ఆటో బోల్తా.. నలుగురి మృతి

ABN , First Publish Date - 2022-01-20T07:50:58+05:30 IST

వాహనం నడిపేవారు ఒళ్లంతా కళ్లు చేసుకొని తోలినా కొన్నిసార్లు వెనుక, ముందు వచ్చే వాహనదారుల నిర్లక్ష్యానికి ప్రమాదాల బారిన పడాల్సి వస్తుంది...

ఆటో బోల్తా.. నలుగురి మృతి

ఖానాపూర్‌, జనవరి 19: వాహనం నడిపేవారు ఒళ్లంతా కళ్లు చేసుకొని తోలినా కొన్నిసార్లు వెనుక, ముందు వచ్చే వాహనదారుల నిర్లక్ష్యానికి ప్రమాదాల బారిన పడాల్సి వస్తుంది. అలాంటిది.. ఆటో రోడ్డుపైన దూసుకెళుతుండగానే ఆ వాహనం నడుపుతున్న డ్రైవర్‌ సీటులోంచి పక్కకు  జరిగి మరొకరికి హ్యాండిల్‌ అప్పగించే ప్రయత్నం చేస్తే? ఇలా ఇద్దరు యువకులు తీవ్ర నిర్లక్ష్యంతో కూడిన ప్రయత్నం ఆటోను బోల్తా కొట్టించి.. అందులోని నలుగురి నిండు ప్రాణాలు గాల్లో కలిపేసింది. నిర్మల్‌ జిల్లా కడెం మండలం పెద్దబెల్లాల్‌ శివారులో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. నిర్మల్‌ జిల్లా కడెం నుంచి జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం బోర్నపెల్లికి ఓ ఆటో వెళుతోంది. అందులో ఇద్దరు డ్రైవర్లతో కలిపి మొత్తంగా  ఎనిమిది మంది ఉన్నారు. ఆటోను కడెం మండలం బెల్లాల్‌కు చెందిన డ్రైవర్‌ జియానొద్దీన్‌ నడుపుతున్నాడు. పెద్దబెల్లాల్‌ శివారులోకి ఆటో రాగానే తన మిత్రుడు, డ్రైవర్‌ అయిన షాదాబ్‌కు జియానోద్దీన్‌ హ్యాం డిల్‌ను అప్పగించేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఆటో ఒక్కసారిగా అదుపు తప్పింది. అదే  వేగంలో అక్కడే ఓ కల్వర్టును ఢీకొట్టి సాగునీటి కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పెద్దబెల్లాల్‌కు చెందిన చీమల శాంత (40), చిన్నక్యాంపునకు చెందిన శంకరమ్మ (46), మల్లన్నపేట్‌కు చెందిన బోడమల్లయ్య(55), గోడిసిర్యాలకు చెందిన శ్రీరాము ల లక్ష్మి (65) మృతి చెందారు. మరో ఇద్దరు  గాయపడ్డారు. వారిని స్థానికులు నిర్మల్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆటో డ్రైవర్లు జియానోద్దీన్‌, షాదాబ్‌లు పరారయ్యారు.  

Updated Date - 2022-01-20T07:50:58+05:30 IST