టీఎస్ బీపాస్ లక్ష్యం తుస్..

ABN , First Publish Date - 2021-06-13T17:52:30+05:30 IST

నిర్మాణ అనుమతుల్లో ఆలస్యం, అవినీతికి ఆస్కారం లేకుండా తీసుకొచ్చిన తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌

టీఎస్ బీపాస్ లక్ష్యం తుస్..

  • నిర్మాణ అనుమతుల జారీలో జాప్యం
  • క్షేత్రస్థాయి తనిఖీలలో కొనసాగుతున్న చేతివాటం
  • నిర్ణీత గడువులో అనుమతి ఇచ్చేందుకు కొర్రీలు
  • శివారులో పోస్టు వెరిఫికేషన్‌ టీమ్‌ల తీరే వేరు

నిర్మాణ అనుమతుల్లో ఆలస్యం, అవినీతికి ఆస్కారం లేకుండా తీసుకొచ్చిన తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్రూవల్‌ అండ్‌ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ సిస్టమ్‌ (టీఎస్‌ బీపాస్‌) కొంత మంది అధికారుల తీరుతో అబాసుపాలవుతోంది. టీఎస్‌ బీపాస్‌ ద్వారా అత్యంత వేగంగా, సులభంగా నిర్మాణ, లే అవుట్‌ అనుమతులు పొందవచ్చునని ప్రభుత్వం ప్రకటించింది. కానీ క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే నిర్ణీత గడువు లోపు అనుమతులు రావడం లేదు. ముడుపులు ఇచ్చి, పుచ్చుకోవడంలో కూడా ఎలాంటి తేడా లేదు.


హైదరాబాద్‌ సిటీ : ముడుపులిస్తే కానీ ఇంటి నిర్మాణ అనుమతులకు మున్సిపల్‌, కార్పొరేషన్‌ కార్యాలయాల్లో పని జరగదనే అభిప్రాయం ఉంది. ఆయా కార్యాలయాల్లోని దళారుల ద్వారా కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నత స్థాయి వరకు ముడుపులు చెల్లిస్తేనే చకచకా ఫైల్‌ కదులుతుంది. నిర్మాణ అనుమతులు వస్తుంటాయి. ఈ విధానం మార్చేందుకు, నిర్ణీత గడువులోపు నిర్మాణ అనుమతులు ఇచ్చేందుకు దేశంలోనే తొలిసారిగా డెవల్‌పమెంట్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (డీపీఎంఎస్‌) విధానాన్ని హెచ్‌ఎండీఏ తీసుకొచ్చింది. నిర్మాణ అనుమతికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి ఫైల్‌ ఏ అధికారి వద్ద ఎన్ని రోజులుగా పెండింగ్‌లో ఉందనే విషయాలు ఈ విధానంలో తెలుసుకోవచ్చు. హెచ్‌ఎండీఏతో పాటు జీహెచ్‌ఎంసీ, డీటీసీపీతో పాటు పలు కార్పొరేషన్లలో కూడా ఈ విధానం అమలు చేశారు. కానీ క్షేత్రస్థాయి తనిఖీ సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల్లో కొందరికి ఎంతో కొంత ముడితేనే డీపీఎంఎ్‌సలో కూడా ఫైల్‌ పట్టాలెక్కుతున్న పరిస్థితి ఉంది.


ఆ స్థానంలో టీఎస్‌ బీపాస్‌ 

కొత్త మున్సిపల్‌ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత డీపీఎంఎస్‌ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం టీఎ్‌సబీపా్‌సను అమల్లోకి తీసుకొచ్చింది. దీంట్లో స్వీయ ధృవీకరణ ద్వారా నిర్మాణ అనుమతులు పొందే అవకాశం కల్పించింది. గతేడాది నవంబర్‌ 16న టీఎస్‌ బీపాస్‌ ప్రారంభించగా దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే స్వీకరిస్తున్నారు. దీని ద్వారా ఇన్‌స్టంట్‌ అప్రూవల్‌ కోసం 15 వేలకు పైగా దరఖాస్తులు ఇప్పటి వరకు రాగా, ఇన్‌స్టంట్‌ రిజిస్ర్టేషన్‌ విధానంలో 3 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. 


సింగిల్‌ విండో విధానంలో మల్టీస్టోరీడ్‌ బిల్డింగ్‌, లేఅవుట్‌ అనుమతులకు సంబంధించిన దరఖాస్తులు వెయ్యికి పైగా వచ్చినట్లు తెలిసింది. అత్యధికంగా నగర శివారులోని మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా, రంగారెడ్డి జిల్లా నుంచే దరఖాస్తులొచ్చాయి. 75 గజాల్లోపు స్థలాలు, 500 చదరపు గజాల వైశాల్యం, పదిమీటర్ల లోపు ఎత్తులో నిర్మించే భవనాలకు ఇన్‌స్టంట్‌ అప్రూవల్‌ కోసం డాక్యుమెంట్లన్నీ అప్‌లోడ్‌ చేసి, స్వీయ ధృవీకరణ పొందిపరిచి ఫీజు చెల్లిస్తే వెంటనే అనుమతులిస్తున్నట్లు ప్రొసీడింగ్‌ వస్తుంది. 500 చదరపు గజాల లోపు ఉన్నా, పది మీటర్ల కంటే ఎత్తు ఉండే భవనాలకు ఇన్‌స్టంట్‌ రిజిస్ర్టేషన్‌ దరఖాస్తుల్లో వెంటనే ప్రొసీడింగ్‌ రాదు. క్షేత్రస్థాయిలో పోస్టు వెరిఫికేషన్‌ టీమ్‌లు తనిఖీ చేసి, ప్లానింగ్‌ అధికారులు అప్రూవల్‌ చేసి ముందుగా ఫీజు నిర్ణయిస్తారు. భవన నిర్మాణంలో కొంత స్థలాన్ని మార్ట్‌గేజ్‌ చేసిన తర్వాత ప్రొసీడింగ్‌ ఇస్తారు.


