నేటి నుంచి జ్వర సర్వే

ABN , First Publish Date - 2022-01-21T08:25:01+05:30 IST

నేటి నుంచి జ్వర సర్వే

నేటి నుంచి జ్వర సర్వే

 ప్రజల చెంతకే కొవిడ్‌ వైద్యం

ఒమైక్రాన్‌ వ్యాప్తి ఎక్కువ.. తీవ్రత తక్కువ

అయినా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: హరీశ్‌రావు


హైదరాబాద్‌, జనవరి 20 (ఆంఽధ్రజ్యోతి) కొవిడ్‌ వ్యాప్తి తీవ్రత దృష్ట్యా శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా జ్వర సర్వే నిర్వహిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సర్వేలో ఆరోగ్య సిబ్బందికి తోడు మునిసిపల్‌, పంచాయతీరాజ్‌శాఖ సిబ్బంది కూడా పాల్గొంటారని చెప్పారు. ఇంటింటికి వెళ్లి పరీక్షలు చేస్తారన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని అన్ని బస్తీ దవాఖానాల్లో కొవిడ్‌ టెస్టులతో పాటు హోం ఐసోలేషన్‌ కిట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు. కరోనా కేసుల పెరుగుతోన్న నేపథ్యంలో గురువారం బీఆర్కేభవన్‌లో మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం మీడియాతో హరీశ్‌ రావు మాట్లాడారు. కరోనా నుంచి ప్రజలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని తెలిపారు. ఒమైక్రాన్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకే సర్వే చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సెకండ్‌ వేవ్‌లో ఈ విధానం పాటించడం వల్లనే కరోనా అదుపులోకి వచ్చిందన్నారు. లక్షణాలు ఉన్నవారికి హోం ఐసోలేషన్‌ కిట్లు ఇస్తామని చెప్పారు. వారి ఆరోగ్యాన్ని ప్రతిరోజూ క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షిస్తారని, ఎవరికైనా ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోతే, అవసరం మేరకు సమీప ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తారని పేర్కొన్నారు. కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, 2 కోట్ల పరీక్ష కిట్లు, కోటీ హోం ఐసోలేషన్‌ కిట్లను సమకూర్చుకున్నామని తెలిపారు. వాటిని జిల్లా, ఏరియా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయివరకు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. జ్వర సర్వే కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఒమైక్రాన్‌ వ్యాప్తి ఎక్కువ ఉన్నప్పటికీ, దాని తీవ్రత మాత్రం తక్కువగా ఉందని, అలాగని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. కొవిడ్‌ తీవ్రత తగ్గేంతవరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో అన్ని ఆదివారాలు మధ్యాహ్నం రెండుగంటల వరకు బస్తీదవాఖానాలు వైద్య సేవలు అందిస్తాయని మంత్రి తెలిపారు.  


అన్ని బెడ్లకు ఆక్సిజన్‌...

రెండో వేవ్‌లో ఏర్పడిన ఆక్సిజన్‌ కొరత ఈ సారి రాకూడదని ప్రభుత్వం ముందస్తుగా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు మంత్రి హరీశ్‌రావు చెప్పారు. అన్ని ఆస్పత్రుల్లో 27 వేల బెడ్లకు ఆక్సిజన్‌ సదుపాయం కల్పించామన్నారు. దీనితో పాటు 76 ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. కరోనా చికిత్స కోసం జిల్లా ఆస్పత్రుల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 340 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ సామర్థ్యం ఉందని చెప్పారు. మరింత ఆక్సిజ న్‌ సామర్థ్యం పెంచుకునేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని, బూస్టర్‌ డోసు ప్రజలకు అందించాలని కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. టీకా పంపిణీ వేగవంతం అయ్యేందుకు డోసు టు డోసు గ్యాప్‌ తగ్గ్గించాలని కేంద్రాన్ని కోరామని ఆయన చెప్పారు.  

Updated Date - 2022-01-21T08:25:01+05:30 IST