కరోనా, కేసీఆర్‌ వల్లే చనిపోతున్నా

ABN , First Publish Date - 2022-01-26T09:46:24+05:30 IST

నోటిఫికేషన్లు పడటం లేదని నిరుపేద కుటుంబానికి చెందిన నిరుద్యోగ యువకుడు ఆవేదన చెందాడు. ‘ఇగ నోటిఫికేషన్‌ రావు.

కరోనా, కేసీఆర్‌ వల్లే చనిపోతున్నా

  • వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టిన నిరుద్యోగ యువకుడు.. 
  • రైలుకింద పడి ఆత్మహత్య.. వేరైన తల, మొండెం


ఖమ్మం, బయ్యారం, జనవరి 25 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): నోటిఫికేషన్లు పడటం లేదని నిరుపేద కుటుంబానికి చెందిన నిరుద్యోగ యువకుడు ఆవేదన చెందాడు. ‘ఇగ నోటిఫికేషన్‌ రావు. పిచ్చి లేస్తోంది’అంటూ ఓ వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టాడు. అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ‘కరోనా ప్లస్‌ కేసీఆరే కారణం’ అని అంతకుముందు మరో స్టేటస్‌ పెట్టాడు. ఖమ్మం నగరంలో ఈ విషాదం జరిగింది.  రైలు పట్టాలపై తల,మొండెం వేరువడి మృతదేహం పడివుండటాన్ని చూసినవారంతా చలించిపోయారు. చెట్టంత ఎదిగిన కొడుకు బలవన్మరణానికి పాల్పడటం తో హమాలీ పనిచేసి కుటుంబాన్ని పోషిస్తున్న తండ్రి గుండెలవిసేలా రోదించాడు. మృతుడు.. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారానికి చెందిన ముత్యాల సాగర్‌ (23). తల్లిదండ్రులు ముత్యాల భద్రయ్య-కళమ్మ. సాగర్‌, ఖమ్మంలోనే డిగ్రీ పూర్తి చేశాడు. ఎన్‌సీసీలో సీ సర్టిఫికెట్‌ పొంది ఉండటంతో పోలీసు ఎస్సై కావాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఖమ్మంలో ఓ గది అద్దెకు తీసుకొని పార్ట్‌టైం ఉద్యోగాలు చేసుకుంటూనే  ప్రైవేటు స్టడీ సెంటర్‌లో ఎస్సై ఉద్యోగం కోసం కోచింగ్‌ తీసుకుంటున్నాడు. ఉద్యోగ నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేయకపోవడతో ఆవేదన చెందాడు. కరోనా పరిస్థితుల్లో తాను ఎస్సై ఉద్యోగం సాధించాలన్న కల తీరదేమోనని కలత చెందాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున తన వాట్సాప్‌ స్టేట్‌సలో రెండు మెసేజ్‌లు పెట్టాడు. అనంతరం ఖమ్మంలోని మామిళ్లగూడెం సమీపంలోని రైల్వే ట్రాక్‌ వద్ద రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. 


ఉదయం మృతదేహాన్ని సిబ్బంది చూసి రైల్వే సీఐ ఇంద్రసేనకు సమాచారమిచ్చారు మృతుడి వద్ద లభించిన పాన్‌కార్డు ద్వారా చిరునామా తెలుసుకొని, బయ్యారంలో ఉన్న తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్‌ ద్వారా ఖమ్మం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడికి సాగర్‌ తల్లిదండ్రు లు ముత్యాల భద్రయ్య, బంఽధుమిత్రులు చేరుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమెక్రసీ పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ఖమ్మం ఆస్పత్రిలోని పోస్టుమార్టం గది వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. ఈ ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌  బాధ్యత వహించాలని కుటుంబసభ్యులతో కలిసి  నినాదాలు చేశారు. అనంతరం మృతదేహంతో ఇల్లందు-మహబూబాబాద్‌ ప్రదాన రహదారిపై రెండు గంటలపాటు ఆందోళన చేశారు. మృతుడి కుటుంబానికి రూ.50లక్షల పరిహారం, కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ ఆదేశాల మేరకు డీఎస్పీ, తహసీల్దార్‌ తక్షణ సాయంగా రూ.2క్షలు అందజేస్తామని,  ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మృతుడి కుటుంబీకులకు హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. అనంతరం మృతదేహాన్ని బయ్యారానికి తరలించారు. సాగర్‌ ఆత్మహత్య ఘటన తననెంతో కలచివేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. సాగర్‌ సోదరుడు నవీన్‌కు ఫోన్‌ చేసి పరామర్శించారు. నిరుద్యోగులెవరూ ఆత్మహత్య చేసుకోవొద్దని పిలుపునిచ్చారు. వరంగల్‌లో టీచర్‌ రమేశ్‌ తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్లా ఆయన దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పలువురు టీచర్ల ఆత్మహత్యలకు టీఆర్‌ఎస్‌ సర్కారే బాధ్యత వహించాలని.. జీవో 317 సవరించే దాకా బీజేపీ పోరాటం చేస్తుందని  తెలిపారు. 


హమాలీ పనిచేసుకుంటూ చదివిస్తున్నా

హమాలీ పని చేస్తూ కుమారుడిని చదివిస్తున్నాను. మంచి ఉద్యోగం వస్తుందనే ఆశతో ఉన్నాడు. ఎస్సై అవుతానని చెప్పాడు. ఇందుకు కోచింగ్‌ తీసుకుంటున్నాడు. కానీ ఇలా ఆత్మహత్య చేసుకుంటానని అనుకోలేదు. ఉద్యోగ నోటిఫికేషన్‌ రాలేదనే మనోవేదనతోనే నా కొడుకు ప్రాణం తీసుకుండు.    - తండ్రి ముత్యాల భద్రయ్య 


దేశవ్యాప్తంగా 1.27 కోట్ల కేసులను పరిష్కరించినట్టు నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (నల్సా)  ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.  గణతంత్ర దినోత్సవ సందర్భంగా ‘న్యాయ్‌ సబ్‌కో లియో’ అన్న పేరుతో తాము చేపట్టిన కార్యక్రమాలను ప్రదర్శిస్తున్నట్లు వివరించారు. 

- హైదరాబాద్‌ 

Updated Date - 2022-01-26T09:46:24+05:30 IST