లడ్డూ.. మిఠాయి!

ABN , First Publish Date - 2020-05-22T08:51:27+05:30 IST

‘వివాహాది శుభకార్యములకు మిఠాయిలు సప్లై చేయబడును’ ..చాలా స్వీట్‌షాప్‌ల ముందు కనిపించే బోర్డు! ‘బల్క్‌గా ఆర్డర్‌ ఇచ్చే వారికి శ్రీవారి లడ్డూలు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’...ఇది టీటీడీ బోర్డు

లడ్డూ.. మిఠాయి!

  • శ్రీవారి ప్రసాదాన్ని స్వీటులా మార్చారా?
  • ‘బల్క్‌’ సరఫరా నిర్ణయంపై విస్మయం
  • అప్పుడు అదనపు లడ్డూకు రూ.50
  • ఇప్పుడు... సగానికి తగ్గించి విక్రయం
  • దర్శనాలు లేకున్నా 3 లక్షలు తయారీ!
  • టీటీడీ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు
  • కారణమేమిటో తెలియక తికమక


(తిరుపతి - ఆంధ్రజ్యోతి): ‘వివాహాది శుభకార్యములకు మిఠాయిలు సప్లై చేయబడును’ ..చాలా స్వీట్‌షాప్‌ల ముందు కనిపించే బోర్డు! ‘బల్క్‌గా ఆర్డర్‌ ఇచ్చే వారికి శ్రీవారి లడ్డూలు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’...ఇది టీటీడీ బోర్డు చైర్మన్‌ చేసిన ప్రకటన! ఇప్పటిదాకా ఏ దేవస్థానంలోనైనా ప్రసాదాలను ‘కేటరింగ్‌’ తరహాలో ఆర్డర్లపై సరఫరా చేశారా? లాక్‌డౌన్‌ సమయంలో టీటీడీ మాత్రమే ఎందుకిలాంటి నిర్ణయం తీసుకుంది? దీని వెనుక కారణమేమిటి? లడ్డూల సరఫరాపై టీటీడీ బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రకటనతో  సాధారణ భక్తుల్లో తలెత్తుతున్న ప్రశ్నలివి! రాష్ట్రంలో ఉన్న అన్ని టీటీడీ కల్యాణ మండపాలతోపాటు... హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులోని సమాచార కేంద్రాల్లో శ్రీవారి లడ్డూలు అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. తిరుమలకు వెళ్లి వచ్చే వారంతా బంధువులు, మిత్రులకు లడ్డూ ప్రసాదాన్ని పంచిపెట్టడం దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. అయితే, కరోనా కారణంగా సామాన్యభక్తులకు దర్శనాలు ఆగిపోయి రెండు నెలలు దాటింది. దీనివల్ల ప్రసాదం అందడం లేదు. స్వామి వారికి పూజలు, కైంకర్యాలు యథాతథంగా జరుగుతున్నందున... స్వామికి నివేదించే ప్రసాదాన్ని రాష్ట్రవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉంచాలనుకోవడంలో తప్పులేదు. గతంలోనూ టీటీడీ సమాచార కేంద్రాలు, కొన్ని కల్యాణ మండపాలలో వారానికి ఒకరోజు పరిమిత సంఖ్యలో లడ్డూలను అందుబాటులో ఉంచేవారు. ఇప్పుడు... ‘బల్క్‌ ఆర్డర్లకు సప్లై చేస్తాం’ అనే నిర్ణయం శ్రీవారి లడ్డూలను అంగడి సరుకుగా మార్చారనే విమర్శలకు దారి తీసింది.


ధరలో మతలబేమిటో...

