Abn logo
Oct 14 2021 @ 02:43AM

ప్రయాణ పండుగ

  • ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులు, రైళ్లు ఫుల్‌ 
  • ఆరు రోజుల్లో జిల్లాలకు 2వేలకు పైగా ప్రత్యేక బస్సులు 
  • నేడు మరో 889 స్పెషల్‌ బస్సులు.. రద్దీ పెరిగితే మరో 200 
  • పండుగ దాకా దక్షిణ మధ్య 44 స్పెషల్‌ రైళ్లు
  • సూపర్‌ఫాస్ట్‌ రైళ్లలో రిజర్వేషన్‌ సీట్ల కరువు
  • తిరుపతి, విశాఖ, నిజామాబాద్‌ మార్గాల్లో ఫుల్‌ డిమాండ్‌

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 13 (ఆంధ్ర జ్యోతి): దసరా పండుగకు స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులతో బస్సులు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. బస్సులు, రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. బుధవారం ఒక్కరోజే రాత్రి 8 గంటల వరకు ఐదు వందలకు పైగా ప్రత్యేక బస్సులు జీహెచ్‌ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి జిల్లాలకు వెళ్లాయి. మరో 200 బస్సులు సిద్ధంగా ఉంచారు. గత ఆరు రోజులుగా హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు రోజూ నడిచే 4600 సర్వీసులతో పాటు 2వేలకు పైగా స్పెషల్‌ సర్వీసులను వివిధ జిల్లాలకు ఏపీలోని పలు ప్రాంతాలకు నడిపినట్లు రంగారెడ్డి రీజియన్‌ మేనేజర్‌ వరప్రసాద్‌ తెలిపారు. ఎంజీబీఎస్‌, జేబీఎ్‌సతో పాటు ఉప్పల్‌ క్రాస్‌రోడ్‌, సీబీఎస్‌, కూకట్‌పల్లి, ఆరంఘర్‌, లింగంపల్లి, మియాపూర్‌, జీడిమెట్లతో పాటు నగరంలోని రద్దీ  ప్రాంతాల నుంచి జిల్లాలకు ప్రత్యేకబస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. గురువారం ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మరో 889 స్పెషల్‌ బస్సులను ఆర్టీసీ సిద్ధంగా ఉంచిందని తెలిపారు. 


రద్దీ పెరిగితే ప్రయాణికుల సౌకర్యార్థం మరో 200 సిటీ బస్సులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.  స్పెషల్‌ సర్వీసుల్లో సాధారణ చార్జీలు వసూలు చేస్తుండటంతో ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్లేందుకు ప్రయాణికులు ముందుకొస్తున్నారని తెలిపారు. పండుగకు జిల్లాలకు వెళ్లిన ప్రయాణికులు తిరిగి నగరానికి వచ్చేలా బస్సులను ఆర్టీసీ నడుపుతుందన్నారు. ఇక పండుగ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు అరకొరగా ఉండటంతోపాటు సూపర్‌ఫాస్ట్‌ రైళ్లలో ముందస్తు బుకింగ్‌లు పూర్తి కావడంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం దసరా పండుగ నేపథ్యంలో గురువారం అందుబాటులో ఉన్న రైళ్ల ద్వారా తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్‌ చార్టును పరిశీలిస్తున్న వారికి భారీ వెయిటింగ్‌ లిస్టు కనిపిస్తోంది. తిరుపతి, విశాఖ, నిజామాబాద్‌ మార్గాల్లో భారీ వెయింటింగ్‌ లిస్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో కొంత మంది జనరల్‌ బోగీల్లో అవస్తలు పడుతూ ప్రయాణిస్తుండగా, మరికొందరు ఆర్టీసీ బస్సులు,  ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.  


పండుగ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం వరకు వివిధ మార్గాల్లో 44 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు ప్రకటించింది. కాగా, స్పెషల్‌ రైళ్లతోపాటు 274 సాధారణ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో నిరుడు సొంతూళ్లకు వెళ్లకుండా సద్దుల బతుకమ్మ, దసరా పండుగలను నగరంలోనే జరుపుకున్న పొరుగు ప్రాంతాల ప్రజలు ఈసారి  స్వగ్రామాలకు తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో మూడు రోజులుగా సికింద్రాబాద్‌, నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడు తున్నాయి. సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి రోజుకు 1.8 లక్షల మంది ప్రయాణిస్తుండగా, మిగతా మూడు స్టేషన్ల ద్వారా దాదాపు 70 వేలమంది తరలివెళ్తున్నారని రైల్వే వర్గాలు వెల్లడిస్తున్నాయి. 

క్రైమ్ మరిన్ని...