Trunklineతో కొత్త కష్టాలు

ABN , First Publish Date - 2021-10-13T17:38:51+05:30 IST

కోట్ల రూపాయలతో చేపట్టిన ట్రంక్‌లైన్‌ పనులు కొత్త కష్టాలు తెచ్చి పెట్టింది. వర్షాలు పడితే వరద ముంపు ఉండదని భావించిన స్థానికులకు మరిన్నీ కష్టాలు పెరిగాయి. ట్రంక్‌లైన్‌

Trunklineతో కొత్త కష్టాలు

ఆర్‌సీఐ రోడ్డులో ప్రయాణం ఆగమాగం

రోడ్డుపైకి వస్తున్న ట్రంక్‌లైన్‌లోని నీరు

కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌


హైదరాబాద్/సరూర్‌నగర్‌: కోట్ల రూపాయలతో  చేపట్టిన ట్రంక్‌లైన్‌ పనులు కొత్త కష్టాలు తెచ్చి పెట్టింది. వర్షాలు పడితే వరద ముంపు ఉండదని భావించిన స్థానికులకు మరిన్నీ కష్టాలు పెరిగాయి. ట్రంక్‌లైన్‌ ఏర్పాటుకు ముందు, ఆ తర్వాత అదే పరిస్థితి నెలకొంది. దాంతో ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నీరుగారి పోయిందన్న విమవర్శలు వస్తోన్నాయి. ఎప్పటికప్పుడు చెరువులను ఖాళీ చేయడానికి తప్ప ముంపు నివారణకు ఉపయోగపడడంలేదని కాలనీల ప్రజలు ఆరోపిస్తున్నారు.


ఎస్‌వైఆర్‌ గార్డెన్స్‌ వద్ద పరిస్థితి దారుణం

మంద మల్లమ్మ చౌరస్తా నుంచి బాలాపూర్‌ చౌరస్తా వరకు గల ఆర్‌సీఐ రహదారి ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. గతంలో ఎంత భారీ వర్షం పడినా ఈ రోడ్డుపైకి వరద వచ్చేది కాదు. ప్రస్తుతం ఓ మోస్తరు వర్షం పడితే చాలు రహదారి మొత్తం చెరువును తలిపిస్తోంది. జిల్లెలగూడ చందచెరువు సమీపంలోని ఎస్‌వైఆర్‌ గార్డెన్స్‌ వద్ద పరిస్థితి దారుణంగా ఉంది. ట్రంక్‌లైన్‌లో భాగంగా నిర్మించిన మ్యాన్‌హోళ్లు నాణ్యతారహితంగా ఉండడంతో లీకేజీలు ఏర్పడి వరద రోడ్డుపైకి ప్రవహిస్తోంది. మిథిలానగర్‌ వద్ద మరో నాలుగైదు మ్యాన్‌హోళ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. గతేడాది అక్టోబరులో కురిసిన వర్షాలకు వారం రోజుల పాటు ఈ రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం కురుస్తున్న వానలకు భారీ వాహనాలు మాత్రమే గంటల కొద్దీ ట్రాఫిక్‌లో చిక్కుకుని మెల్లగా ముందుకు కదులుతున్నాయి. ఇక ద్విచక్ర వాహనదారులు  పరిస్థితి అధ్వానంగా ఉంది. ట్రంక్‌లైన్‌ డిజైన్‌లోని లోపాలు, నిర్మాణంలోని డొల్లతనం, సకాలంలో పూర్తి కాని నిర్మాణం.. తదితర కారణాలతో ఈ రోడ్డులో వరద ముంపు మరింత పెరిగిందే తప్ప తగ్గలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ట్రంక్‌లైన్‌ను గత జూన్‌లోగానే పూర్తి చేయాలని మంత్రి సబితారెడ్డి ఆదేశించినప్పటికీ సంబంధిత అధికారగణం మీనమేషాలు లెక్కించిందనే ఆరోపణలున్నాయి. మంత్రి పలుమార్లు సమీక్షలు నిర్వహించి, జూన్‌ మాసాంతానికి పూర్తి చేయాలని స్పష్టం చేసినా.. నేటికీ పూర్తి కాలేదంటే అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రంక్‌లైన్‌ పనులు తొందరగా పూర్తి చేసి, ఆర్‌సీఐ రోడ్డుపైకి వరద రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

Updated Date - 2021-10-13T17:38:51+05:30 IST