ఆ మాత్ర‌లు పంప‌క‌పోతే భార‌త్‌పై ప్ర‌తీకారమే: ట్రంప్‌

ABN , First Publish Date - 2020-04-07T16:35:55+05:30 IST

భార‌త్ నుంచి అమెరికా హైడ్రాక్సీక్లోరోక్వీన్ మెడిసిన్‌ను త‌మ‌కు పంపించాల్సిందిగా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త ప్ర‌ధాని మోదీతో ఆదివారం ఫోన్ ద్వారా మాట్లాడిన స‌మ‌యంలో కోరారు.

ఆ మాత్ర‌లు పంప‌క‌పోతే భార‌త్‌పై ప్ర‌తీకారమే: ట్రంప్‌

వాషింగ్ట‌న్‌: అగ్ర‌రాజ్యం అమెరికాలో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. ఇప్ప‌టికే 3.5 ల‌క్ష‌ల‌కు పైగా పాజిటివ్ కేసుల‌తో పాటు దాదాపు 11వేల మంది వ‌ర‌కు క‌రోనాతో మృత్యువాత ప‌డ్డారు. గ‌త రెండు వారాలుగా యూఎస్‌లో ప్ర‌తిరోజు వేల సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోదవుతున్నాయి. దీంతో అగ్ర‌రాజ్యం దిక్కుతోచ‌ని స్థితిలో ఉంది. ఈ మ‌హ‌మ్మారిని ఎలా క‌ట్ట‌డి చేయాలో వారికి పాలుపోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే అమెరికా క‌రోనా చికిత్స‌లో ఉపయోగ‌ప‌డే ఔష‌ధాల విష‌యంలో ఇత‌ర దేశాల సాయం కోరుతోంది.


దీనిలో భాగంగానే భార‌త్ నుంచి అమెరికా హైడ్రాక్సీక్లోరోక్వీన్ మెడిసిన్‌ను త‌మ‌కు పంపించాల్సిందిగా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త ప్ర‌ధాని మోదీతో ఆదివారం ఫోన్ ద్వారా మాట్లాడిన స‌మ‌యంలో కోరారు. అయితే, ఆ త‌రువాతి రోజు నుంచే భార‌త్ ఈ మెడిసిన్ స‌హా క‌రోనా చికిత్స‌లో స‌హాయ‌ప‌డే ఇత‌ర మందుల ఎగుమ‌తిపై నిషేధం విధించింది. 


కాగా, సోమ‌వారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడుతూ... క‌రోనా రోగుల‌కు చికిత్స కోసం ఉప‌యోగించే హైడ్రాక్సీక్లోరోక్వీన్ మెడిసిన్‌ను స‌ర‌ఫ‌రా చేయాల‌న్న అమెరికా అభ్య‌ర్థ‌న‌ను ఇండియా మ‌న్నించ‌క‌పోతే అది త‌న‌ను తీవ్ర ఆశ్చ‌ర్యానికి గురిచేస్తుంద‌న్నారు. తాజాగా ఈ మాత్ర‌ల ఎగుమ‌తిపై భార‌త్ విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తుంద‌ని తాను ఆశిస్తున్న‌ట్లు తెలిపారు. భార‌త్ ఈ మాత్ర‌ల‌ను పంప‌ని ప‌క్షంలో ప్రతీకారం తీర్చుకునే అవ‌కాశం లేక‌పోలేద‌ని హెచ్చ‌రించారు.


"ఆదివారం ప్ర‌ధాని మోదీతో మాట్లాడాను. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అగ్రరాజ్యానికి హైడ్రాక్సీక్లోరోక్వీన్ అవ‌స‌రాన్ని ఆయ‌న‌కు వివ‌రించాను. మోదీ కూడా ఈ విష‌య‌మై సానుకూలంగా స్పందించారు. అమెరికాతో ఇండియా ఎప్పుడూ స‌రియైన రీతిలోనే వ్య‌వ‌హారిస్తోంది. క‌నుక‌ భార‌త్ ఆ మందుల‌ను త‌ప్ప‌నిస‌రిగా అమెరికాకు పంపుతుంద‌ని అనుకుంటున్నాను. ఒక‌వేళ హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్ర‌ల‌ను పంప‌ని ప‌క్షంలో భార‌త్‌పై ప్ర‌తీకారం ఉండొచ్చ‌ని" తెలిపారు. ఇక ఔష‌ధ నియంత్ర‌ణ సంస్థ‌(ఎఫ్‌డీఏ) సూచ‌న మేర‌కు అమెరికా ఇప్ప‌టికే 29 మిలియ‌న్ డోసుల మేర‌ హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్ర‌లను నిల్వ చేసి పెట్టుకుంద‌ని ఈ సంద‌ర్భంగా ట్రంప్ తెలియ‌జేశారు. 

Updated Date - 2020-04-07T16:35:55+05:30 IST