికి నిరాకరిస్తే తక్షణ అభిశంసన అంత సులువు కాదు. అయినా డెమాక్రాట్లు   తమ ప్రయత్నాలు ఆపడం లేదు. 


తీర్మానం రూపకల్పన

ప్రతినిధుల సభ సాధారణంగా జరిపే విధివిధానాలను పక్కనపడేసి, లాంఛనప్రాయంగా ఏర్పాటుచేయాల్సిన కమిటీలను నియమించకుండా, సుదీర్ఘ ప్రసంగాల జోలికిపోకుండా  నేరుగా సభలోనే అభిశంసన తీర్మానాన్ని రెండ్రోజుల్లో  చేపట్టే అవకాశాలపై డెమొక్రాట్లు ప్రస్తుతం చర్చిస్తున్నారు. ముగ్గురు హౌస్‌ జుడీషియరీ కమిటీ సభ్యులు-  డేవిడ్‌ సిసిలైన్‌, టెడ్‌ లియూ, జేమీ రస్కిన్‌ ప్రస్తుతం తీర్మాన రూపకల్పనను చేపట్టారు. సభలో తీర్మానం ప్రవేశపెట్టిన 48 గంటల్లో ఓటింగ్‌ జరిపేసి, దాన్ని ఆమోదించి, సెనెట్‌కు పంపుతారు.


అయితే, అక్కడ ఆమోద ముద్ర పొందడం అనుమానమే. సెనెట్‌ మెజారిటీ నేత మిక్‌ మెకానెల్‌ మరీ అంత హడావుడి ప్రదర్శించి తన చాంబర్లో అభిశంసన విచారణను నిర్వహించే అవకాశాల్లేవని అంటున్నారు. కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా.. అభిశంసన వల్ల దేశానికి మరింత అప్రదిష్ట తప్ప ఒరిగేదేమీ లేదనీ, అనవసరవనీ భావిస్తున్నట్లు సమాచారం.



ట్రంప్‌ ఎత్తుగడలు

చరిత్రలోనే తొలిసారిగా ఒకే టర్మ్‌లో రెండోసారి అభిశంసనకు గురవుతానన్న ఆందోళన వెన్నాడుతుండడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రూటు మార్చేశారు. కేపిటల్‌ భవనంపై దాడిని తీవ్రంగా ఖండించారు. ‘ఐ లవ్యూ... నా హృదయంలో మీకో ప్రత్యేక స్థానం ఉంది...’ అంటూ గురువారం అల్లరిమూకను తెగ  పొగిడిన ఆయన 24 గంటల్లో మాట మార్చారు. దాడి హేయమనీ, ప్రదర్శనకారులు దేశ ప్రజాస్వామ్య వేదికను అపవిత్రం చేశారనీ, వారు అసలు అమెరికన్లే కారనీ, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం వారు చేసిన పెద్ద తప్పిదమనీ ఓ ప్రకటన విడుదల చేశారు.


దౌర్జన్యకాండకు వారు తగిన మూల్యం చెల్లిస్తారన్నారు. అందరు అమెరికన్లలానే తాను కూడా ఈ హింసను, విధ్వంసాన్నీ చూసి దిగ్ర్భాంతికి గురయ్యాయనీ, వెంటనే నేషనల్‌ గార్డ్స్‌ను పంపి నిరసనకారులను తరిమేసి పరిస్థితిని అదుపు చేయగలిగామనీ చెప్పుకొచ్చారు. అధికార మార్పిడి ప్రక్రియ మొదలైపోయిందని చెబుతూ 20వ తేదీన అంతా సజావుగా సాగుతుందనీ అన్నారు. విశేషమేమంటే ఈ వీడియోలో కూడా ఆయన జో బైడెన్‌ గెలిచారనీ ఒప్పుకోలేదు. అసలు ఆయన ప్రస్తావనే తేకుండా.. ఇది గాయాలు మాన్పాల్సిన సమయమని సాంత్వన వచనాలు పలికారు.


వేల మంది మద్దతుదారులను కేపిటల్‌ భవనంలోకి వెళ్లండని రెచ్చగొట్టిన ఆయన- పకడ్బందీగా తన సహాయకులు రాసిచ్చిన స్ర్కిప్ట్‌ను చదివారు. ఈ రెండున్నర నిమిషాల వీడియో పూర్తిగా ట్రంప్‌ను భిన్నకోణంలో ఆవిష్కరించింది. అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేయడం తన జీవితంలో లభించిన గౌరవమని చెబుతూ పరోక్షంగా తాను మళ్లీ పోటీపడేది లేదన్న సంకేతాలు కూడా ఆయన ఇచ్చేశారు. 



స్వీయ క్షమాభిక్షతో తప్పు ఒప్పుకున్నట్లే!

ఈ వీడియోతో పాటు ట్రంప్‌ యోచిస్తున్న మరో ఎత్తు... స్వీయ క్షమాభిక్ష. పదవిలో ఉండగా చేసిన నిర్వాకాలపై తనను తాను క్షమించుకునే అవకాశాల మీద ఆయన తన న్యాయవాదులు, సన్నిహితులతో చర్చించారు. ఒకవేళ స్వీయ క్షమాభిక్ష పెట్టుకుంటే అది ఆయన తన తప్పును ఒప్పుకున్నట్లే. ఇది రాజకీయంగా రిపబ్లికన్‌ పార్టీకీ, ఆయనకూ చెడ్డపేరే తెస్తుంది. ఈ రాజకీయ విపరిణామాలను ట్రంప్‌ అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇది చేసినా ఎవరైనా దానిని న్యాయస్థానాల్లో సవాల్‌ చేయవచ్చనీ, ఈ కేసులు దాఖలైతే వాటిని ఎలా ఎదుర్కోవాలన్నదీ చర్చించారు. అధ్యక్షుడు తనకు తాను క్షమాభిక్ష ఇచ్చుకోవడం చట్టప్రకారం చెల్లుతుందని ఆయన వాదిస్తున్నారు.


