జూన్‌ 2 నుంచి పట్టణాల్లో టీఎస్‌ బీ-పాస్‌ విధానం

ABN , First Publish Date - 2020-05-22T09:31:49+05:30 IST

నూతన మున్సిపల్‌ చట్టం ప్రకారం టీఎస్‌ బీ-పాస్‌ విధానాన్ని జూన్‌ 2నుంచి అమలు చేయబోతున్నారు. ఈ విధానాన్ని ఏప్రిల్‌ 22న అమలు

జూన్‌ 2 నుంచి పట్టణాల్లో టీఎస్‌ బీ-పాస్‌ విధానం

ఆన్‌లైన్‌లోనే భవన నిర్మాణం, లేఅవుట్ల అనుమతులు


తాండూరు : నూతన మున్సిపల్‌ చట్టం ప్రకారం టీఎస్‌ బీ-పాస్‌ విధానాన్ని జూన్‌ 2నుంచి అమలు చేయబోతున్నారు. ఈ విధానాన్ని ఏప్రిల్‌ 22న అమలు చేయాలనుకున్నా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా వేశారు. భవన నిర్మాణ, లేఅవుట్‌ అనుమతులు ఆన్‌లైన్‌లో సులభంగా స్వీయ ధ్రువీకరణ ఆధారంగా తక్షణమే ఇవ్వనున్నారు. 75 చదరపు గజాల విస్తీర్ణం గల ప్లాట్లలో గ్రౌండ్‌ ప్లస్‌ వన్‌ వరకు నివాస భవనాల నిర్మాణానికి ఎలాంటి అనుమతి అవసరం లేదు. వీటి అనుమతికి నామమాత్రంగా రూ.1 చెల్లించి తక్షణమే భవన నిర్మాణ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ పొందే అవకాశం కల్పించారు. 75 నుంచి 239 చదరపు గజాల వరకు విస్తీర్ణం గల ప్లాట్లలో గ్రౌండ్‌ ప్లస్‌ వన్‌ 7 మీటర్ల వరకు ఎత్తు ఉండే నివాస భవనాలకు తక్షణమే అనుమతి ఇవ్వనున్నారు. 239 నుంచి 598 చదరపు గజాల విస్తీర్ణం గల ప్లాట్లలో గ్రౌండ్‌ ప్లస్‌-2 అంతస్థుల వరకు గృహనిర్మాణానికి స్వీయ ధ్రువీకరణ ద్వారా తక్షణమే అనుమతి ఇవ్వనున్నారు. ఇట్టి వాటికి భవన నిర్మాణం పూర్తయిన తర్వాత స్వాధీన ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంటుంది.


598 చదరపు గజాల కన్నా ఎక్కువగా, గ్రౌండ్‌ ప్లస్‌-2 అంతస్థుల కన్నా ఎక్కువగా ఉండే ప్లాట్లలో, అన్ని నివాసేతర భవనాలకు సింగిల్‌ విండో విధానం ద్వారా టీఎస్‌ బీ-పాస్‌ యందు అనుమతులు ఇవ్వబడును. టీఎస్‌ బీపాస్‌ కింద పౌరులు ఒకే ఉమ్మడి కామన్‌ దరఖాస్తును చేసుకోవచ్చు. ఎన్‌వోసీ కొరకు ఇతర శాఖలను అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ దరఖాస్తును పరిశీలించి 21 రోజుల్లో భవన నిర్మాణ అనుమతులు జారీ చేస్తారు. 21 రోజుల్లో రానిపక్షంలో 22వ రోజు ఆన్‌లైన్‌లో అనుమతి పత్రం ఆటోమెటిక్‌గా దరఖాస్తు దారునికి ఇవ్వబడుతుంది. స్వీయ ధ్రువీకరణలోభాగంగా జారీ చేసిన అన్ని అనుమతులకు తదుపరి తనిఖీ ఉంటుంది. వాస్తవాలను తప్పుగా పేర్కొని నిర్మాణాలు చేపట్టినట్లయితే ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే జరిమానా విధింపు, కూల్చివేత, స్వాధీనం చేసుకునే అధికారి మున్సిపాలిటీకి  ఉంటుంది.


లేఅవుట్‌ అనుమతులు

తాత్కాలిక లేఅవుట్‌ ప్లాన్‌ అనుమతి, స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ఆన్‌లైన్‌ పద్ధతిలో 21 రోజులు ఇవ్వనున్నారు. లేఅవుట్‌ పూర్తి చేసిన అనంతరం అభివృద్ధి దారుడి సంతకం, లైసెన్స్‌ సాంకేతిక సిబ్బందితో అటెస్టెడ్‌ చేయబడిన స్వీయ ధ్రువీకరణ పత్రం ఆధారంగా సదరు జిల్లా కమిటీల ద్వారా పరిశీలించిన తర్వాత ఇట్టి ఫైనల్‌ లేఅవుట్‌ అభివృద్ధిదారునికి ఆన్‌లైన్‌లో అనుమతి జారీ చేయబడుతుంది. ఆమోదించబడిన ఫైనల్‌ లేఅవుట్‌ జారీ చేసిన అనంతరం 21 రోజుల కాల వ్యవధిలో పురపాలక కమిషనర్‌ వద్ద తనఖా చేయబడిన ప్లాట్లను విడుదల చేస్తారు. అనధికారికంగా కట్టడాలను, లేఅవుట్లను గుర్తించి నియంత్రించేందుకు కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లాస్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ప్రభుత్వంచే నియమించబడును.


నిర్మాణ అనుమతులు పొందే సమయంలో దరఖాస్తుదారుడు సమర్పించిన ఒప్పంద పత్రం ప్రకారం అనుమతించబడిన ప్లాన్‌ను అతిక్రమించి నిర్మించబడిన కట్టడాలను ఎలాంటి నోటీసు జారీ చేయకుండా కూల్చి వేయబడును. భూమికి అవసరమైన అనుమతులు తీసుకోకుండా అనధికారికంగా అభివృద్ధి చేసినా, ఎవరైనా అభివృద్ధిదారుడు(డెవలపర్‌) ఆ భూమిని ఉపయోగిస్తున్న సమయంలో రిజిస్ట్రేషన్‌ శాఖ వారిచే నిర్ధారించబడిన భూమి విలువలో 25శాతం మేరకు అపరాధ రుసుము విధిస్తారు. 


Updated Date - 2020-05-22T09:31:49+05:30 IST