ట్రంప్ ‘ట్రంప్ కార్డు’ ట్రంపే!

ABN , First Publish Date - 2020-06-26T08:41:05+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ తన తురుపుముక్క బయటకు తీశారు. హెచ్–1బి వీసాల జారీని నిలిపివేస్తూ మొన్న సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పుట్టుకతో అమెరికన్లయిన వారికి శుభవార్తగా ట్రంప్ ఈ నిర్ణయాన్ని...

ట్రంప్ ‘ట్రంప్ కార్డు’ ట్రంపే!

ట్రంప్ విధానాలను, వ్యవహార శైలినీ తిరస్కరిస్తున్నవారు తాజా రేటింగును బట్టి 55 శాతం పైన ఉంటే, ఆమోదిస్తున్నవారు 40 శాతం మాత్రమే. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా కల్పించినట్టు ట్రంప్ ఎంతగా బాకా ఊదుకుంటున్నప్పటికీ అక్కరకు రావడంలేదు. అందుకే ఆయన తాజాగా హెచ్-1బి వీసా నిలుపుదల అస్త్రం ప్రయోగించారు. కరోనా కష్టం గాని, ఆర్థిక వ్యవస్థ నష్టం గాని, జార్జ్ ఫ్లాయిడ్‌ మరణానంతరం పెల్లుబికిన జన ధర్మాగ్రహం గాని ట్రంప్ విజయావకాశాలను దెబ్బతీయజాలవని ఆయన అనుచరులు ఆశపడుతున్నారు కానీ, పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. అందుకే, ట్రంప్ ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తనను గెలుపు గుర్రంగా అభివర్ణించుకుంటున్నారు! 


అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ తన తురుపుముక్క బయటకు తీశారు. హెచ్–1బి వీసాల జారీని నిలిపివేస్తూ మొన్న సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పుట్టుకతో అమెరికన్లయిన వారికి శుభవార్తగా ట్రంప్ ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. కరోనా కష్టకాలంలో దాదాపు రెండు కోట్ల మంది అమెరికన్లు ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో, విదేశీ ఉద్యోగుల రాకను (ముఖ్యంగా ఇండియా, చైనా) తాత్కాలికంగా నిలిపివేయడం తన ‘నైతిక కర్తవ్యం’గా ట్రంప్ అభివర్ణించుకున్నారు. ఈ ఉత్తర్వు ఈ సంవత్సరాంతం వరకు, అంటే నవంబర్ మూడవ తేదీన జరిగే అధ్యక్ష ఎన్నికల తర్వాత కూడా నెలన్నరపాటు అమలులో ఉంటుంది. రకరకాల వ్యూహాలు పన్నడంలో దిట్ట అయిన ట్రంప్ ఎన్నికల నేపథ్యంలోనే ఈ నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. భారతీయుల సామర్థ్యాన్ని ఎక్కువగా వినియోగించుకునే అన్ని టెక్నాలజీ కంపెనీలూ ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. టెక్సస్‌లో హౌడీ మోడీ అంటూ బ్రహ్మాండమైన ఈవెంట్ జరిపినా, మరో ఐదు నెలలకే ఇండియాలో నమస్తే ట్రంప్ అంటూ బ్రహ్మరథం పట్టినా ట్రంప్ తాను అనుకున్నదే చేస్తారు తప్ప ‘మా భారతీయులను కాస్త జాగ్రత్తగా చూసుకోండ’న్న విజ్ఞప్తులేవీ ఆయనకు పట్టవు. రాబోయే ఎన్నికలలో మళ్లీ గెలుస్తానా లేదా అని ట్రంప్ దొరగారికి శంక పట్టుకున్నట్టుంది. అభద్రతా భావంతో బాధపడుతున్నట్టు కనిపిస్తూనే ఉంది. 


