100 crore vaccination: 100 చారిత్రక కట్టడాలపై త్రివర్ణ వెలుగులు

ABN , First Publish Date - 2021-10-22T00:32:23+05:30 IST

దేశంలో వ్యాక్సినేషన్ 100 కోట్లకు చేరుకున్నట్లు గురువారం ప్రభుత్వం ప్రకటించింది. 2021 జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటి నుంచి గురువారం ఉదయం 10 గంటల వరకు 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది..

100 crore vaccination: 100 చారిత్రక కట్టడాలపై త్రివర్ణ వెలుగులు

న్యూఢిల్లీ: దేశంలో 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని దేశంలోని వంద చారిత్రక కట్టడాలపై జాతీయ జెండా మెరుపుల్ని వెలిగించనున్నట్లు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు గురువారం పేర్కొన్నారు. యూనెస్కో గుర్తింపు పొందిన ఎర్రకోట, కుతుబ్ మినార్, హుమాయున్ టూంబ్, తుగ్లకాబాద్ కోట, పురానా ఖిలా, ఫతేపూర్ సిక్రీ ఆగ్రా, రామప్ప గుడి, హంపి, ధోలవీర, చారిత్రక లే ప్రాంతాలతో పాటు దేశంలోని మరిన్ని చారిత్రక కట్టడాలపై త్రివర్ణ వెలుగులు విరజిమ్మనున్నాయి. కొవిడ్‌తో పోరాడుతున్న ఆరోగ్య శాఖలో పని చేస్తున్న కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు, సైంటిస్ట్‌లు, ఇతర సిబ్బందికి త్రివర్ణ వెలుగులతో కృతజ్ణతలు తెలియజేయనున్నట్లు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు.


దేశంలో వ్యాక్సినేషన్ 100 కోట్లకు చేరుకున్నట్లు గురువారం ప్రభుత్వం ప్రకటించింది. 2021 జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటి నుంచి గురువారం ఉదయం 10 గంటల వరకు 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇది అమెరికాలో ఇచ్చిన వ్యాక్సిన్ డోసుల కన్నా రెట్టింపు, జపాన్‌లో కన్నా ఐదు రెట్లు, జర్మనీలో కన్నా తొమ్మిది రెట్లు, ఫ్రాన్స్‌లో కన్నా 10 రెట్లు అధికం. దేశ జనాభాలో వ్యాక్సిన్‌ తీసుకునేందుకు అర్హులైనవారిలో 75 శాతం మంది కోవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జమ్మూ-కశ్మీరు, లడఖ్, ఉత్తరాఖండ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, గోవా, లక్షద్వీప్ నూటికి నూరు శాతం తొలి డోస్ వ్యాక్సినేషన్ జరిగినట్లు తెలిపింది. నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అర్హులైనవారిలో 90 శాతం మందికి  తొలి డోసు వ్యాక్సినేషన్ జరిగినట్లు పేర్కొంది.

Updated Date - 2021-10-22T00:32:23+05:30 IST