దేవుడి సొమ్ముకు ఎసరు పెడతారా?

ABN , First Publish Date - 2020-10-18T16:51:46+05:30 IST

వెంకన్న సొమ్మును ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లలో పెట్టాలని టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది..

దేవుడి సొమ్ముకు ఎసరు పెడతారా?

టీటీడీ తీరుపై విమర్శల వర్షం.. వెనక్కి తగ్గిన యంత్రాంగం


తిరుపతి(ఆంధ్రజ్యోతి): వెంకన్న సొమ్మును ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లలో పెట్టాలని టీటీడీ పాలకమండలి తీసుకున్న  నిర్ణయంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. దీంతో వెనక్కి తగ్గిన టీటీడీ ఇకపై బ్యాంకు డిపాజిట్లకే పరిమితమవుతామంటూ శనివారం  రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది.టీటీడీ పెట్టుబడుల నిర్ణయంపై ‘‘అబ్బాయి సేవలో బాబాయ్‌’’ శీర్షికన శనివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం ప్రకంపనలు సృష్టిం చింది. పలువురు ప్రముఖులు దీనిపై స్పందించగా  పలు సంఘాలు నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిం చాయి.టీటీడీ వంటి  ఆధ్యాత్మిక ధార్మికసంస్థను వ్యాపార సంస్థగా మారిస్తే భక్తులు సహించరని తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ హెచ్చరించారు. శ్రీవారి నిధులను జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్‌ చేయాలని శ్రీవారి భక్తురాలిగా, స్థానిక మాజీ ఎమ్మెల్యేగా డిమాండ్‌ చేస్తున్నా నన్నారు. టీడీపీ తిరుపతి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు నరసింహ యాదవ్‌  అబ్బాయిసేవలో బాబాయి తరించ డం కోసం దేవుని సొమ్ముకు ఎసరు పెడతారా అంటూ ఎద్దేవా చేశారు.


శనివారం ప్రెస్‌క్లబ్‌లో టీడీపీ నేతలతో కలసి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ శ్రీవారి సొమ్ముతో పాలన సాగించడంకాదు.......చేతనైతే కేంద్రం మెడలు వంచి నిధులు తెచ్చుకుని పాలన సాగించాలన్నారు.టీడీపీ నాయకులు బీఎల్‌ సంజయ్‌, ఎస్‌.సుబ్బరామయ్య, ఆర్సీ మునికృష్ణ, రుద్రకోట సదాశివం, ఆనంద్‌గౌడ్‌,మనోహరాచారి పాల్గొన్నారు.పలమనేరులో మాజీ  మంత్రి అమర్‌ మీడియాతో మాట్లాడారు.టీటీడీ సొమ్మును రాష్ట్రప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లలో పెట్టేందుకు కుట్ర జరుగుతోందని తాను రెండునెలల క్రితం చెప్పిన విషయం నేడు నిజమైందని గుర్తు చేశారు.భగవంతుని సొమ్మును తాకిన ఎంతోమంది కాలగర్భంలో కలిసి పోయారని గుర్తు చేశారు.పార్టీ నాయకులు బ్రహ్మయ్య, సుబ్రమణ్యంగౌడు, మురళి, గిరబాబు, నవీన్‌కుమార్‌, సత్యప్రకాష్‌, ఖాజా, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర  ప్రభుత్వ ఖజానాకు టీటీడీ నిధులను మళ్లించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని టీడీపీ చిత్తూరు పార్లమెంట్‌ తెలుగు మహిళ అధ్యక్షురాలు కార్జాల అరుణ డిమాండ్‌ చేశారు.టీటీడీ సొమ్ము కాజేయాలనుకునే వాళ్లు ఎంతటి వారైనా దేవుడే శిక్షకు గురి కాక తప్పదని తెలిపారు.


అడ్డగోలు నిర్ణయాలను విరమించుకోకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.బైరాగిపట్టెడలోని పద్మావతి పార్క్‌ వద్ద  జనసేన నేతలు  రాజారెడ్డి, సుభాషిణి,బాబ్జి, అమృత, కొండా రాజమోహన్‌, మహేష్‌రాయల్‌, అరుణ్‌రెడ్డి, మనోజ్‌కుమార్‌, బాలకృష్ణ తదితరులు ధర్నా నిర్వహించారు.హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరి స్తోందని దుయ్యబట్టారు.వెంకన్న సొమ్ముకు వడ్డీకన్నా భద్రత ముఖ్యమని కాంగ్రెస్‌ నేత నవీన్‌కుమార్‌ రెడ్డి అన్నారు.టీటీడీ పాలకమండలి సమావేశంలో తీసుకున్న 311 తీర్మానానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు. శ్రీవారితో చెలగాటం ఆడితే పాలకులు, అధికారులు అంతులేకుండా పోతారని నిందించారు. అలిపిరి వద్ద టీటీడీ రెజల్యూషన్‌ కాపీని చేతపట్టి నిరసన తెలిపారు.టీటీడీ నిధులను మళ్లించే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్‌ ప్రశ్నించారు.చిత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.


బీజేపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి జయకుమార్‌, నేతలు రామమూర్తి, గురు గణేష్‌, సునీల్‌, వేలు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.మరో బీజేపీ నాయకుడు, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాష్‌ రెడ్డ్డి టీటీడీ నిధులు దారిమళ్లించకుండా జాతీయ బ్యాంకుల్లోనే ఉంచాలని హైకోర్టులో ప్రజాప్రయోజనాల వాజ్యం వేస్తానని ప్రకటించారు. ఇందులోభాగంగా టీటీడీ ధర్మకర్తల మండలికి శనివారం నోటీసులు ఇచ్చానన్నారు. టీటీడీ సొమ్మును తీసుకుందామనుకుంటున్న సర్కారు అదేవిధంగా వక్ఫ్‌బోర్డు, క్రిస్టియన్‌ మిషనరీ సంస్థల ఆస్తులనుంచి ఒక్క రూపాయి అయినా తెచ్చుకోగలదా అని ప్రశ్నించారు.టీటీడీ నిధులను ప్రభుత్వ ఖజానాలోకి దారి మళ్లించే ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఎం నాయకులు ఎ.పుల్లయ్య, కందారపు మురళి డిమాండ్‌ చేశారు. టీటీడీ పరిపాలన భవనం ఎదుట శనివారం నిధులు తరలించరాదంటూ ధర్నాకు దిగారు. ఎస్‌.జయచంద్ర, టి.సుబ్రహ్మణ్యం, జి.బాలసుబ్రహ్మణ్యం, గురుప్రసాద్‌, ఆర్‌.లక్ష్మి, బుజ్జి, నరేంద్ర, బాలాజీ, అక్బర్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2020-10-18T16:51:46+05:30 IST