మూడు నాలుగు వారాల్లో టీకా వచ్చేస్తుంది: ట్రంప్

ABN , First Publish Date - 2020-09-16T17:49:01+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్ ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యాధిక కరోనా కేసులు, మరణాలతో యూఎస్ అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలసిందే.

మూడు నాలుగు వారాల్లో టీకా వచ్చేస్తుంది: ట్రంప్

అసాధ్యమంటున్న వైద్య నిపుణులు

ఫిలడెల్ఫియా(యూఎస్): అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్ ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యాధిక కరోనా కేసులు, మరణాలతో యూఎస్ అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలసిందే. మరోవైపు వ్యాక్సిన్ కోసం అగ్రరాజ్యం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే పలు వ్యాక్సిన్‌లు తుది దశ ట్రయల్స్‌లో ఉన్నట్లు సమాచారం. ఇదిలాఉంటే... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాక్సిన్ విషయమై ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రకటనలు చేస్తున్నారు. ఇదివరకే నవంబర్‌లో వ్యాక్సిన్ వచ్చేస్తుందని, అమెరికా ఎన్నికలు జరుగనున్న నవంబర్ 3 కంటే రెండు రోజుల ముందు వ్యాక్సిన్ విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రంప్ నోట వ్యాక్సిన్‌ విడుదలపై మరో ప్రకటన వెలువడింది. మంగళవారం ఫిలడెల్ఫియాలోని టౌన్ హాల్‌లో ఏబీసీ న్యూస్‌తో మాట్లాడుతూ వచ్చే మూడు నాలుగు వారాల వ్యవధిలోనే వ్యాక్సిన్ వచ్చేస్తుందని ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల కంటే ముందే పంపిణీ చేస్తామని తెలిపారు. 


"మేము కొవిడ్ టీకాకు చాలా దగ్గరగా ఉన్నాం" అని ట్రంప్ అన్నారు. "మునుపటి ప్రభుత్వాల పరిపాలనలో ఎఫ్‌డీఏ, ఇతర ఆమోదాల కారణంగా వ్యాక్సిన్ బయటకు రావడానికి బహుశా సంవత్సరాలు పట్టేది. కానీ, మేము ఈ విధానాన్ని మార్చాం. దీనికి ఉదాహరణ ఈ కరోనా టీకానే. ఇంకో మూడు నాలుగు వారాల్లో వ్యాక్సిన్ పంపిణీ జరగొచ్చు" అని ట్రంప్ చెప్పుకొచ్చారు. 


మరోవైపు ఈ నెల ప్రారంభంలో యూఎస్ అంటు వ్యాధి నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ సీఎన్‌ఎన్‌తో మాట్లాడుతూ నవంబర్ లేదా డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ సిద్ధంగా ఉంటుందని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు. "నా అభిప్రాయం ప్రకారం ఇది సాధ్యపడకపొవచ్చు" అని అన్నారు. కాగా, 2021 ప్రారంభం వరకు శాస్త్రీయంగా సమర్థవంతమైన, ప్రభావంతమైన టీకా అందుబాటులో ఉండదని ఇతర నిపుణులు అంటున్నారు.


ఇక ఇటీవల ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్‌ను త్వరలోనే అదుపులోకి తీసుకువస్తామని నమ్ముతున్నట్లు చెప్పారు. అయితే, ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన ఫౌచీ..."నేను ట్రంప్ చెప్పిన దాంతో విభేదిస్తున్నాను. దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న కొవిడ్ గణంకాలు కలవరపెడుతున్నాయి" అని తెలిపారు. ట్రంప్ చెప్పినట్లు వైరస్‌ను అదుపులోకి తీసుకురావడం అంత సులువు కూడా కాదని  తెలియజేశారు. అంతేగాక శీతకాలం కంటే ముందే ఈ మహమ్మారిని అదుపులోకి తీసుకురావాలని చెప్పారు. లేకుంటే పరిస్థితులు మరింత దిగజారీపోయే ప్రమాదం లేకపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా దేశంలో కొవిడ్ విజృంభణ కొనసాగుతుందని చెప్పిన ఫౌచీ... ఇప్పటికీ డైలీ దాదాపు 40వేల పాజిటివ్ కేసులు, 1000కి పైగా మరణాలు నమోదవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. కాగా, అమెరికాను అల్లాడిస్తున్న కరోనా ఇప్పటివరకు 67.88 లక్షల మందికి ప్రబలింది. అలాగే రెండు లక్షల వరకు మందిని పొట్టనబెట్టుకుంది.

Updated Date - 2020-09-16T17:49:01+05:30 IST