నిజానికి 2018లోనే ఆయన దీనిని ప్రయోగించచూశారు. అయితే చట్టాన్ని లోతుగా అధ్యయనం చేస్తే ఇది సహజ న్యాయ సూత్రాల ప్రకారం సమ్మతం కాదనీ, ఏ వ్యక్తీ తన కేసులో తానే జడ్జి కాలేడనీ నిపుణులు అంటున్నారు. ట్రంప్‌ విన్యాసాలను ఎరిగిన అమెరికన్‌ రాజకీయవేత్తలు, మేధావులు ఆయన మాటల్నేవీ న మ్మడం లేదు. అల్లర్లను ప్రోత్సహించిన ఆరోపణలపై క్రిమినల్‌ కేసులు ఎదుర్కొనే అవకాశాలు ఉండడం,  ముఖ్యంగా అభిశంసన, అనర్హత వేటు పడుతుందన్న భయాలు ట్రంప్‌ను ఈ వీడియో విడుదల చేసేట్లు చేశాయని అంటున్నారు.. 


ఆగని రాజీనామాలు

కేపిటల్‌ హిల్‌ దాడి ఘటనలో బ్రయన్‌ సిక్‌నిక్‌ అనే ఓ పోలీసు అధికారి ఆస్పత్రిలో మరణించారు. దీంతో ఈ అల్లర్ల సమయంలో చనిపోయిన వారి సంఖ్య ఐదుకు పెరిగింది. మరో 50 మంది పోలీసు సిబ్బంది కూడా గాయపడి చికిత్స పొందుతున్నారు.  దాడిని నియంత్రించడంలో విఫలమైనట్లు ఆరోపణలు రావడంతో  నైతిక బాధ్యత వహిస్తూ కేపిటల్‌ పోలీస్‌ చీఫ్‌ స్టీవెన్‌ సండ్‌ రాజీనామా సమర్పించారు. దాడి సమయంలో ట్రంప్‌ వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఇద్దరు మహిళా మంత్రులు విద్యామంత్రి బెట్సీ డెవాస్‌, రవాణా మంత్రి ఎలైన్‌ షావో రాజీనామా చేశారు. 



అరెస్టులు షురూ!

దాడికి పాల్పడ్డ వారిని ఎఫ్‌బీఐ ఒకరొకరిగా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. వీరిలో అనేకమంది ఉద్యోగాలు కోల్పోతున్నట్లు అమెరికా మీడియా కథనాలు వివరిస్తున్నాయి. పైప్‌ బాంబులు పెట్టిన వారి ఆచూకీ చెబితే 50వేల డాలర్ల బహుమతి అందిస్తామని ఎఫ్‌బీఐ ప్రకటించింది. 


నచ్చచెప్పిన ఇవాంకా!

వీడియో విడుదలకు ట్రంప్‌ తొలుత నిరాకరించారు. కానీ ఆయనకు కుమార్తె ఇవాంకా నచ్చచెప్పి ఒప్పించినట్లు  తెలుస్తోంది. ‘మనం గనక దీనిని విడుదల చేయకపోతే పరిస్థితి మరింత చేజారుతుంది. అభిశంసనకు మన కేబినెట్‌ సభ్యులే సమాయత్తమవుతున్న స్థితి... అటు క్రిమినల్‌ కేసులూ ఎదుర్కొనాల్సి రావొచ్చు. ఈ ప్రకటన ద్వారా కొంత నష్టాన్ని నివారించగలం..’ అని ఇవాంకా పేర్కొన్నట్లు వైట్‌హౌస్‌ వర్గాలను ఉటంకిస్తూ సీఎన్‌ఎన్‌ పేర్కొంది. ఆమెతో పాటు వైట్‌ హౌస్‌ చీఫ్‌ ఆప్‌ స్టాఫ్‌ మార్క్‌ మెడోస్‌, వైట్‌హౌస్‌ లాయర్‌ ప్యాట్‌ సెపాలోన్‌, మరికొందరు సన్నిహితులు కూడా ఆయనకు నచ్చచెప్పినట్లు సమాచారం.




మరో సంచటన నిర్ణయం

ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 20వ తేదీన జో బైడెన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యేది లేదని ప్రకటించారు. ‘చాలా మంది దీని గురించి అడుగుతున్నారు... నేను దానికి వెళ్లడం లేదు’ అని శుక్రవారం ట్వీట్‌ చేశారు. అంటే సంప్రదాయాలను బేఖాతరు చేసి- లాంఛనప్రాయంగా అధికారం అప్పగింతను ఆయన కాదన్నట్లే! కేపిటల్‌ దాడి ఘటన ఓ పీడకల లాంటిదనీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా అన్నింటినీ మర్చిపోయి రాజీకి రావాలని, బైడెన్‌ను స్వయంగా ఆహ్వానించాలని అనేకమంది చేసిన విజ్ఞప్తులను ట్రంప్‌ తోసిపుచ్చారు.


కాగా, ‘ప్రజాస్వామ్యమంటే ట్రంప్‌కు అసహ్యం. కేపిటల్‌ దాడికి పాల్పడ్డవారు దేశద్రోహులు, దేశీయ ఉగ్రవాదులు. వారిని ట్రంప్‌ సమర్థించారు. సకాలంలో నేషనల్‌ గార్డ్స్‌ను పంపడానికి కూడా నిరాకరించారు’ అని జో బైడెన్‌ దుయ్యబట్టారు.


Updated Date - 2021-01-09T07:47:56+05:30 IST