ఎన్నికలకు ముందు ట్రంప్‌కు షాక్.. చైనాలో ఓ బ్యాంక్ అకౌంట్..!

ABN , First Publish Date - 2020-10-21T22:10:28+05:30 IST

అమెరికా ఎన్నికలు కీలక దశకు వచ్చేశాయి.. నవంబర్ 3న జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ హోరాహోరీగా తలపడుతున్నారు. ఇప్పటికిప్పటి పరిస్థితులను బట్టి ఎన్నికల పోరులో జో బైడెన్ కాస్త ముందంజలో ఉన్నారనీ.. ఆయనకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అమెరికన్ మీడియా కోడైకూస్తోంది.

ఎన్నికలకు ముందు ట్రంప్‌కు షాక్.. చైనాలో ఓ బ్యాంక్ అకౌంట్..!

వాషింగ్టన్: అమెరికా ఎన్నికలు కీలక దశకు వచ్చేశాయి.. నవంబర్ 3న జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్  హోరాహోరీగా తలపడుతున్నారు. ఇప్పటికిప్పటి పరిస్థితులను బట్టి ఎన్నికల పోరులో జో బైడెన్ కాస్త ముందంజలో ఉన్నారనీ.. ఆయనకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అమెరికన్ మీడియా కోడైకూస్తోంది. అయినా ట్రంప్ మాత్రం తనదే విజయమన్న ధీమాను కనపరుస్తున్నారు. కరోనా బారి నుంచి కోలుకున్నాక తన ప్రచార వ్యూహాన్ని ట్రంప్ పూర్తిగా మార్చేశారు.. గెలుపును నిర్దేశించే రాష్ట్రాలపై తాజాగా ట్రంప్ దృష్టి సారించారు. కొలరాడో, ఫ్లోరిడా, మిచిగాన్, మిన్నెసోటా, నెవడా, న్యూ హంప్‌షైర్, నార్త్ కరోలినా, ఓహియో, పెన్సిల్వేనియా, వర్జీనియా, విస్కిన్సిన్... వంటి రాష్ట్రాల్లో ట్రంప్ తన ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ‘పెన్సిల్వేనియాలో గెలిస్తే అమెరికా అధ్యక్ష పీఠం మళ్లీ మనదే..’ అని తాజాగా ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రాల్లో డెమోక్రటిక్ పార్టీ ముందంజలో ఉందని సర్వేలు తేల్చిచెబుతుండటంతో.. ట్రంప్ మరింత అలెర్టయ్యారు. 


కాగా.. ట్రంప్‌కు చైనాలో ఓ బ్యాంక్ అకౌంట్ ఉందని తాజాగా బయటపడటంతో రాజకీయంగా కలకలం రేపుతోంది.. చైనా ఉత్పత్తులపై ట్యాక్సులను విపరీతంగా పెంచడం, కొన్ని ఉత్పత్తులపై నిషేధం విధించడం, కరోనా మహమ్మారికి చైనాయే ప్రధాన కారణమని బహిరంగంగానే ఆరోపిస్తూ.. డ్రాగన్‌ దేశంపై ట్రంప్ యుద్ధం ప్రకటించినంత పనిచేశారు. ఇప్పుడు ఆ దేశంలో ఓ బ్యాంక్ అకౌంట్ ఉందన్న విషయం బయటపడటంతో ఆయన ఆత్మరక్షణలో పడ్డట్టయింది. జో బైడెన్ కుమారుడయిన హంటర్ బైడెన్‌కు చైనాతో వ్యాపార సంబంధాలు ఉండటాన్నిచూపుతూ.. ట్రంప్ తన ప్రచారంలో దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పుడు తనకు బ్యాంక్ అకౌంట్ ఉండటాన్ని ఏ విధంగా ట్రంప్ సమర్ధించుకుంటారని డెమోక్రాట్స్ ప్రశ్నిస్తున్నారు.. ఇదిలా ఉండగా... ఆ బ్యాంక్ అకౌంట్ ద్వారా ఏఏ లావాదేవీలు జరిగాయన్నది బయటకు రావడం లేదు.. రాజకీయాల్లోకి రాకముందు వ్యాపార సంబంధాల విషయమై చైనా, బ్రిటన్, ఐర్లాండ్‌లలో ట్రంప్‌కు బ్యాంక్ అకౌంట్లు ఉండేవి.. ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్‌మెంట్ ఎల్.ఎల్.సీయే ఆ చైనా బ్యాంకు ఖాతాను నిర్వహిస్తోంది.. 2013 నుంచి 2015వరకు దాదాపు లక్షా 88వేల 561 డాలర్లను చైనాకు పన్నుగా చెల్లించినట్లు ట్యాక్స్ రికార్డుల్లో కూడా ఉంది. అయితే ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎంత మేరకు డబ్బు లావాదేవీలు జరిగాయన్నది ట్యాక్స్ రికార్డుల్లో నమోదు కాకపోవడం గమనార్హం. 2015 తర్వాత  చైనాలోని ట్రంప్ వ్యాపార కార్యకలాపాలన్నింటినీ ఆపేశారనీ.. అందువల్లే 2015 తర్వాత ఎలాంటి లావాదేవీలు జరగలేదని ట్రంప్ ఆర్గనైజేషన్ లాయర్ గార్టెన్ చెప్పుకొస్తున్నారు. 

Updated Date - 2020-10-21T22:10:28+05:30 IST