గతంలో లడ్డూ ధరలు రకరకాలుగా ఉండేవి. చేసుకున్న దర్శనాన్ని బట్టి భక్తులకు లడ్డూలు ఇచ్చేవారు. అదనపు లడ్డూలకు రూ.25 వసూలు చేసేవారు. ఆ తర్వాత పద్ధతి మార్చారు. తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఒక లడ్డూ ఉచితంగా ఇస్తూ మిగిలిన కేటగిరీలన్నింటిలో రాయితీ లడ్డూ లేకుండా రద్దు చేశారు. అదనపు లడ్డూ ధరను రూ.50కి పెంచారు. గత డిసెంబరులో తీసుకున్న ఈ నిర్ణయం ఈ ఏడాది జనవరి నుంచీ అమలవుతోంది. లడ్డూ తయారీలో నష్టం వస్తోందంటూ ఈ కొత్త పద్ధతి తీసుకొచ్చారు. తిరుమలలో విక్రయించే లడ్డూనే రూ.50కి పెంచిన టీటీడీ... ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సొంత ఖర్చులతో ఆయా కేంద్రాలకు చేర్చి విక్రయించే లడ్డూ ధరను మాత్రం సగానికి తగ్గించేసింది. ఒక్కో లడ్డూ రూ.25 చొప్పున ఎన్నయినా కొనుగోలు చేయవచ్చునని చెప్పారు. పెద్ద లడ్డూ(కల్యాణం లడ్డూ) ధరను కూడా రూ.200 నుంచి వందకు తగ్గించారు. వెరసి... లడ్డూల విషయంలో టీటీడీ ఐదు నెలల కిందట చెప్పిన మాటలకు, ఇపుడు చెబుతున్న మాటలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. 


దర్శనాల్లేకున్నా...

టీటీడీ రోజూ 3 నుంచి 4 లక్షల సాధారణ లడ్డూలను, 4 నుంచి 6 వేల పెద్ద లడ్డూలను, 3 నుంచి 4 వేల వడలు తయారు చేయిస్తుంది. బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక సందర్భాలలో రోజుకు 6 లక్షల వరకూ లడ్డూలు తయారు చేస్తారు.  ఇప్పుడు హఠాత్తుగా రోజుకు మూడులక్షల లడ్డూలు తయారు చేసి అమ్ముతామని టీటీడీ చైర్మన్‌ ప్రకటించారు. టీటీడీ ఈవోగా సాంబశివరావు ఉన్న సమయంలో... శ్రీవారి ఆలయాలు ఉన్నచోట మినహా మరెక్కడా లడ్డూల విక్రయాలు జరపకూడదని ఆదేశించారు. ఢిల్లీలోనూ శ్రీవారి ఆలయంతోపాటు ఏపీ భవన్‌లో కూడా లడ్డూలు విక్రయించాలన్న ప్రతిపాదనకు అంగీకరించలేదు. ఇప్పుడేమో.... శ్రీవారి ఆలయాలు, సమాచార కేంద్రాలు, కల్యాణమండపాలతోపాటు, బల్క్‌ ఆర్డర్లపైనా ప్రసాదాన్ని అందించాలని నిర్ణయించడం విశేషం. 


మతలబు ఏమిటో!

లాక్‌డౌన్‌ ముగిసి తిరిగి దర్శనాలు మొదలు పెట్టే సమయానికి లడ్డూల తయారీకి పోటు సిద్ధం కావాలి కాబట్టి ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నారనేది ఒక వాదన. అయితే... దీనికోసం రోజుకు 3 లక్షల లడ్డూలు తయారు చేయాల్సిన అవసరంలేదు. ప్రసాదం తయారీకి తెప్పించిన నెయ్యి, జీడిపప్పు, శనగల వంటి సరుకులు పాడైపోకుండా లడ్డూలు తయారు చేసి, భక్తులకు విక్రయిస్తుండవచ్చుననేది మరో వాదన. అయితే... లడ్డూలకు వాడే దినుసులేవీ అంత త్వరగా పాడైపోవని పోటు వర్గాలే చెబుతున్నాయి. పోనీ ఆర్థిక ఇబ్బందులా అంటే... అదేమీ లేదని టీటీడీ చెప్తోంది. మరి... ‘బల్క్‌’గా లడ్డూలు తయారు చేసి విక్రయించాలన్న నిర్ణయానికి కారణమేమిటి? లడ్డూల తయారీకి అవసరమైన సరకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లు నష్టపోకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది! టీటీడీ మాత్రం ‘భక్తుల కోరిక మేరకే’ అని చెబుతోంది. లోగుట్టు పెరుమాళ్లకే ఎరుక!

Updated Date - 2020-05-22T08:51:27+05:30 IST