శాస్త్రోక్తంగా చక్రధారికి చక్రస్నానం

ABN , First Publish Date - 2021-10-17T09:07:53+05:30 IST

శాస్త్రోక్తంగా చక్రధారికి చక్రస్నానం

శాస్త్రోక్తంగా చక్రధారికి చక్రస్నానం

పాల్గొన్న సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ, హైకోర్టు సీజే 

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు 


తిరుమల, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన శుక్రవారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. కొవిడ్‌-19 నేపథ్యంలో పుష్కరిణిలో నిర్వహించాల్సిన చక్రస్నానాన్ని ఆలయంలోనే నిర్వహించారు. ఉదయం 8నుంచి 11గంటల మధ్య ఐనామహల్‌ ముఖమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి, సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.  10గంటలకు ఐనా మహల్‌ ముందు ప్రత్యేకంగా నిర్మించిన చిన్న పుష్కరిణి(నీటితొట్టి)లో సుదర్శన చక్రానికి స్నానం చేయించారు.  రాత్రి 7 గంటలకు ఆలయంలో బంగారు తిరుచ్చి ఉత్స వం, 8 నుంచి 9 గంటల మధ్య ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. రంగనాయకుల మండపంలో శనివారం భాగ్‌సవారీ ఉత్సవం ఏకాంతంగా నిర్వహించారు. 


శ్రీవారి సేవలో జస్టిస్‌ ఎన్వీ రమణ 

శుక్రవారం సుప్రీంకోర్టు ప్రఽధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద ఆయనకు ఈవో జవహర్‌రెడ్డి తదితరులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. తర్వాత గర్భాలయానికి చేరుకుని స్వామి మూలమూర్తిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో  వేదపండితులు ఆశీర్వచనం చేశారు. అఖిలాండం వద్ద బేడి ఆంజనేయస్వామిని దర్శించి కొబ్బరికాయలు సమర్పించారు. 


శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు సీజే 

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో తొలిసారిగా ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాకు అధికారులు, అర్చకులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు.  రంగనాయక మండపంలో వేదాశీర్వచనం, లడ్డూప్రసాదాలు, డైరీ, కేలండర్లు అందజేశారు.    అఖిలాండం వద్ద కొబ్బరికాయలు సమర్పించారు. అంతకుముందు జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ పీకే మిశ్రా చక్రస్నానంలో పాల్గొన్నారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి నిర్వహించిన స్నపన తిరుమంజనం, సుదర్శన చక్రాన్ని పుష్కరిణి జలంలో ముంచే ఘట్టాన్ని తిలకించారు. వీరితో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ హిమా కోహ్లీ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ లలితకుమారి, జస్టిస్‌ సత్యనారాయణమూర్తి, ఛత్తీ్‌సగడ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రతీం సాహు, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సోమరాజన్‌ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. 





Updated Date - 2021-10-17T09:07:53+05:30 IST