సామాజిక కల్లోలం సృష్టిస్తున్న ఈ కరోనా కాలంలో, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోతున్న ఈ విచ్ఛిన్న కాలంలో, జార్జ్ ఫ్లాయిడ్‌ దుర్ఘటనతో శ్వేత జాత్యహంకారాన్ని మరోసారి నగ్నంగా రుజువు చేసుకున్న ఈ అసమాన అవమానకాలంలో డోనాల్డ్ ట్రంప్ నిజంగానే మళ్లీ గెలుస్తాడా? ‘అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మలచండి’ అని క్రిందటి ఎన్నికల్లో ఇచ్చిన నినాదం ఈసారికి ‘అమెరికాను గొప్ప దేశంగా మిగల్చండి’ అని రూపాంతరం చెందిన ఈ డోలాయమాన సందర్భంలో ట్రంప్ మళ్లీ శ్వేతసౌధం నుంచి శాసించగలడా? – ఇది అమెరికన్‌ వోటరునే కాదు, ప్రపంచం మొత్తాన్ని వేధిస్తున్న ప్రశ్న. ఎందుకంటే, ట్రంపే మళ్లీ రావాలని అమెరికాలో ఎంతమంది కోరుకుంటున్నారో, అంతకు ఎన్నో రెట్లు ఎక్కువ మంది ఆయన మళ్లీ రాకూడదని అమెరికా వెలుపల కోరుకుంటున్నారు. అందుకు ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. ఎన్నికలో డోనాల్డ్ ట్రంప్ విజయ దుందుభి మోగించినా, పరాజయం పాలైనా అమెరికా వెలుపల ఉన్న కోట్లమందికి లబ్ధి కలిగేదీ లేదు, ఉన్నది పోయేదీ లేదు! అమెరికా రాజకీయ---–ఆర్థిక శిబిరాలలో ఒక మాట ప్రాచుర్యంలో ఉంది. జనరల్ మోటార్స్‌కు ఏది లాభదాయకమో అమెరికా అధ్యక్షుని తొలి ప్రాధాన్యం దానికే అని. అధికార పగ్గాలు చేపట్టినవారెవరైనా సరే ఈ సూత్రాన్ని విధిగా పాటించాలి. అదొక అలిఖిత ఆదేశం. దాన్ని అలా ఉంచితే అమెరికా ఎన్నికల పట్ల సర్వత్రా ఈసారి మరింత ఎక్కువగా ఆసక్తి నెలకొనడానికి కారణం వర్తమాన పరిస్థితులు.


నిన్న మొన్నటివరకూ కచ్చితంగా గెలుస్తానని ఢంకా బజాయించిన ట్రంప్ ఇప్పుడు అంత గట్టిగా, ఆత్మవిశ్వాసంతో కనపడటం లేదు. దేశాధ్యక్షునిగా ఆయన రేటింగు దారుణంగా పడిపోయింది. గతంలో ఏ అధ్యక్షుడూ మళ్లీ పోటీకి దిగిన సందర్భంలో చివరి రోజులలో ఇంత తక్కువ రేటింగు చవిచూడలేదు. ఎన్నికల దృష్టితో చూస్తే కరోనా సృష్టించిన విలయ తాండవానికి ముందూ, ఆ తర్వాతా పరిస్థితులు చాలా మారిపోయాయి. రిపబ్లికన్ పార్టీలోని ట్రంప్ గట్టి మద్దతుదారులు సైతం కరోనా విషయంలో దేశాధ్యక్షుడు అభిలషణీయమైన విధానాన్ని అవలంభించలేదని వాపోతున్నారు. అమెరికాలో కరోనా మృతుల సంఖ్య సుమారు లక్షా పాతికవేలకు చేరుకుంది. ఇక ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పనే అక్కరలేదు. అన్ని దేశాలూ కరోనా బారిన పడి రెక్కలు విరిగి మూలుగుతుంటే, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఊబిలో దిగబడిపోయింది. దేశం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతున్నట్టు ఫిబ్రవరిలోనే ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తే, మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు కరోనా లాక్‌డౌన్‌ పరిస్థితిని మరీ ఘోరంగా మార్చేసింది. దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మళ్లీ గెలుపు గుర్రంపై స్వారీ చేయాలని ఆకాంక్షించిన అమెరికా అధ్యక్షులు ఎవ్వరూ మళ్లీ గెలవలేదు. ఇది చరిత్ర!


ట్రంప్ విధానాలను, వ్యవహార శైలినీ తిరస్కరిస్తున్నవారు తాజా రేటింగును బట్టి 55శాతం పైన ఉంటే, ఆమోదిస్తున్నవారు 40శాతం మాత్రమే. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా కల్పించినట్టు ట్రంప్ ఎంతగా బాకా ఊదుకుంటున్నప్పటికీ ఇదేమీ అక్కరకు రావడంలేదు. అందుకే ఆయన తాజాగా హెచ్-1బి వీసా నిలుపుదల అస్త్రం ప్రయోగించారు. అమెరికన్ల శ్రేయస్సుకే తాను కట్టుబడి ఉన్నానని చెప్పుకోవడానికి ఈ అస్త్రం పనిచేస్తుంది కాని ప్రస్తుత పరిస్థితులలో ఆఫ్రో–-అమెరికన్లు ఆయనను విశ్వసించడం లేదు, శ్వేత జాతీయులూ ఈయన ఇంకేదో ఉద్ధరిస్తాడని నమ్మడం లేదు. 


