టీటీడీ జేఈవో బంగ్లాలో చోరీ చేసిన దొంగ అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-05-27T13:11:25+05:30 IST

టీటీడీ జేఈవో బసంతకుమార్‌ బంగ్లాలో చోరీకి పాల్పడిన నిందితుడిని రెండు రోజుల్లోనే క్రైం పోలీసులు పట్టుకున్నారు.

టీటీడీ జేఈవో బంగ్లాలో చోరీ చేసిన దొంగ అరెస్ట్‌

  • రూ.6.45 లక్షల సొత్తు..
  • మరో దొంగతనం కేసులో నగదు స్వాధీనం
  • రెండు రోజుల్లోనే దర్యాప్తు పూర్తిచేసిన క్రైమ్‌ పోలీసులు

తిరుపతి : టీటీడీ జేఈవో బసంతకుమార్‌ బంగ్లాలో చోరీకి పాల్పడిన నిందితుడిని రెండు రోజుల్లోనే క్రైం పోలీసులు పట్టుకున్నారు. అతడు కొట్టేసిన బంగారు నగలు, మరో చోరీకి సంబంధించి నగదునూ రికవరీ చేశారు. ఈ వివరాలను మంగళవారం తిరుపతిలోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌లో అర్బన్‌ ఎస్పీ రమేష్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం.. విశాఖపట్టణంలోని మద్దిలపాళేనికి చెందిన పొగతోట గంగాధరరావు అలియాస్‌ సిద్ధార్థ అలియాస్‌ కార్తీక్‌ (27) అనాథ. చిన్నప్పటినుంచి ఓ ఆశ్రమంలో పెరుగుతూ ఇంటర్‌ వరకు చదివాడు. చెడు అలవాట్లకులోనై దొంగతనాలు మొదలుపెట్టాడు. 2011 నుంచి విశాఖ, విజయనగరం, రాజమండ్రి, తుని, విజయవాడల్లో 30కి పైగా దొంగతనాలు చేశాడు. సుమారు ఐదేళ్లపాటు జైలుశిక్ష అనుభవించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీకాళహస్తిలోని రివర్‌ వ్యూ లాడ్జిలో సెల్‌ఫోన్లు, నగదు అపహరించిన కేసులో.. రెండు నెలల శిక్ష అనుభవించి గతనెల 25న విడుదలయ్యాడు.


ఈ నెల 16వ తేది రాత్రి తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి భవనంలోని ఓ గది బాత్‌రూమ్‌ వెంటిలేటర్‌ ద్వారా లోపలు ప్రవేశించి రూ. 20 వేలను తస్కరించాడు. 23వ తేదీ అర్ధరాత్రి పద్మావతి అతిథి భవనం పక్కనే ఉన్న టీటీడీ జేఈవో బసంత్‌కుమార్‌ ఇంటి కిటికీ మెష్‌ కత్తిరించి లోపలకు వెళ్లాడు. బీరువాలోని రూ.6.45 లక్షల విలువజేసే 175 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించాడు. ఓ ఐఏఎస్‌ ఇంట్లోనే చోరీ జరగడం జిల్లాలో చర్చనీయాంశమైంది. దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అర్బన్‌ ఎస్పీ.. ఈ రెండు కేసులను క్రైమ్‌ పోలీసులకు అప్పగించారు. క్రైమ్‌ అదనపు ఎస్పీ వెంకటేశ్వరనాయక్‌ నేతృత్వంలో డీఎస్పీ రామ్మోహన్‌ తన సిబ్బందితో దర్యాప్తు ప్రారంభించారు. 


మంగళవారం ఉదయం కరకంబాడివద్ద నిందితుడు గంగాధరరావును పట్టుకున్నారు. బంగారు నగలతోపాటు పద్మావతి గెస్ట్‌హౌస్‌లో చోరీచేసిన రూ.20 వేలలో రూ.15,200 స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల్లోనే చోరీకేసును ఛేదించినందుకు డీఎస్పీ రామ్మోహన్‌, క్రైమ్‌ సీఐలు చల్లనిదొర, మధుబాబు, మోహన్‌, హెడ్‌కానిస్టేబుల్‌ గోపి, కానిస్టేబుళ్లు గౌరినాయుడు, రామకృష్ణ, ప్రసాద్‌, వీఎన్‌ఎల్‌ ప్రసాద్‌ తదితరులను ఎస్పీ అభినందించారు. వారందరికీ రివార్డులు ఇస్తామన్నారు. దొంగను, స్వాధీనం చేసుకున్న నగలు, నగదును మీడియాకు చూపించారు. 

Updated Date - 2020-05-27T13:11:25+05:30 IST