`నిన్ను కోరి`, `మజిలీ` వంటి సున్నితమైన ప్రేమకథలు తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాణతో కలిసి నేచురల్ స్టార్ నాని చేస్తున్న చిత్రం `టక్ జగదీష్`. రీతూవర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు.
అధికారికంగా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. అయితే అదే తేదీన `లవ్‌స్టోరీ`ని విడుదల చేస్తున్నట్టు తాజాగా ప్రకటన వచ్చింది. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రం `లవ్‌స్టోరీ`. సునీల్ నారంగ్ ఈ సినిమాకు నిర్మాత. ఈ సినిమా విడుదలకు 16వ తేదీనే ఎంచుకున్నారు. దీంతో `టక్ జగదీష్` విడుదల ఓ వారం వాయిదా పడే అవకాశాలున్నట్టు సమాచారం. నైజాంలో థియేటర్ల సర్దుబాటు నేపథ్యంలో `టక్ జగదీష్` వెనక్కి వెళ్లే అవకాశమున్నట్టు తెలుస్తోంది.