నమ్మించి మోసం

ABN , First Publish Date - 2020-06-06T09:13:29+05:30 IST

పాదయాత్రలో అసైన్డ్‌ రైతులకు ప్యాకేజీలు ఇస్తామని నమ్మించి అధికారంలోకి వచ్చాక జగన్‌మోహన్‌రెడ్డి తమను మోసం చేశారని అమరావతి పరిరక్షణ జేఏసీ నేతలు ఆరోపించారు.

నమ్మించి మోసం

జీవో 41ని యథావిధిగా కొనసాగించాలి

171వ రోజు ఆందోళనల్లో అమరావతి జేఏసీ నేతలు 


గుంటూరు(ఆంధ్రజ్యోతి), తాడికొండ, తుళ్లూరు, జూన్‌ 5: పాదయాత్రలో  అసైన్డ్‌ రైతులకు ప్యాకేజీలు ఇస్తామని నమ్మించి అధికారంలోకి వచ్చాక జగన్‌మోహన్‌రెడ్డి తమను మోసం చేశారని అమరావతి పరిరక్షణ జేఏసీ నేతలు ఆరోపించారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు శుక్రవారానికి 171వ రోజుకు చేరాయి.  అమరావతితోనే రాష్ట్రానికి వెలుగంటూ ఇళ్లలో విద్యుత్‌ దీపాలు ఆపి కొవ్వొత్తులు, దీపాలు వెలగించి జై అమరావతి, సేవ్‌ అమరావతి అంటూ నినాదాలు చేశారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో చేస్తున్న నిరసనలు శుక్రవారం నాటికి 45వ రోజుకు చేరుకున్నాయి. 


న్యాయం జరుగుతుందని కన్నా హామీ

అమరావతికి న్యాయం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హామీ ఇచ్చినట్లు రాజధాని ప్రాంత రైతులు తెలిపారు. మూడు రాజధానుల ప్రతిపాదన మానుకొని, రైతులకు న్యాయం చేయాలని సీఎం జగన్‌కు లేఖ రాసిన కన్నాను గుంటూరులో శుక్రవారం రైతులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని రైతుల సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేస్తామని కన్నా హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు.  


సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట నిరసన

వార్షిక కౌలు వెంటనే జమ చేయాలని తుళ్లూరులోని సీఆర్‌డీఏ కార్యాలయం వద్ద దళిత జేఏసీ నేతలు శుక్రవారం నిరసన తెలిపారు. రాజధాని పరిధిలో అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కల్పించే విధంగా గత ప్రభుత్వం విడుదల చేసిన జీవో 41ని యథావిధిగా కొనసాగించాలని కోరుతూ వినతపత్రం అందజేశారు. 

Updated Date - 2020-06-06T09:13:29+05:30 IST