కరోనా కష్టం గాని, ఆర్థిక వ్యవస్థ నష్టం గాని, జార్జ్ ఫ్లాయిడ్‌ మరణానంతరం పెల్లుబికిన జన ధర్మాగ్రహంగాని ట్రంప్ విజయావకాశాలను దెబ్బతీయజాలవని ఆయన అనుచరులు, అభిమానులూ ఆశపడుతున్నారు కానీ, పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. అందుకే, ట్రంప్ ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎలాగైనా గెలుస్తాను, నాకు నేనే ట్రంప్ కార్డునని ధీమాగా చెప్పుకునే ట్రంప్, గతంలో తీసిపారేసిన తన ఎన్నికల ప్రచార నిపుణులను మళ్లీ తన శిబిరంలోకి తెచ్చుకుంటున్నారు. క్రిందటి ఎన్నికల నాటి ఎన్నికల వ్యూహాలు ఇప్పుడు పనికిరావని వారిలో కొందరు నిక్కచ్చిగానే చెబుతున్నారు. అప్పట్లో నిరుద్యోగ సమస్య పెరిగిపోతుండడం, నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా దేశాన్ని అనుకున్నంత గొప్పగా తీర్చిదిద్దలేకపోయాడన్న అసంతృప్తి, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను మచ్చలేని నాయకురాలుగా డెమొక్రటిక్ పార్టీ శ్రేణులే విశ్వసించలేకపోవడంవంటి పలు కారణాలు ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడానికి ప్రత్యక్షంగా దోహదం చేశాయి. అది 2016! ఇది 2020!! ఈ మధ్య కాలంలో చాలా మార్పులే చోటుచేసుకున్నాయి. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మలచండి అని ట్రంప్ ఇచ్చిన నినాదం ఆచరణలో శుష్క నినాదంగా మారిపోయింది. రిపబ్లికన్ పార్టీ శ్రేణులు సైతం ఆయన మాటలను విశ్వసించే పరిస్థితి ఇప్పుడు లేదు. నిజానికి ఎన్నో సానుకూలతల మధ్య కూడా 2016లో ట్రంప్ సాధించిన విజయం మరీ ఘన విజయం ఏమీ కాదు!


2016 ఎన్నికలలో అసలైతే డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థే గెలవవలసింది. అప్పట్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్యాన్ని కాంక్షించిన బెర్నీ శాండర్స్‌కు యువతలో మంచి బలం ఉంది. కార్మిక వర్గంలో కూడా పలుకుబడి ఉంది. అయితే ఆయన సోషలిస్టు ఆదర్శాలను జీర్ణించుకోలేని డెమొక్రటిక్ పార్టీ ఉన్నత శ్రేణి నాయకులు రంగంలోకి దిగి, శాండర్స్‌ను తప్పించడానికి యుక్తులు పన్నారు. ఒబామా చేతే చెప్పించి శాండర్స్‌ను పక్కనపెట్టి, అప్పటికే ఎన్నో వివాదాలలో ఇరుక్కున్న హిల్లరీ క్లింటన్‌ను ముందుకు తోశారు. కాని హిల్లరీ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎంతోమంది డెమొక్రటిక్ పార్టీ శ్రేణులు పోలింగు బూత్‌ల వరకూ వచ్చి ఓట్లు వేయకుండా వెనుదిరిగారు. హిల్లరీ బదులు శాండర్స్‌ను ముందుకు తెచ్చి ఉంటే బహుశా ట్రంప్ ఆనాడే రాజకీయ అస్త్ర సన్యాసం చేసి ఉండేవారు! ఇప్పుడు చివరివరకూ నామినేషన్ కోసం పోరాడిన బెర్నీ శాండర్స్ ఈమధ్యే పక్కకు తప్పుకోవడంతో పెద్దగా కష్టపడకుండానే జో బైడెన్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ సాధించారు. ట్రంప్‌తో పోల్చితే ప్రచార వ్యూహాలలోనూ, డబ్బు ఖర్చులోనూ జో బైడెన్ చాలా వెనుకబడి ఉన్నారు. అందుకే ట్రంప్ తనకు తానే ట్రంప్ కార్డునని భావిస్తున్నారు. ఫ్లాయిడ్‌ దారుణ హత్య నేపథ్యంలో అమెరికా నలుమూలలా వినిపించిన ధిక్కార ధ్వనులు, కనిపించిన హింసాత్మక ఘటనలూ నవంబర్ నాటికి ప్రాసంగికతను కోల్పోతాయని ట్రంప్ నమ్మకం. కరోనా విషయంలో చైనాను, ప్రపంచ ఆరోగ్య సంస్థను తప్పుబడుతూ అమెరికాలో వైఫల్యానికి బాధ్యత తనది కాదని తేల్చేశారు. ప్రత్యర్థి జో బైడెన్ పెద్దగా నోరున్నవాడు కాదు కాబట్టి, సామాజిక మాధ్యమాలలో జో అనుకూల ప్రచారం అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి, ప్రధాన మీడియా తన చేతిలోనే ఉంది కాబట్టి, ప్రచార వ్యూహాలకు లోటు లేదు కాబట్టే తనకు తానే గెలుపు గుర్రంగా ట్రంప్ అభివర్ణించుకుంటున్నారు! ఒకవేళ ఓడిపోతే...? ఆ రోజున అంటే నవంబర్ 3వ తేదీనాటికి ఆ పరిస్థితే ఉంటే తన వ్యూహం తనకు ఉందని ఆయన మొన్నే ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దీని భావం ఏమి తిరుమలేశా?!

జగన్

Updated Date - 2020-06-26T08:41:05+05:30 IST