ముడుపులిస్తే క్లియర్‌..

డీపీఎంస్‌ విధానంలో ఏ తరహాలో నిర్మాణ అనుమతులకు ముడుపులు తీసుకున్నారో, టీఎస్‌ బీపా్‌సలో కూడా అదే అనుసరిస్తున్నారు. సాధారణంగా 21 రోజుల్లో సంబంధిత ఫైల్‌ను అధికారి క్లియర్‌ చేయకపోతే వెంటనే అప్రూవల్‌ వస్తుంది. కానీ సంబంధిత అధికారులు, సిబ్బంది వద్ద 21 రోజులకు మించి టీఎస్‌ బీపాస్‌ దరఖాస్తులుంటున్నాయి. దరఖాస్తుదారుడు సరైన పత్రాలను పొందుపర్చలేదని కొందరు అధికారు లు షార్ట్‌పాల్స్‌ పెడుతున్నారు. షార్ట్‌పాల్‌ ఉంటే సం బంధిత దరఖాస్తు 21 రోజులు మించినా అప్రూవల్‌ వ చ్చే పరిస్థితి ఉండదు. సంబంధిత అధికారికి, సిబ్బందికి తగిన ముడుపులు చెల్లిస్తే మాత్రం ఎలాంటి షార్ట్‌పాల్‌ లేకుండానే మరుసటి రోజే దరఖాస్తు క్లియర్‌ అవుతోంది.


పోస్టు ప్రాసెసింగ్‌ పేరుతో పెండింగ్‌

నగర శివారులోని ఫీర్జాదిగూడ, మీర్‌పేట, బోడుప్పల్‌, నిజాంపేట, బడంగ్‌పేట, జవహర్‌నగర్‌ కార్పొరేషన్లతో పాటు కొంపల్లి, దుండిగల్‌, నార్సింగ్‌ తదితర మున్సిపాలిటీల్లోని పోస్టు వెరిఫికేషన్‌ టీమ్‌లోని కొంత మంది అధికారులు ముడుపులిస్తేనే క్షేత్రస్థాయి తనిఖీలు చేస్తున్నారు. టెక్నికల్‌, టైటిల్‌ వెరిఫికేషన్‌లోనూ ముడుపులు ముడితేనే ఫైల్‌ కదులుతోంది. లేదంటే పోస్టు ప్రాసెసింగ్‌ పేరుతో పెండింగ్‌లో పెడుతున్నారు. నిబంధనలు, మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం భూ వినియోగ నిబంధనలు, ప్రభుత్వ భూ ములు, టైటిల్‌, లింకు డాక్యుమెంట్స్‌ వంటి వాటిలో ఏదైనా ఒక సమస్యను ఎత్తి చూపుతున్నారు. అందుకే టీఎస్‌ బీపా్‌సలో వచ్చిన దరఖాస్తుల్లో ప్రస్తుతం సుమారు 600ల వరకు పోస్టు ప్రాసెసింగ్‌ పేరుతో పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. 


గతంలో ప్లానింగ్‌కే.. నేడు అన్ని శాఖలకూ 

 నాలుగు అంతస్తుల భవన నిర్మాణానికి ఫీర్జాదిగూడ కార్పొరేషన్‌లో నివశించే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి టీఎస్‌ బీపాస్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తు అనుమతి పొందేందుకు వెరిఫికేషన్‌ టీమ్‌లో అధికారి, సిబ్బందికి, క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులకు ఇలా అందరికీ కలిపి రూ.2.50 లక్షల వరకు ముట్టచెప్పడం గమనార్హం. సాధారణంగా నిర్మాణ అనుమతుల కోసం గతంలో కేవలం కార్పొరేషన్‌, మున్సిపాలిటీలోని కొంతమంది అధికారులకే ముడుపులు ఇవ్వాల్సి వచ్చేది. ప్రస్తుతం పోస్టు వెరిఫికేషన్‌ టీమ్‌లో ఉండే రెవెన్యూ, ఇరిగేషన్‌, ఇతర శాఖల ఇంజనీరింగ్‌ అధికారుల్లో కొంతమందితో పాటు, స్ట్రక్చరల్‌ ఇంజనీర్‌, ఆర్కిటెక్చర్లకు లంచాలు ఇవ్వాల్సి వస్తోందని దరఖాస్తుదారులు వాపోతున్నారు.

Updated Date - 2021-06-13T17:52:30+05:30 IST