Abn logo
Sep 25 2021 @ 03:01AM

టీటీడీ వయా జియో!

మరో వివాదంలో దేవస్థానం 

జియోమార్ట్‌ సైట్‌ ద్వారా శ్రీవారి దర్శన టికెట్ల అమ్మకం 

దేవస్థానం సైట్‌లోకి  లాగిన్‌ అయిన భక్తులకు షాక్‌ 

వెబ్‌సైట్‌ను కూడా అమ్మేశారా అంటూ నెటిజన్ల ప్రశ్నలు 

భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండాలనే జియో సేవలు: ఏఈవో

‘మొదటి డోసు’ భక్తులకూ శ్రీవారి దర్శనం


తిరుమల, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): టీటీడీ మరో వివాదంలో చిక్కుకుంది. దర్శన టికెట్ల కోసం దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయిన తర్వాత ‘జియోమార్ట్‌’ సబ్‌డొమైన్‌లోకి వెళ్లడంపై నెటిజన్లు మరోసారి విమర్శల వర్షం కురిపించారు. శ్రీవారి వెబ్‌సైట్‌ను కూడా అమ్మేశారా అంటూ టీటీడీ అధికారులపై విరుచుకుపడ్డారు. అక్టోబరుకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ‘తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్‌’ ద్వారా టీటీడీ శుక్రవారం ఉదయం 9గంటలకు విడుదల చేసింది.


ప్రస్తుతం కొవిడ్‌ తీవ్రత తగ్గుతుండటం, టికెట్ల సంఖ్య పరిమితంగా ఉండటంతో శ్రీవారి దర్శనానికి డిమాండ్‌ పెరిగింది. పైగా పెరటాసి మాసం కూడా కావడంతో దర్శన టికెట్ల కోసం భారీస్థాయిలో భక్తులు ఎదురుచూస్తున్నారు. వీరంతా శుక్రవారం సైట్‌లోకి లాగిన్‌ అయ్యారు. తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్‌లోకి ప్రవేశించి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోసం ఆప్షన్‌ క్లిక్‌ చేసిన వెంటనే ‘తిరుపతిబాలాజీ. జియోమార్ట్‌’ అనే సబ్‌ డొమైన్‌ పేజీకి వెళ్లింది. దీంతో ‘టీటీడీ వెబ్‌సైట్‌ని కూడా అంబానీకి అమ్మేశారా?, టీటీడీకి, జియోమార్ట్‌కు సంబంధం ఏంటి? టీటీడీ వెబ్‌సైట్‌ను అంబానీకి కట్టబెట్టిన జగన్‌ ప్రభుత్వం’ అంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు విమర్శించారు. మరోవైపు ఈ అంశంపై పలువురు రాజకీయ నేతలు కూడా టీటీడీతో పాటు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 


ఎందుకిలా జరిగింది? 

సాధారణంగా అన్‌లైన్‌ కోటా టికెట్లు టీటీడీ వెబ్‌సైట్‌లోనే జారీ చేస్తారు. సర్వర్‌ సామర్థ్యం సరిపోకపోవడంతోపాటు ఉచిత సేవలందిస్తామని జియో ముందుకు రావడంతో దానికి కేటాయించినట్లు టీటీడీ చెబుతోంది. అయితే టీటీడీ వెబ్‌సైట్‌ నుంచి తిరుపతిబాలాజీ.జియోమార్ట్‌ వెబ్‌సైట్‌కు రీడైరెక్ట్‌ చేసి టోకెన్లు ఇచ్చారు. జియోమార్ట్‌ కనిపించడంతోనే భక్తుల్లో సందేహాలు మొదలయ్యాయి. శ్రీవారి దర్శనాలు కూడా మార్ట్‌ ద్వారా అమ్మ కం సరుకు అయిపోయిందా అంటూ సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. కేవలం జియో అని మాత్రమే ఉంటే ఇంత దుమారం రేగేది కాదని, ఇప్పుడు లక్షలాది మందికి జియో మార్ట్‌ వెబ్‌సైట్‌ ఒక్కరోజులో పరిచయమైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శుక్రవారం కోటి మందికి పైగా సైట్‌ను విజిట్‌ చేసినట్టు టీటీడీ ఉన్నతాధికారులు మీడియాకు చెప్పారు. ఏ వ్యాపార వెబ్‌సైట్‌కు అయినా ఒకేసారి ఇలా ప్రవాహంలా రావడం అరుదు. రూ.కోట్లు ఖర్చు పెట్టినా సాధ్యం కాని ప్రచారం జియోమార్ట్‌కి లభించిందనే వాదన వినిపిస్తోంది.