శశికళ రాజకీయాలకు గుడ్‌బై చెప్పాక దినకరన్ నిర్ణయమిదీ..

ABN , First Publish Date - 2021-03-05T17:33:06+05:30 IST

శశికళ రాజకీయాల నుంచి వైదొలిగిన కారణంగా..

శశికళ రాజకీయాలకు గుడ్‌బై చెప్పాక దినకరన్ నిర్ణయమిదీ..

  • అన్ని నియోజకవర్గాల్లో పోటీ
  • 10న అభ్యర్థ్ధుల జాబితా విడుదల
  • ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి దినకరన్‌

చెన్నై/ప్యారీస్‌ : మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ రాజకీయాల నుంచి వైదొలిగిన కారణంగా 234 శాసనసభ నియోజకవర్గాల్లో ఒంటిరిగా పోటీచేసేందుకు అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ నిర్ణయించారు. విజయం సాధించి తీరాలన్న పట్టుదలతో ఒక్కో నియోజకవర్గానికి రూ.5 కోట్లు చొప్పున నిధులు కేటాయించినట్టు తెలిసింది. మరోవైపు బీజేపీ కూటమిలో చేరేందుకు ఆహ్వానిస్తే వెళ్లేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిని చిత్తుగా ఓడించి మళ్లీ అన్నాడీఎంకేకు అధికారం అప్పజెప్పాలన్న కోరికతో బీజేపీ పావులు కదుపుతోంది. ఇది జరగాలంటే డీఎంకేను బద్ధశత్రువుగా భావిస్తున్న ఏఎంఎంకేను తమ కూటమిలో చేర్చుకొనేందుకు బీజేపీ పెద్దలు కూడా అంగీకరించారు. బీజేపీ నేతలు తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం సహా అన్నాడీఎంకే సీనియర్‌ నేతలు అంగీకరించలేదు. 


ఈ నేపథ్యంలో, ఏఎంఎంకే తరఫున ఎన్నికల్లో పోటీచేయదలచుకున్న ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ బుధవారం నుంచి ప్రారంభమైంది. రెండవ రోజైన గురువారం వరకు 1,000 మందికిపైగా అభ్యర్ధులు పోటీచేసేందుకు ముందుకొచ్చారు. ఇదిలా ఉండా, పార్టీ జిల్లా కార్యదర్శులు, జిల్లా నిర్వాహకులతో గురువారం ఉదయం సమావేశమైన దినకరన్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. ఎన్నికల ప్రచార వాహనం, పోస్టర్లలో జయలలిత ఫోటో మాత్రం ముద్రించాలని, ఒక నియోజకవర్గానికి రూ.5 కోట్లు చొప్పున కేటాయించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.

Updated Date - 2021-03-05T17:33:06+05:30 IST