Abn logo
Sep 22 2021 @ 03:22AM

సర్వదర్శనం టోకెన్లకు పడిగాపులు

శ్రీనివాసం కాంప్లెక్స్‌కు పోటెత్తిన భక్తులు 

వరుసగా మూడు రోజుల టోకెన్ల జారీ 

కోటా మరింత పెంచాలన్న డిమాండ్లు


తిరుపతి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): శ్రీవారి సర్వదర్శనం టోకెన్లకు భక్తజనం పోటెత్తుతున్నారు. తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్సుకు వేలాదిగా తరలివస్తున్నారు. టీటీడీ రోజుకు 8వేల టోకెన్లు ఇస్తుంటే అంతకు మూడింతల మంది రావడంతో ఒక్కరోజే మూడు రోజుల కోటాను ఇచ్చేశారు. మంగళవారం దర్శన టోకెన్లు ఉదయం 3.30గంటలకే అయిపోయాయి. అప్పటినుంచి జనం శ్రీనివాసంలోని క్యూల్లోనే పడిగాపులు కాశారు. బయట కూడా రద్దీ తీవ్రం కావడంతో సాయంత్రం 6గంటలకే బుధవారం దర్శనం టోకెన్లు ఇచ్చారు. రాత్రి 9గంటలకు అవీ అయిపోవడంతో గురువారం కోటా కూడా విడుదల చేశారు. దీంతో భక్తులకు దర్శనానికి నిరీక్షణ సమయం పెరిగిపోయింది. సాయంత్రం 6గంటలకు టోకెన్‌ తీసుకున్నవారికి బుధవారం రాత్రి 9గంటలకు, దర్శన సమయం ఇచ్చారు. రాత్రి 9గంటలకు టోకెన్‌ కట్టించుకున్న భక్తులకు గురువారం రాత్రి 8గంటల నుంచి దర్శనం కేటాయించారు. అంటే వారు 48 నుంచి 50 గంటలు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉచిత దర్శనాల టోకెన్ల సంఖ్యను మరింత పెంచాలని భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు.